- కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న ఢిల్లీ లేదా హైదరాబాదులో విచారణకు హాజరవ్వాలని కోరింది. ఈ విషయాన్ని కవిత ట్విట్టర్‌లో వెల్లడించింది. “సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నాకు నోటీసులు ఇచ్చి, నా క్లారిఫికేషన్ కోరింది. సీబీఐ అభ్యర్థన మేరకు ఈ నెల 6న హైదరాబాదులోని నా ఇంట్లో సీబీఐ ఆఫీసర్లను కలుస్తానని వాళ్లకు సమాచారం ఇచ్చాను.” అని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
2. తెలంగాణలో అమరరాజా బ్యాటరీల కంపెనీ
తెలంగాణలో ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్ నగర్ లోనిదివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ.9500 కోట్లతో దేశంలోనే మొట్టమొదటి విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారంతో పాటు పరిశోధన కేద్రాన్ని స్థాపించనుంది. ఈ పెట్టుబడులతో 4500 మందికి ఉపాధి లభించనుంది. అమర రాజీ సంస్థ పెట్టుబడులతో రాష్ట్రం ఈవీ తయారీ హబ్ గా మారనుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
3. మేం ఇద్దరం తోటికోడళ్లం
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే ఈ ఇద్దరు నేతలు శుక్రవారం అసెంబ్లీలో ఎదురుపడ్డారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఇద్దరూ సరదాగా కాసేపు మాట్లాడారు. ‘మేము తోటి కోడళ్ల తీరుగా తిట్టుకుంటాం, మళ్లీ కలుకుంటాం’ అని రేవంత్ అనగా, రేవంత్‌ను దింపి ఆయన స్థానంలో పీసీసీ అవ్వాలని తనకు లేదని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్‌కు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నారు. రేవంత్ తర్వాతే తాను పీసీసీ అవుతాను తప్పితే, ఆయనను దింపి అవ్వడం సాధ్యం కాదన్నారు.
4. నేను అసలు కలవలే!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహాయాజీని తానెప్పుడూ కలవలేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. సింహాయాజిని దామోదర కలిసినట్టుగా ప్రచారం జరుగుతుండడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చుకున్నారు. అసలు సింహయాజీ ఎలా ఉంటారో కూడా తనకు తెలియదన్నారు. ఎవరో కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
5. హైదరాబాద్‌కు రాష్ట్రపతి
శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులపాటు సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. దేశ 15వ రాష్ట్రపతి హోదాలో మొట్ట మొదటిసారి శీతాకాల విడిదికి ద్రౌపది ముర్ము రానున్నారు.
6. నేను ఉద్యమం చేయలేదా?
తెలంగాణ కోసం కొట్లాడినోళ్లను పట్టించుకోరా? అని ఉద్యమకారిణి రహిమున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ హన్మకొండలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో తన ఫొటో పెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దీక్షా దివాస్’’ పేరుతో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్‍లో ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికి వచ్చిన రహిమున్నీసా అందులో ఒక్కటన్నా తన ఫొటో లేదని ఆవేదన చెందారు. ‘తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడిన. ఉద్యమం వల్ల నాపై 153 కేసులైనయ్. వాటి నుంచి బయట పడేందుకు రూ.43 లక్షలు ఖర్చయినయ్. నా బిడ్డలను ఇంట్లో వదిలి జైలు జీవితం గడిపిన. నా భర్త ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు ఆగమైంది” అయినా తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణం అని ఆమె విలపించారు. వినయ్ భాస్కర్ ఉద్యమం టైమ్ నుంచే తనపై పగబట్టిండని ఆమె ఆరోపించారు.
7. రైతు సమస్యలతో ప్రజల్లోకి కాంగ్రెస్
ధరణి, రైతు సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని, ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం సీఎల్పీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 20 లక్షల 30 వేల మంది ధరణి, భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లందరి తరపున పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ధరణిపై మండలానికి ఐదుగురి చొప్పున రాష్ట్రమంతటా డేటా సేకరిస్తామని నేతలు వెల్లడించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పార్టీ లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
8. మల్లారెడ్డి కొడుకును 3 గంటలు ఇంటరాగేట్ చేసిన ఆఫీసర్లు
మంత్రి మల్లారెడ్డి ఇన్‌కమ్‌టాక్స్ కేసులో ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆయనను అధికారులు మూడు గంటల పాటు విచారించారు. భద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న సంస్థల డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నించారు. కాలేజీల్లో సీట్లు, ఫీజులు, డొనేషన్లకు సంబంధించిన వివరాలపై ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. గత వారం జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నించారు. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలిసింది.
9.నంబీ ఎఫెక్ట్.. బెయిల్ రద్దు
1994 నాటి ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ గూఢచర్యం కేసులో మాజీ డీజీపీ సహా నలుగురికి ముందస్తు బెయిల్ ఇస్తూ కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అంశాన్ని తిరిగి హైకోర్టుకే అప్పగిస్తూ.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
10.సీఎం డిప్యుటీ సెక్రటరీ అరెస్ట్
చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరిగిన కోల్ స్కాంలో మనీలాండరింగ్ వ్యవహారానికి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లో రవాణా చేస్తున్న బొగ్గు నుంచి ప్రతి టన్నుకు రూ. 25 చొప్పున అక్రమంగా వసూలు చేసినట్లు సౌమ్యతో పాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.