జంట నగరాల మధ్య పాపిట.. అందమైన ట్యాంక్‌బండ్‌

ప్రేమమూర్తి శ్రీమతి భాగమతీ దేవి కురులు దువ్వుకుంటూ ఓ పాపిట తీస్తే… ఓపాయ ఉండేది హైదరాబాద్‌ అయితే… మరోపాయ సికిందరాబాద్‌. అలా మధ్యనున్న పాపిటమార్గమే… ట్యాంక్‌బండ్‌.

సుల్తాన్‌ కులీ… భాగమతుల మతులు పోగొట్టే ప్రేమకథ ఎవరికి తెలియదూ?!… అందుకేనేమో… కులీ హైదరాబాద్‌ ఏర్పాటుతో తన లీల చూపాక… ఆ తర్వాతెప్పుడో మల్కిభరాముడు… అదే ఇబ్రహీం కుతుబ్‌షా వచ్చి నిర్మించాడో సరస్సు. అదే ∙హుస్సేన్‌సాగర్‌. అసలే కులీగారి ప్రేమనగరం ఇది. ఆ ప్రభావం సరస్సు మీదా  పడకుండా పోతుందా మరి. అందుకే తీరా సరస్సు తవ్వాక… పై నుంచి ఏరియల్‌ వ్యూలో  చూస్తే… అచ్చం ప్రేమికుల గుర్తు… ప్రేమ గుర్తు ‘హార్ట్‌ షేప్‌’లో ఉందట. అలాంటి  గుండె పక్కన దండుబాటగా రూపొందిందే ట్యాంక్‌బండ్‌. గుండెచెరువు కాలేదిక్కడ. చెరువే గుండెషేప్‌లో రూపొందిదిప్పుడు!!

ఇబ్రహీం కుతుబ్‌షా రాజ్యానికి వచ్చాక 1563 నాటి ఓ మంచి రోజున తన ఇంజనీర్‌ హజరత్‌ హుసేన్‌ షా వలీని పిలిచాట్ట. తన నగరానికి తాగునీరందించేలా ఓ అద్భుత సరస్సును నిర్మించమని కోరాట్ట. అంతే… దాదాపు 24 చదరపు కిలోమీటర్ల విశాలమైన వైశాల్యంతో 32 అడుగుల లోతుతో ఏర్పాటైన సరస్సు చుట్టూ ఉన్న గట్టుబటే ట్యాంక్‌బండ్‌. అలా రూపొందిందీ సరస్సు. సంకల్పించిన నవాబు పేరిట కాకుండా… నిర్మించిన హుసేన్‌ పేరిట పేరొందింది. పాపం… తన సంకల్పం కాబట్టి తన పేరు పెట్టుకుందామంటే… తీరా ఇంజనీరుగానికి ఆ ప్రశస్తి దక్కడంతో మళ్లీ అక్కడెక్కడో న పేరిట నిర్మితమైన ఊరు ఇబ్రహీంపట్నంలోని చెరువుకు తన పేరు పెట్టుకుని ముచ్చటపడ్డారు అసలు హుసేన్‌సాగర్‌ను తవ్వదలచిన ఇబ్రహీం గారు. అదీ ట్యాంక్‌బండ్‌ రూపొందడానికి అసలు కారణమైన సరస్సు హుసేన్‌సాగర్‌ కథ.

రండి బండెక్కుదాం. ఏ బండి అంటారా…? బండికాదు… ట్యాంక్‌బండెక్కుదాం. ట్యాంక్‌బండూ… దాని వైభవం చూడాలంటే రాత్రివేళే. చిరుసంజె వేళ నుంచి మర్నాడుదయం మరుసంజె వేళల్లో చూడాలి దాని కళాకాంతులు!

