మన ‘నాటు’ పాటకు ఆస్కార్.. తెలంగాణ బిడ్డ, రచయిత చంద్రబోస్ కు కేసీఆర్ ప్రత్యేక అభినందన.. టీఎస్పీఎస్సీ నుంచి లీకైన పేపర్ ఇదే.. మాజీ మంత్రి కన్నుమూత.. రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు.. నేటి టాప్ న్యూస్ ఇవే

నాటు.. నాటు.. పాటకు ఆస్కార్

ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట… ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్టైంది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్‌‌గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్‌ ప్రతిమ అందుకున్నారు.

సీఎం కేసీఆర్ అభినందన

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ‘ఉత్తమ ఒరిజనల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాటలో పొందు పరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం అన్నారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

లీకైంది ఏఈ పేపర్

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పోస్టుల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయని అధికారులు విచరణ జరపగా.. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్లు తేలింది. మొత్తం 837 అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు 55 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మంగళవారం జరగనున్న కమిషన్‌ ప్రత్యేక సమాశంలో ఈ పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు.

తమ్ముడి కోసం అక్క అడ్డదారులు..


ఓ గురుకుల టీచర్ తన తమ్ముడికి ఏఈ ఉద్యోగం కోసం ఈ లీకేజీకి కారణమైందని పోలీసులు గుర్తించారు. భర్తతో కలిసి టీఎస్‌పీఎస్సీ లో పనిచేసే ఉద్యోగులను మచ్చిక చేసుకొని ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రేణుక ఓ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు టీఎస్పీఎస్సీ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేసే ప్రవీణ్ తో ఆమెకు పరిచయం ఉంది. దీంతో ఆ పరిచయంతో తన తమ్ముడి కోసం ఏఈ పేపర్ ను లీక్ చేయాలని భావించింది. ఇందుకు ప్రవీణ్ తో రూ.10 లక్షలతో బేరం కుదుర్చుకుంది. ఇందుకు మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సహకారాన్ని ప్రవీణ్ తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ప్రవీణ్ రెండు ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ఈ నెల 2న రేణుకకు అందించాడు. అయితే.. రేణుక అంతటితో ఆగకుండా ఆ ప్రశ్నాపత్రాలను ఇతర అభ్యర్థులకు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది. అందుకు తన భర్తతోపాటు.. తమ్ముడి సహకారం తీసుకుంది. వారు మేడ్చల్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కజిన్‌ శ్రీనివాస్ కు లీకేజీ ప్రశ్నపత్రాల గురించి చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే చెప్పాలని అడిగారు. అతను మరో ఇద్దరు స్నేహితులు నీలేశ్‌నాయక్‌, గోపాల్‌ నాయక్‌ ఏఈ సివిల్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతున్నారని చెప్పాడు. దాంతో రేణుక ఆమె భర్తతో కలిసి వారికి పేపర్‌ను విక్రయించింది. వారితో పాటు వారి మరో స్నేహితుడికి ప్రశ్నపత్రాన్ని విక్రయించి మొత్తం రూ.13.50 లక్షలు సొమ్ము చేసుకున్నారు.

మరో బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్కలు

తెలంగాణలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. రఘునాధపాలెం మండల పరిధిలోని పుటాని తండాకు చెందిన బానోత్ రవీందర్, సంధ్యల చిన్న కుమారుడు బానోత్ భరత్ (5) ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడు కుక్కలాగా ప్రవర్తించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఖమ్మం నగరంలోని రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్లగా సిరియస్ గా ఉండటంతో ఎవరరూ అడ్మిట్ చేసుకోలేదు. దీంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తుండగా.. సూర్యపేట వద్దకు చేరుకోగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

మాజీ మంత్రి కన్నుమూత

సీబీఐ మాజీ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కే విజయరామరావు సోమవారం అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. విజయరమణారావు స్వగ్రామం ములుగు జిల్లా ఏటూరునాగారం. సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. పదవీ విరణమ తర్వాత టీడీపీలో చేరి ఖైరతాబాద్ నుంచి మాజీ మంత్రి పీజేఆర్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విజయరామారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఈ నెల 15 నుంచి 18 వరకు… దక్షిణ భారతదేశంలో ఉరుములు, వడగళ్లతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ‘హీట్ వేవ్’ ప్రభావం తగ్గుతుందని అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో మాత్రం వర్ష సూచన లేదు. తెలంగాణలోని ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల , మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 16న నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం , నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగగా 90.40 శాతం ఓటింగ్‌ నమోదైంది. 29,720 మంది ఉపాధ్యాయ ఓటర్లలో దాదాపు 26,866 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా గద్వాల్‌ జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాల్లో 82.25 శాతం ఓట్లు పోలయ్యాయి. 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 137 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 16న సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుంది.

రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్ని మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒకపూట బడులను  నిర్వహించాలని పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్నాహ్న భోజనం పెట్టాలని సూచించింది.  టెన్త్  ఎగ్జామ్స్ ఉన్న కేంద్రాల్లో  మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించింది.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చి 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వసతులు కల్పించాలని.. పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో మంచినీళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అర గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc