ఎకరాకు రూ.10 వేల పరిహారం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. నష్టపోయిన పంటకు సంబంధించి ఎకరానికి రూ.10 వేల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం వెంటనే రూ.228 కోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు సైతం పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలువురు బాధిత రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు షాకిచ్చింది. 2019లో ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ ఆయన చేసిన వాఖ్యలపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన కోర్టు గురువారం రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై అప్పీలకు 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకు శిక్ష నిలిపివేసింది.
బండి సంజయ్, రేవంత్ కు కేటీఆర్ నోటీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఆర్టీసీలో డైనమిక్ స్రైసింగ్
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఫైలట్ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ చార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్‌డ్ డేటా అనాలసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్ ధర ఉంటుంది.
కేసీఆర్.. ఓ మోసగాడు: షర్మిల
నిరుద్యోగులను నిలువునా ముంచడమే కాదు, వారి జీవితాలను, వారి కుటుంబాల ఆశలను అత్యంత కిరాతకంగా చిదిమివేసిన మహామోసగాడుగా చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతాడని వై ఎస్ షర్మిల ధ్వజమెత్తారు. నేడు మనం చూస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ, కేసీఆర్ సర్కారు, వీరి వీరి కోటరీలో ఉన్న అధికారులు చేస్తున్న అక్రమాల్లో కేవలం సముద్రంలో నీటుబొట్టు లాంటివన్నారు. అసలు దారుణం ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ ప్రకటించిన 80వేల ఉద్యోగాలలో ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదలైంది కేవలం 26వేల ఉద్యోగాలకు మాత్రమేనన్నారు. మిగతా 54వేల ఉద్యోగాలకు ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదన్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడ ఇయ్యకుండా మోసం చేసిన నెంబర్ 1 మోసగాడుగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కుతాడని విమర్శలు గుప్పించారు షర్మిల.
విచారణకు హాజరైన రేవంత్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మాల్యాలకి చెందిన నిందితుడు రాజశేఖర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులిచ్చారు. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. మల్యాల మండలంలో ఎలాంటి మెరిట్ స్టూడెంట్స్ కాకున్నా 100 మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ తెలిపారు. “నా దగ్గర ఉన్న ఆధారాలను ఏఆర్ శ్రీనివాస్‌కి ఇచ్చాను. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు దీనిపై స్పందించారు. నాతో పాటు బండి సంజయ్, కేటీఆర్ కూడా స్పందించారు. మేము ముగ్గురం కూడా మాకు ఉన్న సమాచారాన్ని బయట పెట్టాం. నాకు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మాత్రమే నోటీసులు ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరు వ్యక్తులే నేరం చేసినట్లు కేటీఆర్ క్లియరెన్స్ ఇచ్చారు. నా విచారణలో విచారణ అధికారికి నా వద్ద ఉన్న సమాచారం ఇచ్చాను. కేటీఆర్‌ను కూడా విచారించాలి.” అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.
సిట్ విచారణకు రాను: బండి సంజయ్
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో ఏర్పాటైన సిట్ ఇచ్చిన నోటీసుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించబోరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్ ఇచ్చిన నోటీసు ప్రకారం ఈనెల 24న (నేడు) విచారణకు ఆయన హాజరుకాబోరని స్పష్టం చేశాయి. అలాగే, సంజయ్ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో ఉన్నారని, విప్ కూడా జారీ అయిందని పార్టీ నాయకులు తెలిపారు.టీఎస్‌పీఎస్సీ లీకేజీకి సంబంధించి మంత్రి కేటీఆర్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో, వాటికి సంబంధించి ఆయన వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని, ఈ మేరకు శుక్రవారం విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా, ఆ నోటీసులకు స్పందించరాదని, విచారణకు హాజరు కారాదని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, సిట్‌పై తనకు నమ్మకం లేదని, హైకోర్టు సిటింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపిస్తేనే ఆధారాలు అందజేస్తానని సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం సాయంత్రం నెల వంక దర్శనంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల ‘రంజాన్’. ఈ మాసంలో ఉపవాసదీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలోనే దివ్యఖురాన్(మతగ్రంథం) అవతరించింది. నెల రోజుల పాటు ముస్లింలు నియమనిష్ఠలతో దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభం కాగా, ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజూ మసీదుల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు కావాల్సిన వసతులను కల్పించింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని వేళల్లో మార్పులు చేసింది. ప్రార్థనలు చేసుకునేందుకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయం నుంచి వెళ్లేందుకు ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది.