పేపర్ లీక్: వెలుగులోకి సంచలన విషయాలు.. ఢిల్లీకి కవిత: విచారణకు వెళ్తదా?.. పేపర్ లీక్ లో కేటీఆర్ పీఏ: రేవంత్ రెడ్డి.. ఆ మండలం నుంచి 50 మంది క్వాలిఫై ఎలా: బండి సంజయ్.. మరో 2 రోజులు వానలు.. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. నేటి టాప్ న్యూస్ ఇవే..

అనేక మందికి గ్రూప్-1 పేపర్?

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలో విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఏఈ, టౌన్ ప్లానింగ్ పేపర్లు మాత్రమే లీక్ అయ్యాయయని చెప్పిగా.. మరిన్ని పేపర్లు లీక్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. వీరు గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ను అనేక మంది అభ్యర్థులకు అందించినట్లు సిట్ గుర్తించింది. వీరు ఎవరెవరికి ఈ పేపర్ అమ్మారన్న అంశాన్ని తేల్చేందుకు సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారి లిస్ట్ తయారు చేసి.. వారిలో అనుమానితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

నేడే కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, భర్త అనిల్, ఎంపీలు సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉన్నారు. ఢిల్లీ వెళ్లినప్పటికీ.. కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత ఈనెల 11న ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, 16న మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. 16న ఢిల్లీ వెళ్లిన కవిత చివరి నిమిషంలో విచారణకు వెళ్లేందుకు నిరాకరించారు. తన ప్రతినిధిని మాత్రమే పంపించారు. 14వ తేదీన ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు వెళ్లారు.

పేపర్ లీక్ పై రేవంత్ ఆరోపణలు

పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పీఏ, రాజశేఖర్ ల సన్నిహితులకు మాత్రమే గ్రూపు 1 లో అత్యధిక మార్కులు వచ్చాయని ఆరోపించారు. గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్ కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ ను టీఎస్పీఎస్సీకి పంపించారన్నారు. అక్కడ పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. గతంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటో ర్యాంక్, రజనీకాంత్ కు 4వ ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని రేవండ్ డిమాండ్ చేశారు.

ఆ మండలం నుంచి 50 మంది ఎలా క్వాలిఫై అయ్యారు?

గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పని చేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు క్వాలిఫై అయినట్లు బండి సంజయ్ ఆరోపించారు. ఒకే మండలం నుండి 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారన్నారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. వీరంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పని చేసే వాళ్లేనని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జి విచారణతోనే ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ తీరుతోనే ఆత్మహత్మలు

సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇచ్చి.. నియామకాలు పూర్తి చేస్తే నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లలో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల పరామర్శించారు. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. నవీన్ ది బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తల కుటుంబమన్నారు. అయినా మానవత్వం తో పరామర్శకు వచ్చామన్నారు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నది నిరుద్యోగంతోనే అని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మచ్చలేని ఐఏఎస్‌ అధికారిగా జనార్ధన్‌రెడ్డి 35 ఏళ్ల సర్వీసు.. ఒకెత్తు అయితే 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ఒకెత్తని అన్నారు. ఆదివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడారు. ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌, అప్రూవల్‌ అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు పేపర్లు ఎలా లీకయ్యాయో చెప్పాలన్నారు. ఈ కేసులో జనార్ధన్‌రెడ్డిని నిందితుడిగా చేర్చి విచారించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. గ్రూప్‌-1పై ప్రత్యేక కేసు నమోదు చేసి విచారణ చేయాలన్నారు.

మరో 2 రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆరెంజ్​ అలర్ట్​ను ఎల్లో అలర్ట్​కు తగ్గించింది. మంగళవారం కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.

రెండు ముక్కలుగా విడిపోయిన గ్రానెట్ లారీ

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై రోడ్డుపై గ్రానైట్ లారీ రెండుగా విడిపోయింది. గ్రానెట్ రాయితో ఉన్న లారీ వెనుక భాగం రోడ్డు మధ్యలోనే ఉండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.1,250 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here