సీఎం కేసీఆర్ ఉగాధి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సీఎం అన్నారు. ‘శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
పేపర్ లీకేజీపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు ఆదేశాలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన దర్యాప్తు పై నివేదిక ఇవ్వాలని సిట్ ను హైకోర్టు ఆదేశించంది. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిగిపింది. దర్యాప్తు పక్షపాతంగా జరుగుతోందనడానికి ప్రాథమికంగా ఆధారాల్లేవని హైకోర్టు వాఖ్యానించింది.
10 గంటల పాటు సాగిన కవిత విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఈడీ విచారణను ఈడీ వరుసగా రెండో రోజు మంగళవారం విచారించింది. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారణ సాగింది. విచారణ తర్వాత పిడికిలి బిగించి అభిమానులకు కవిత అభివాదం చేశారు. అయితే తదుపరి విచారణ ఎప్పుడనేది ఈడీ ఇంకా వెల్లడించలేదని కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. విచారణకు ముందు గతంలో తాను వాడిన ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. తనపై అనవసరంగా బుదరజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గాంధీ మనువరాలి కన్నుమూత
మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ మంగళవారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. ఐదేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధికి గతంలో ఆమె ఛైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలోనే గోకనీ బాల్యం సాగింది.
పేపర్ లీకేజీలకు కామన్: మంత్రి ఇంద్రకరణ్
పరీక్షల్లో పేపర్ లీకేజీలు సాధారణంగా జరుగుతుంటాయని, గతంలో టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలోనూ లీకేజీలు జరిగాయని, అలాగే టీఎ్‌సపీఎస్సీ పరీక్షల్లో కూడా జరిగి ఉండొచ్చని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నిర్మల్ జిల్లాకేంద్రంలోని తన క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పొరపాట్లు జరిగి ఉండవచ్చని, దీనిని రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. లీకేజీ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌ల పాత్ర ఉందన్న ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్ర అధికారి చేతిలో సిట్: రేవంత్
ఆంధ్రాకు చెందిన సిట్ విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ చేతిలో టీఎస్పీఎస్సీ తాళాల గుత్తి పెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సిట్ అంటేనే సిట్ అండ్ స్టాండ్ అని.. సిట్ అధికారి ఆంధ్ర అయినప్పుడు ఇక ఇచ్చే రిపోర్టు ఎట్లుంటదని? అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడికి పోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కేసు విచారణ సరిగా జరగాలన్నందుకు తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీలో కమిషన్ చైర్మన్, కార్యదర్శిలతో పాటు సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మినీ బాధ్యురాలిగా చేర్చాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీకి ఓనర్లు చైర్మన్, కార్యదర్శి అయితే.. కాపలాదారు శంకరలక్ష్మి అని అన్నారు. పనోళ్లు ప్రవీణ్, రాజశేఖర్ అని పేర్కొన్నారు. ఈ కేసులో పనోళ్లను బాధ్యులు చేసి మూసేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
కూతురి లవ్ మ్యారేజ్: తల్లి ఆత్మహత్య
కూతురి లవ్ మ్యారేజ్ చేసుకుందని మానసిక వ్యధకు గురైన తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి జయానగర్‌కాలనీలోని మైత్రేయి నిలయంలో ప్రైవేటు ఉద్యోగి గోనుగుంట శ్రీనివాసరావు, నిర్మల(45) కుటుంబం ఉంటోంది. వీరికి కుమారుడు సాయితేజ, కుమార్తె ఉన్నారు. కుమార్తె తన సహ విద్యార్థిని ప్రేమించింది. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తల్లి మదనపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం ఉదయం బెడ్‌రూంలోకి వెళ్లి తలుపేసుకుని, ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు మరో తాళంచెవితో తలుపులు తెరిచి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కన్పించింది.
టెన్త్ విద్యార్థికి కరస్పాండెంట్ వేధింపులు
భువనగిరి లో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించాడని కరస్పాండెంట్ పై కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆదివారం ప్రత్యేక తరగతులు పేరుతో తన ఛాంబర్ కు పిలిపోయించుని విద్యార్థి పట్ల అసభ్య కరంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులకు విద్యార్థిని తెలిపింది. దీంతో వారు పాఠశాలకు చేరుకుని కరస్పాండెంట్ ను నిలదీస్తుదీశారు. రంగంలోకి దిగిన పోలీసులు కరస్పాండెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.