హైదరాబాద్‌లో రాకెట్ల తయారీ ప్లాంట్
హైదరాబాద్‌లో రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన స్థలం కేటాయించాలని స్కైరూట్ కంపెనీ చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ అంగీకరించారు. అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పేస్ టెక్ పాలసీని విడుదల చేసిందని, ఈ విధానంతో రాకెట్లను స్టార్టప్‌లు ఇక్కడే రూపొందించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్, ప్రైవేట్ రంగంలో రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్’ను ఈనెల 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
9168 గ్రూప్ 4 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియరైంది. మొత్తం 9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వార్డు ఆఫీసర్ పోస్టులు 1862, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6859, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ 18 పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు లింక్
ధరల మోతలో తెలంగాణ దేశంలో ఫస్ట్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణలో ధరల మోత మోగుతోంది. అక్టోబర్‌లో దేశంలోనే అత్యధికంగా 8.82 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 9.47 శాతం ద్రవ్యోల్బణం ఉండగా, పట్టణాల్లో 8.23 శాతంగా ఉంది. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ వివరాలను కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 7.93 శాతంతో రిటైల్ ద్రవ్యోల్బణంలో ఏపీ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ఢిల్లీలో అత్యల్పంగా 2.99 శాతం ద్రవ్యోల్బణం ఉంది. ఎంపిక చేసిన పట్టణ, గ్రామీణ మార్కెట్లలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ద్రవ్యోల్బణాన్ని గణించినట్లు కేంద్రం పేర్కొంది.
వణికిస్తున్న మరో వైరస్
కరోనా తగ్గిపోయిందని సంతోషించేలోగానే, మరో వైరస్ దేశంలోని పలు రాష్ట్రాలను వణికిస్తోంది. నెల రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పిల్లలందరూ మీజిల్స్ అండ్ రుబెల్లా కంటైనింగ్ వ్యాక్సిన్(ఎంఆర్ వ్యాక్సిన్) వేయించుకున్నదీ, లేనిదీ రీచెక్ చేయాలని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు స్టేట్ హెల్త్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాక్సిన్ తీసుకోని పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఎవరికైనా జ్వరం, రాషెస్ వంటి సింప్టమ్స్ కనిపిస్తే సాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు పంపించాలని పేర్కొన్నారు. మీజిల్స్ అనేది అంటు వ్యాధి కరోనా తరహాలోనే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకితే ఒంటి మీద దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ఈ వ్యాధి సోకుతుంది.
లిక్కర్ స్కామ్‌లో ఆంధ్రప్రభ ఎండీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంపై సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్‌నాయర్ సహా ఏడుగురి పేర్లను అందులో చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌సిసోడియా పేరును మాత్రం చేర్చలేదు. దాదాపు 10 వేల పేజీల అభియోగపత్రాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు అందజేశారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులను, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను అందులో నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా.. అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, ఏ2గా అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేందర్ సింగ్, ఏ3గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్, ఏ4గా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లితోపాటు.. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ ఎండీ ముత్తాగౌతమ్, వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్రపిళ్లై పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఈ కుంభకోణంతో సంబంధముందని బీజేపీ నేతలు ఆరోపించినప్పటికీ.. చార్జ్‌షీట్‌లో ఆమె పేరు లేకపోవడం గమనార్హం.
బీఎల్ సంతోష్‌కు హైకోర్టు స్టే
ఎమ్మెల్యేల ఫాంహౌజ్ కేసులో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌కు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయరాదని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్‌కు సిట్ 41ఎ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సంతోష్ తరపు లాయర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సురేందర్ శుక్రవారం విచారణ జరిపి స్టే ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేశారు.
మల్లారెడ్డికి మరో షాక్
ఐటీ ఆఫీసర్ రత్నాకర్‌పై మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. 4 వారాల వరకూ ఈ కేసులో ఎలాంటి ఎంక్వైరీ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఐటీ ఆఫీసర్ రత్నాకర్ తన సోదరుడు మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బోయిన్‌పల్లి పీఎస్‌లో భద్రారెడ్డి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపీసీ 384 కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలంటూ రత్నాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.
బీజేపీలో చేరిన మాజీ మంత్రి
మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ శశిధర్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో, శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆసియాలో అత్యంత పెద్ద అమెరికన్ కాన్సులేట్
ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద అమెరికన్ కాన్సులేట్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ఏర్పాటవుతోంది. 2023 జనవరిలో ఈ కాన్సులేట్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 12.2 ఎకరాల విస్తీర్ణంలో 297 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అమెరికన్ వీసా ప్రాసెసింగ్ కోసం ఈ కాన్సులేట్‌లో 54 విండోస్ ఏర్పాటు కాబోతున్నాయి.
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ఒపెనైంది
గచ్చిబౌళిలోని శిల్పా లే అవుట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్లైఓవర్‌తో గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. జనవరి చివరికల్లా కొత్తగూడా ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎంఎంటీఎస్ రైలు సేవలను కూడా విస్తరిస్తామని చెప్పారు.
కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ స్థానిక ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలలో ఆప్ దూసుకుపోతున్న తీరుతో భయపడుతున్న బీజేపీ నేతలు తమ నేతను హతమార్చే కుట్ర చేస్తున్నారని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రకు సహకరిస్తున్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్‌ను తివారీ ఒక ట్వీట్‌లో బహిరంగంగానే బెదిరించారని తెలిపారు. సిసోడియా ఆరోపణలను తివారీ ఖండించారు. ‘సిసోడియాను అరెస్టు చేస్తారంటూ కేజ్రీవాల్, అతడిని చంపబోతున్నారంటూ సిసోడియా మాట్లాడతారు. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు’ అని తివారీ వ్యాఖ్యానించారు.