ఏదో ఎ అట్టహాసపు వేడుక నాడు, మందహాసపు నగవుతో మహిళంతా ముఖంమీద అలదుకునే, పాపిటలో అలముకునే  మెరుపు–మెరుపుల మిస్సీ, జిలుగు–జిగేళ్ల జిగ్గీల్లా పాపిటలో రేణువుల్లా మిలమిలలాడినట్టే… ఆ వాహనాల వెలుగులూ… ఆ లైట్ల కాంతులూ మిణుకుమిణుకుమంటుంటాయి దూరం నుంచి చూస్తే. వాహనాల మిలమిల ఎలా ఉన్నా… ఆ మిరిమిట్లకు బీజం మరోలా కూడా పడిందక్కడ. దక్షిణ భారతదేశంలో తొట్టతొలి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది ఈ ఒడ్డునే. అలా ఆ మెరపులు ట్యాంక్‌బండ్‌కే పరిమితం కాకుండా… మొత్తం నగరాన్నే దేదీప్యమానం చేశాయి.

ఇక హైదరాబాద్‌ అప్పటి ఆంధప్రదేశ్‌లో ఉన్నరోజుల్లో ఎన్టీఆర్‌ ట్యాంక్‌బండ్‌ ఒడ్డున  తెలుగు వైతాళికులైన కొందరి విగ్రహాలు వెలిశాయి. దీనికి దీటుగా సరస్సు నడిమధ్యన బుద్ధుడి విగ్రహం. అది రాయగిరి నుంచి తెచ్చిన రాయితో రూపొంది  జిబ్రాల్టర్‌ రాక్‌ మీద నెలవైన ఆ విగ్రహం… అందరినీ ఆశీర్వదిస్తున్న తీరులో… ఎందరినో దీవిస్తున్న రీతిలో కొలువైంది.

మొదట రూపొందిన ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా కలుపుతున్నట్లుగా ఏర్పాటైంది ఓ ప్రధాన మార్గం. ఒకప్పుడు పాపిటలా ఉన్నది కాస్తా…. ఇప్పుడది మెడ గొలుసులా రూపొందింది. అందుకే దాన్ని నెక్లెస్‌రోడ్‌ అంటూ నగ పేరు పెట్టారు. నగలో అక్కడక్కడ పొదిగిన రత్నాల్లా… ఒడ్డునంతా రకరకాల ప్రదేశాలు!

సరస్సు మధ్యన గౌతముడున్నందున… ఆ ఒడ్డునే ఉన్న ఓ స్థలం ఆయన జన్మస్థానం పేరు పెట్టుకుని  లుంబినీవనముంది. ఆ పక్కనే కాస్త లోపలికొస్తే… మరో ఒడ్డున తన కొత్త ఆలోచనలతో ట్యాంక్‌బండ్‌కు సొబగులద్దిన ఎన్టీఆర్‌ పార్క్‌. ఇంకాస్త ముందుకొస్తే అదే పక్క కాస్త లోపలికి ప్రసాద్‌ ఐమాక్స్‌… ఇక దూరం పోకుండా మళ్లీ నెక్లెస్‌ రోడ్డు కొస్తే… సభలూ, సమావేశాలూ, వేడుకప్రదేశాల కోసం ప్రదర్శనశాలాప్రాంగణంగా పేరొందిన పీపుల్స్‌ ప్లాజా. ఇంకాస్త ముందుకెళ్తే వాటర్‌ఫ్రంట్‌… మరికాస్త ముందుకెళ్తే… నీళ్లతో పిల్లలూ పెద్దలూ ఆడుకునేందుకు ఏర్పాటైన జలవిహార్‌… కాస్తంత దూరాన తెలుగువాడై ప్రధానిగా దేశాన్నేలిన తెలంగాణబిడ్డ పీవీ నరసింహారావు ఘాట్‌. ఇంకాస్త దూరంలో ఎప్పటినుంచో విశాల విఖ్యాత పార్క్‌గా పేరొందిన సంజీవయ్య పార్క్‌. ఈ ఒడ్డున ఈ పార్కుతో… అటువైపొడ్డున ఇందిరా పార్క్‌తో చుట్టూరా హరితకాంతులీనుతుండే ఈ రోడ్డు… చేతులతో గాక… కాళ్లనడక అనే ప్రార్థనతో కళ్లకద్దుకోవాల్సిన రోడ్డు ఇది!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here