బీజేపీలోకి పొంగులేటి.. 18న ఖమ్మం జిల్లాకు కేసీఆర్​.. పార్టీ మారితే ఊకోనన్న రాములు నాయక్​.. వణుకుతున్న ఢిల్లీ.. ఈ రోజు టాప్​ న్యూస్​

జిల్లాల పర్యటనకు కేసీఆర్

కేసీఆర్​ త్వరలోనే ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్​ భేరీ మోగించనున్నారు. మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్‌, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 18న ఖమ్మం కలెక్టరేట్‌ను ప్రారంభించి.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు. ఈ సభకు మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను తరలించనున్నారు. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ నిర్మాణం పూర్తయినా.. ఈ పర్యటనలో దాని ప్రారంభోత్సవం లేదని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని కొత్తగూడెం జిల్లా నేతలు తెలిపారు.

పార్టీ మారితే ఊకోను: రాములు నాయక్

బీఆర్‌ఎస్ నేతలు పార్టీ మారితే చూస్తూ ఊరుకోనని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హెచ్చరించారు. ఇప్పటిదాకా సాఫ్ట్‌గా ఉన్నానని,  నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారితే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఆయన హెచ్చరించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బీజేపీలోకి పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.  ”యావత్తు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, తప్పకుండా రాబోయే రాజకీయాల్లో, రాబోయే చదరంగంలో, రాబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా చేసి చూపిస్తా, కురుక్షేత్ర యుద్ధానికి మీ శీనన్న సిద్ధంగా ఉన్నాడు” అని అన్నారు. ‘దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చా. 13 నెలల కాలంలోనే ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఎంపీగా గెలిచా. నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ద్వారా వారికి చేయాల్సింది చేశాను. ప్రభుత్వం ద్వారా కాని వాటిని వ్యక్తిగతంగా చేసి చూపాను. నాలుగేండ్గుగా పదవులు లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ శీనన్న ఉన్నాడనే నమ్మకాన్ని కల్పించాను. ఆశీస్సులతో రాబోవు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను‘ అన్నారు. 

కామారెడ్డి ప్లాన్ రద్దయ్యేదాకా ఆందోళన

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. మాస్టర్ ప్లాన్పై ఈ నెల 11 వరకు అభ్యంతరాలు ఇవ్వడానికి గడువు ఉన్నందున.. ఆ రోజు వరకు శాంతియుత ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించనుంది. 

డబుల్ ఇండ్లకు 4.46 వేల‌ కోట్లు

 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేంద్రం రూ.4,465.81 కోట్లను మంజూరు చేసిందని, అందులో ఇప్పటికే రూ3,128.14 కోట్లను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2,49,465 ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. మంజూరైన వాటిలో 2,39,422 ఇండ్ల నిర్మాణం మొదలైందని, 2,15,443 ఇండ్ల నిర్మాణం పూర్తైందని చెప్పారు. అయితే, రాష్ట్ర సర్కారు తప్పుడు లెక్కలు చెప్తున్నదన్నారు.  పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా రాష్ట్ర సర్కారు ఎంతో ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులనూ సరిగ్గా వాడుకోలేదని ఫైర్ అయ్యారు.

బీఆర్‌ఎస్‌ను స్వాగతించిన పవన్ కళ్యాణ్​

ఏపీ రాజకీయాల్లోకి బీఆర్‌ఎస్ రావడాన్ని స్వాగతిస్తున్నామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  తెలంగాణ వాదాన్ని వదిలి బీఆర్‌ఎస్ అని దేశమంతా పోటీ చేస్తున్నప్పుడు ఏపీలో పోటీ చేసేందుకు వాళ్లకు అర్హత ఉందన్నారు. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి నేతలు వెళ్లడం సహజమేనన్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్లలో చాలా మంది గతంలో జనసేన, టీడీపీలో పనిచేసిన వాళ్లేనని ఆయన గుర్తు చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడితో పవన్ సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల చంద్రబాబు టూర్ లో జరిగిన ఘటనలు, కుప్పంలో చంద్రబాబును అక్కడి ప్రభుత్వం అడ్డుకోవటం, యాత్రలు చేయకుండా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయటం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

ఆర్టీసీ నీళ్ల బాటిల్

“టీఎస్ ఆర్టీసీ జీవా ’’ పేరుతో ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లోకి ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. సోమవారం ఎంజీబీఎస్ లో వీటిని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు ప్రారంభించనున్నట్లు ఆదివారం ఆర్టీసీ పత్రిక ప్రకటనలో తెలిపింది. ముందుగా లీటర్ బాటిళ్ల ను లాంఛ్ చేస్తున్నామని, త్వరలో ఆఫ్ లీటర్, పావులీటర్ బాటిళ్లను లాంఛ్ చేస్తామని సంస్ధ తెలిపింది.  ఇవి బస్టాండ్‌ల్లోని స్టాళ్లలో పాటు,  బహిరంగ మార్కెట్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి.

