తెలంగాణ సర్కార్ కు సీబీఐ లేఖ.. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎక్కడినుంచంటే? వామ్మో.. కిలో చికెన్ రూ.650.. లిక్కర్ స్కాం కేసులో 13,600 పేజీల చార్జీషీట్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే

వివరాలిస్తే ఎంక్వైరీ చేసుకుంటాం: సీబీఐ


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వివరాలివ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ హైకోర్టుకు తెలిపింది. వివరాలు ఇస్తే తాము విచారణ చేస్తామని తెలిపింది. కేసు వివరాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ కోరింది. అయితే కేసు విచారణలో ఉందని, సీబీఐ వేచి ఉండాలని హై కోర్టు సూచించింది. సోమవారం సీబీఐ వాదనలు వింటామన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

బండి సంజయ్ అరెస్ట్‌


కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కలెక్టరేట్‭లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్‭, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‭ను స్టేషన్‭కు తరలించేందుకు పోలీస్ వాహనంలో ఎక్కించారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో వెహికల్ అద్దాలు పగిలాయి. కొందరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

రోజుకు 19 కిలోమీటర్లు


తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 26 నుండి పాదయాత్ర చేస్తామని చెప్పారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై మూడు ప్రాంతాలు . పరిశీలనలో వున్నాయని తెలిపారు. భద్రాచలం, జోడేఘడ్, జోగులాంబ వీటిలో ఏదోఒకటి ప్లేస్ ఫైనల్ అవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జీ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 19 కిలోమీటర్లు, 126 రోజులు యాత్ర ఉంటదని తెలిపారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు.

లిక్కర్ స్కాం కేసులో 13,600 పేజీల చార్జ్‌షీట్:


 ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం 13,600 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తెలంగాణకు చెందిన రాజకీయ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి సహా మరో నలుగురిపై ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి శరత్చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై శనివారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

రేవంత్ నీకు ఎంతొచ్చింది:


టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఎంత లబ్ది చేకూరిందో చెప్పాలని పైలెట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారినందుకు టీడీపీ నుంచి లాభం చేకూరిందా లేక కాంగ్రెస్ నుంచ లబ్ది పొందాడో చెప్పాలని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పీఎస్ లో సీఎల్పీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన రోహిత్ రెడ్డి కాంగ్రెస్ చర్య హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ ఆరోపణలకు తలాతోకా లేదని అదే తాను పెట్టిన కేసులో ఆధారాలున్నాయని అన్నారు.

నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు


కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి.. ఇతర రాష్ట్రాల అభివృద్దికి వాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అని అన్నారు. లేకపోతే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

చిన్న దొరకు తెల్వదా!


కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనపై వైఎస్సార్‭టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు(కేటీఆర్) రైతు ఆత్మహత్య వార్త కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి కామారెడ్డి పట్టణ రైతులు ఆందోళన చేస్తుంటే.. మున్సిపల్ మంత్రికి ఒక్క పేపర్లో వార్త దొరకలేదా అని షర్మిల నిలదీశారు. ఒక రైతు ప్రాణాలు విడిస్తే తప్ప మీ సర్కారు స్పందించదా అన్నారు. ఇండస్ట్రియల్ జోన్‭ ఏర్పాటు చేసేందుకు పచ్చటి భూములే దొరికాయా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇంకెంత మంది రైతులు చనిపోతే మీ కండ్లు చల్లబడుతాయ్ అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్ ప్లాన్ పై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. 

కిలో చికెన్ ₹650


పాకిస్థాన్‭లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు కేజీ చికెన్ రేటు రూ.200 లేదా 300 ఉండేది ఇప్పుడు ఏకంగా రూ.650కి చేరింది. దీంతో ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల కారణంగా పాకిస్తాన్ లో చికెన్ ధరలు 100 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఇస్లామాబాద్‭లో గత నెల వరకూ కిలో చికెన్ రూ.350కి అమ్మారు. ఇప్పుడు అది కిలో రూ.650కి చేరడంతో ప్రజల నిరసనకు దారి తీసింది. మరోవైపు పాక్ లో ద్రవ్యోల్పణం భారీగా పెరగడంతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.

ముగిసిన కామారెడ్డి బంద్:


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మాస్టర్‌ ప్లాన్‌లో ఇండస్ట్రియల్‌, గ్రీన్‌జోన్‌లను తొలగించాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన కామారెడ్డి బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రామారెడ్డి, రాజంపేట, సదాశివనగర్‌, ఎల్లారెడ్డి పట్టణంలోనూ స్వచ్ఛందంగా విద్యాసంస్థలకు యాజమాన్యాలు బంద్‌ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా వ్యాపారులు కూడా తమ తమ వాణిజ్య, వ్యాపార సముదాయాలను మూసివేశారు. పలువురు రైతులు, బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు కామారెడ్డి పట్టణంతో పాటు ఆయా మండలాల్లోని ప్రధాన కూడళ్లలో బైక్‌ ర్యాలీలతో వెళ్లి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేశారు. దీంతో రైతుల బంద్‌ పిలుపు ప్రశాంతంగా జరిగింది. రైతులు చేపడుతున్న ఆందోళనను కట్టడి చేసేందుకు పోలీసులు రైతులను ఎక్కడికక్కడే నిర్బంధం చేశారు.

ఎల్లారెడ్డిపేటలో 20 మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత:


మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం గొళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc