ఏఈ పరీక్ష రద్దు
పేపర్ లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం 857 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 55 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటనిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
సమగ్ర దర్యాప్తు చేయండి: కేటీఆర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అంటూ తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ (టీఎస్టీఎస్) చైర్మన్ పీ.జగన్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వానికి నష్టం చేసేలా.. అమాయక యువత జీవితాలు నాశనం చేసేలా బీజేపీ కుట్ర పన్నినట్లు అనిపిస్తుందని ఆయన ఆరోపించారు.
నేడు కవిత విచారణ
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 11న ఆమెను 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ఫోన్ సీజ్ చేసిన అధికారులు ఈనెల 16న (నేడు) విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇవాళ్టి ఈడీ విచారణపై కవిత ఇప్పటికే స్పందించారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు. అయితే ఈ రోజు కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. రూ.116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించారు. ‘గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించాం. శ్రీరామనవమికి వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అని కోరారు. ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: రేవంత్ రెడ్డి
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది అని అన్నారు. జామాబాద్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.
బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కర్నూల్, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో కర్నూల్ కార్పొరేటర్ ముస్తాక్, సాయి తేజ్ సర్పంచ్, రామాపురం ప్రకాశం, సలీం బేగ్, వెంకటేశం, మాజీ ఎంపిటిసిలు, మాజీ జడ్పీటీసీ యూసుఫ్ బేగ్, ఎంఆర్పీఎస్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ తదితరులు ఉన్నారు.
యూట్యూబ్ స్టార్ గంగవ్వకు ఎమ్మెల్యే సీతక్క గిఫ్ట్
సహాజ నటన తో ప్రేక్షకుల మెప్పు పొందిన యూట్యూబ్ స్టార్ గంగవ్వకు ములుగు ఎమ్మెల్యే సీతక్క చీర పంపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా పూడూర్ వద్ద టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ని కలిసి స్వయంగా తాను తయారు చేసిన మిర్చి బజ్జీలని అందించి రుచి చూపించారు. అక్కడే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కని కూడా గంగవ్వ అప్యాయంగా పలకరించారు. గంగవ్వ మాటలకు, సహాజత్వానికి అకర్షితురాలైన సీతక్క గంగవ్వ కి చీర పంపించారు. కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్ గంగవ్వ స్వగ్రామం లంబాడిపల్లికి వెళ్ళి సీతక్క పంపించిన బట్టలని గంగవ్వకి స్థానిక నాయకులు అందజేశారు.
మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
జాతీయ మహిళ కమిషన్ ను YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిసి బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ కు అందిచారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని షర్మిల ఫిర్యాదు చేశారు. ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.