కొడుకు చేసిన నేరానికి తల్లికి శిక్ష

కొడుకు తనపై అత్యాచారం చేశాడని, అతని తల్లిపై 16 ఏండ్ల బాలిక గన్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటన ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగింది. బాలిక కాల్పుల్లో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఖుర్షీదా (50) గా గుర్తించారు. ఆమె తన బిల్డింగ్ లోని గ్రౌండ్  ఫ్లోర్ లో కిరాణా దుకాణం నడుపుతోంది. 2021లో ఖుర్షీదా కొడుకు (ఇతను కూడా మైనరే) తనను రేప్  చేశాడని బాలిక పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడు ఈ కేసులో ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతడిపై పగ పెంచుకున్న బాలిక.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు అతడి తల్లి నడుపుతున్న షాప్ కు వెళ్లి ఖుర్షీదాపై గన్ తో కాల్పులు జరిపి పారిపోయింది. కొన్ని గంటల్లోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

నేను రాహుల్‌గాంధీని కాదు

తాను ఇకపై రాహుల్ గాంధీని ఎంతమాత్రం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. ” అవును నేను రాహుల్‌ను కాదు. నేను అతన్ని ఎప్పుడో వదిలేశాను. రాహుల్ గాంధీ కేవలం బీజేపీ మనో మస్తిష్కాల్లో నాటుకుపోయాడు. నా ఇమేజ్ పై నాకు పెద్దగా ఆసక్తి లేదు. మహాభారతంలో అర్జునుడు చేప కన్నుపై దృష్టిపెట్టినట్టు.. నేను నా పనిపై శ్రద్ధతో ముందుకు వెళ్తున్నాను”అని రాహుల్ వివరించారు.

చైనాలో నో రూల్స్

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం క్వారంటైన్ రూల్ను చైనా ఎత్తేసింది. మూడేండ్ల తర్వాత ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు ఎలాంటి క్వారంటైన్ విధించకుండానే ఇండ్లకు పంపింది. ఆదివారం ఉదయం టోరంటో, సింగపూర్ నుంచి చైనాకు వచ్చిన మొత్తం 387 మంది ప్రయాణికులు క్వారంటైన్ లేకుండా ఇండ్లకు వెళ్లిపోయారు. ఇకపై చైనా నుంచి వేరే దేశానికి వెళ్లి.. తిరిగి వచ్చే వారు కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. 

మగాళ్లకు నియంత్రణ లేదు

జనాభా నియంత్రణపై మాట్లాడుతూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ వివాదాస్పద కామెంట్లు చేశారు. ‘‘మొగోళ్లకు బాధ్యత లేదు.. ఆడోళ్లకు అవగాహన లేదు. అందుకే రాష్ట్రంలో జనాభా నియంత్రణ సాధ్యం కావడం లేదు” అని అన్నారు. ‘‘మన రాష్ట్రంలో జనాభా తగ్గడం లేదు. జనాభా పెరుగుదల రేటు మునుపటి లెక్కనే ఉన్నది. ఆడోళ్లు చదువుకుంటేనే జనాభా పెరుగుదలను ఆపడం సాధ్యమవుతుంది. ఆడోళ్లు చదువుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటారు. ఇక మొగోళ్లు జనాభా పెరుగుతుందన్న సోయి కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొగోళ్లకు బాధ్యత లేకుండా, ఆడోళ్లకు అవగాహన లేకుండా జనాభా నియంత్రణ సాధ్యం కాదు” అని ఆయన అన్నారు.

బీజేపీ గంగా నది వంటిది

లెఫ్ట్‌ పార్టీ లీడర్లు బీజీపీలో చేరాలని త్రిపుర సీఎం మాణిక్‌ సాహా కోరారు. తమ పార్టీ గంగా నది లాంటిదని, అందులో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని అన్నారు. ‘‘స్టాలిన్‌, లెనిన్‌ ఐడియాలజీ నమ్మేవాళ్లు బీజేపీలో చేరండి. ఎందుకంటే తమ పార్టీ గంగా నదిలాంటిది. ఇందులో చేరితే మీ పాపాలన్ని తొలగిపోతాయి”అని ఆయన అన్నారు. రైలు కంపార్ట్‌మెంట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, వచ్చి ఖాళీగా ఉన్న బోగీల్లో కూర్చోవాలని కోరారు. ప్రధాని మోడీ మనందరం వెళ్లాల్సిన డెస్టినేషన్‌కు తీసుకెళ్తారని పేర్కొన్నారు. 

పోలీసులపై నైజీరియన్ల దాడి

వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను యాంటీ డ్రగ్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారిని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు రెడీ అయ్యింది. తమవాళ్లను అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న వంద మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టుముట్టారు. వారిని తప్పించేందుకు పోలీసులపై దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులను అటకాయించారు. అరెస్టైన ముగ్గురిలో ఇద్దరు పారిపోగా.. 22 ఏండ్ల పిలిప్ మాత్రం దొరికిపోయాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెబ్సరాయ్ ఏరియాలో జరిగింది.

ఢిల్లీపై చలి పులి

చలిగాలులు నార్త్ ఇండియాను వణికిస్తున్నాయి. దట్టంగా మంచు కమ్మేస్తుండటంతో టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. ఢిల్లీలో నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. సఫ్దర్ జంగ్ లో ఆదివారం అత్యంత తక్కువగా 1.9 డిగ్రీలుగా నమోదైందని ఇండియన్ మెట్రోలజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) తెలిపింది. ఆయనగర్లో 2.6, లోధిరోడ్లో2.8, పాలెంలో 5.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. భారీగా పొగమంచు పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. )

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here