సినీ నటుడు చలపతిరావు కన్నుమూత.. అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్​.. ఈ సారి కరోనా వచ్చినా ఏం కాదట.. అవతార్ 2కు అదిరిపోయే కలెక్షన్లు.. నేటి టాప్ టెన్ న్యూస్

సినీ నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్​లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో చనిపోయారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం తో బాధ పడుతున్నారు. అందుకే నటనకు దూరంగా ఉన్నారు. కైకాల సత్యనారాయణ విషాదం మరవకముందే చలపతిరావు మృతి చెందటంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చలపతి రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.

అమెరికా వీసాలకు ఇంటర్వ్యూలపై గుడ్ న్యూస్..


అమెరికా వీసాలకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు కల్పించే సౌకర్యాన్ని పొడిగించారు. అయితే ఈ ప్రయోజనం కొంతమంది నాన్ ఇమిగ్రంట్ (వలసేతర) వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా దాన్ని 2023 డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు.

కోవిడ్ వచ్చినా ఇబ్బంది లేదు:

కోవిడ్-19 మహమ్మారి మరోసారి వచ్చినప్పటికీ మన దేశం ప్రజలకు ఇబ్బంది ఉండదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఆందోళన అవసరం లేని స్థితిలో మన దేశం ఉందన్నారు. భారత దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా బాగా జరిగిందని చెప్పారు. వ్యాక్సినేషన్ కవరేజ్, నేచురల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజలకు ఇప్పటికే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. అందువల్ల కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించినప్పటికీ తీవ్ర స్థాయిలో కోవిడ్ కేసులు పెరగడం కానీ, ఆసుపత్రుల్లో చేరవలసిన అవసరం రావడం కానీ జరిగే అవకాశం లేదన్నారు.

ఈనెల 27న దవాఖాన్లలో మాక్ డ్రిల్..

దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ లేఖలు రాశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు, లాజిస్ట్రిక్స్, మానవ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలిచ్చారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ ను పరిశీలించనున్నారు.

డ్రగ్స్@ హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా


అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయ్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి మూడు కోట్లు విలువ చేసే ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ మీదుగా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోందని డీసీపీ తెలిపారు. హైదరాబాద్లోని కొరియర్ సర్వీస్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గాజులు, ఫొటోఫ్రేమ్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ చేస్తున్నట్లు వివరించారు.

మీడియాపై రాహుల్​ ఘాటు కామెంట్లు

కాంగ్రెస్​ నేత రాహుల్​ యాత్ర ఢిల్లీకి చేరింది. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ చేతుల్లో ఉందని.. వారి కనుసన్నల్లోనే దేశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ’ఇప్పటిదాకా నేను దేశంలో 2800 కిలోమీటర్లు నడిచాను. ఎక్కడ కూడా ద్వేషం కానీ.. హింస కానీ కనిపించలేదు. కానీ బీజేపీకి వంతపాడే మీడియా ఛానళ్లు 24 గంటల పాటు మతపరమైన అంశాలు, విద్వేషం రెచ్చగొట్టే వార్తలనే చూపిస్తున్నారు. ఇది మీడియా విలువలకు విరుద్ధం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

రాహుల్ యాత్రలో కమల్‌ హాసన్


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ శనివారం పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా కమల్ రాహుల్ వెంట నడిచారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, తదితరులు సైతం యాత్రలో పాల్గొన్నారు.

₹200 కోట్లు కలెక్ట్ చేసిన అవతార్

అవతార్ 2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 5వేల కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా.. మన దేశంలో ఇప్పటివరకు 200 కోట్లను రాబట్టింది. దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ను ఫిదా చేస్తుంది. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. కొత్త సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూకుడు తగ్గలేదు.

ఆర్మూరులో దొంగల బీభత్సం

తెలంగాణలోని నిజామాాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీపీ ఆఫీసుకు దగ్గరలో ఉన్న కోటక్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. తర్వాత ఐదు హోల్ సేల్ షాపుల్లో దొంగతనం చేశారు. మెండోరా మండలం బుస్సాపూర్ లో బ్యాంకు దోపిడీ ఘటనను మరువకముందే మరో బ్యాంకులో దోపిడీకి దొంగలు ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. వరస దొంగతనాలు వ్యాపారులను, సామాన్య జనాన్ని భయపెడుతున్నాయి.

పైసలుంటే‌ జీతాలియ్యమా: హరీశ్‌

ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు వేయడంలో జాప్యం సమస్యను త్వరలోనే తీరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ‘డబ్బులు ఉంటే .. శాలరీలు ఇయ్యకుండా ఉంటామా ?’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు 40వేల కోట్ల రూపాయల బడ్జెట్ రావాల్సి ఉండగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు.

చందాకొచ్చర్ అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‭లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2009 ఆగష్టులో వీడియోకాన్ గ్రూప్‭ అధినేత వేణుగోపాల్ ధూత్ నాయకత్వంలోని.. వీఐఈఎల్ కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ కోసం వీరిద్దరికీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే.. 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు.

శ్రీశైలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ప్రసాద్ స్కీం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శీతకాల విడిది కోసం ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి, సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ర్టపతి నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc