ఇంత అజాగ్రత్తా?: టీఎస్పీఎస్సీపై కేసీఆర్ అసంతృప్తి.. లీకేజీ బీజేపీ కుట్రే: కేటీఆర్ సంచలన ఆరోపణలు.. లీక్ కు కారణం ఐటీ మంత్రే: రేవంత్ రెడ్డి.. ఢిల్లీ మద్యం కేసులో మరో ట్విస్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. నేటి టాప్ న్యూస్ ఇవే..

పేపర్ లీకేజీపై కేసీఆర్ సమీక్ష

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిన్న ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మీజీ చైర్మన్ చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు టీఎస్పీఎస్సీ అందించిన నివేదికపై కేసీఆర్ చర్చించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, అనంతర పరిణామాలపై సీఎం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల భద్రత, నిల్వపై జాగ్రత్తలు తీసుకోకపోవడం సరికాదని వాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. రద్దు చేసిన పరీక్షలన్నింటినీ సత్వరమే పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. పరీక్షలకు సంబంధించిన రహస్య విభాగాల పర్యవేక్షణ బాధ్యత టీఎస్పీఎస్సీ కార్యదర్శికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఎవరినీ వదలం: ఇది బీజేపీ కుట్రే: కేటీఆర్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా వదలమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా గ్రూప్-1తో పాటు రద్దయిన పరీక్షలన్నింటినీ నిర్వహిస్తామన్నారు. గతంలో పరీక్ష రాసిన వారికి ఫీజు మినహాయింపు ఇస్తామన్నారు. ఇంకా అభ్యర్థుల కోసం ఆన్లైన్లో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. పేపర్ల లేకేజీ వెనక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీపై అనుమానంతో ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ క్రియాశీల కార్యకర్త అని కేటీఆర్ అన్నారు. అభ్యర్థులు అపోహలు నమ్మవద్దని కోరారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ఐటి మంత్రి రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ కంప్యూటర్ కు నేనే బాధ్యుడినా? అని ప్రశ్నించారు. పేపర్ లికేజీకి- ఐటి మంత్రికి సంబంధిం ఏంటన్నారు. అస్సాం, యూపీ, గుజరాత్ లో పేపర్ లీక్ లు జరిగాయని.. అక్కడ మంత్రులు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు.

మద్యం కేసులో మరో కీలక పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ స్పందించింది. ఆమె పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎటువంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఈడీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత తన పిటిషన్‌లో ఈడీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 8.30 గంటల వరకు కూర్చోబెట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు థర్డ్‌ డిగ్రీ పద్ధతులు అవలంభిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. నళినీ చిదంబరం కేసులో మహిళను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఒత్తిడి చేయబోమని ఈడీ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిందని, అయినా కూడా తనను కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఆమె పిటిషన్‌పై ఈ నెల 24న కోర్టు విచారణ జరపనుంది. అదే రోజు ఈడీ వాదనలు కూడా వినే అవకాశం ఉంది.

పేపర్లన్నీ ముందు బీఆర్ఎస్ దొంగలకే: రేవంత్

రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఆర్ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరని కేసీఆర్ ను ప్రశ్నించారు. బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీ కి పంపించిన కేసీఆర్ పేపర్ లీకేజీని పట్టించుకోలేదని మండిపడ్డారు.

సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం సెర్ఫ్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా అనతి కాలంలోనే కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ ఎం ఎస్ నంబర్ 11 ను జారీ చేసింది. దీంతో 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి జీతాలు, వేతనాలు భారీగా పెరిగనున్నాయి. మొత్తం 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పే స్కేలు అమలులోకి రానున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు.

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

నేడు కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, , జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలన్న సజ్జనార్

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలని చెప్పారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీయువకులు మరణించడంపై సజ్జనర్‌ స్పందించారు.

కవితను కావాలని అనలేదు: బండి సంజయ్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా మాట్లాడినవే తప్ప అందులో వేరే ఉద్దేశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మహిళా కమిషన్‌కు తెలిపారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినపుడు కవితను అక్క అనే సంబోధించానని వెల్లడించారు. ఇదే అంశంపై కమిషన్‌కు రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితపై ఓ సమావేశంలో సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్‌.. ఆయనను విచారణకు రావాలని ఆదేశించింది. శనివారం విచారణకు హాజరైన సంజయ్‌ని.. కమిషన్‌ సుమారు మూడు గంటల పాటు విచారించింది. ఈ క్రమంలో మహిళల పట్ల సంజయ్‌ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను చూపించి విచారించినట్టు సమాచారం. భవిష్యత్‌లో మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం.

కుక్కల దాడిలో 14 మందికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో కుక్కల స్వైర విహారం కొనసాగుతోంది. తాజాగా ఇంద్రవెల్లి లో పిచ్చికుక్కలు స్వైర విహారం సృష్టించాయి. ఇంద్రవెల్లి లో శనివారం సాయంత్రం వరకు మొత్తం 14 మందికి పైగా జనాలదాడి చేసి గాయపరిచాయి. వారంతా ఇంద్రవెల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here