బీఆర్ఎస్ నినాదం ఇదే

దేశ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్ ఏర్పాటు చేస్తున్నామని.. రైతులు, ఉత్పత్తి కులాలు, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు పోతామని కేసీఆర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సీఈసీ నుంచి వచ్చిన లేఖకు సమాధానమిస్తూ రాసిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి జెండా ఎగురవేశారు. ఎర్రకోటపై ఎగిరేది ఈ జెండానేనన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని, ఆ రాష్ట్ర ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్ మద్దతునిస్తుందన్నారు. ఈనెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, అదే రోజు పార్టీ జాతీయ కార్యవర్గంతో పాటు కొన్ని అనుబంధ సంఘాలను ప్రకటిస్తామన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తామన్నారు.ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు చల్ల వెంకట్రామిరెడ్డి శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి రాంభూపాల్ రెడ్డి కుమారుడు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనవడు.
2. నేడు కేబినేట్ భేటీ:

రాష్ట్ర కేబినేట్ శుక్రవారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు అమలుతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించే పథకంపై నేడు విధివిధానాలు ఖారారు చేయనున్నట్లు తెలుస్తోంది.
3. 1392 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం ఇంటర్మీడియేట్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం16 సజ్జెక్టులకు సంబంధించిన 1,392 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈనెల16 నుంచి జనవరి 6 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. జూన్ లేదా జులై నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
4. సంక్రాంతికి స్పెషల్ బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా 4,233 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. జనవరి 7 నుంచి 15 వరకు స్పెషల్ బస్సులను నడుపనున్నట్టు తెలిపారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నానికి 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు.
5. పర్మిషన్ కోసం షర్మిల దీక్ష:

ప్రజా ప్రస్ధాన పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చే వరకు ఆమరణ నిరాహార ధీక్ష కొనసాగిస్తానని వైఎస్ ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. శుక్రవారం పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ లో ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు, ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి షర్మిల వినతిపత్రం అందచేశారు. అక్కడ నుంచి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌కు పంపించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెట్టారు.
6. వణికిస్తున్న చలి:

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. జనాలు గజగజ వణికిపోతున్నారు. రెండుమూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో శుక్రవారం ఉదయం టెంపరేచర్ 5.9 డిగ్రీలుగా నమోదైంది. నస్రుల్లాబాద్ మండలంలో 8.2, భిక్నూర్, దోమకొండ, రామారెడ్డి, సదాశివ నగర్, పిట్లం, గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 9 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత.
7. ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో దుమారం:

దేశవ్యాప్తంగా యూనియన్సివిల్ కోడ్ అమలుకు సంబంధించిన బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఇది దేశ సమగ్రతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
8.3055 మంది రైతుల ఆత్మహత్య:
గడిచిన ఐదేండ్లలో తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018-–19లో అత్యధికంగా 1,746 మంది సూసైడ్చేసుకున్నట్లు తెలిపింది. 2017లో 846 మంది, 2018 లో 900, 2019 లో 491, 2020లో 466, 2021లో 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ సంతోష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
9. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో:

ప్రపంచంలో కాలుష్య రహిత, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మాస్ట్రాన్స్పోర్టేషన్ మెట్రో రైలు అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సిటీలోని అన్ని ప్రాంతాలనూ మెట్రోతో కనెక్ట్చేస్తామని తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌నుంచి కూడా మెట్రో రైలు వేస్తామని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ వద్ద ఎయిర్ పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
10. 3 రాష్ట్రాలకు మాండూస్ ముప్పు:
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.
11. వంద మందితో వచ్చి కిడ్నాప్

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఓ యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ప్రేమించిన తనను పెండ్లి చేసుకోవడంలేదన్న కక్షతో రెచ్చిపోయిన ఓ యువకుడు దాదాపు100 మంది అనుచరులతో వచ్చి యువతి ఇంటిపై దాడి చేశాడు. కట్టెలు, రాళ్లతో దాడి చేస్తూ సినిమా తరహాలో బీభత్సం సృష్టించారు. యువతి తండ్రితోపాటు అడ్డొచ్చిన వారి తలలు పగులగొట్టారు. ఇంట్లో ఫర్నిచర్‌ను, పదికి పైగా కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న యుతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శుక్రవారం యువతి పెండ్లి చూపులు జరుగుతున్న సమయంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన యువతి బంధువులు నిందితుడి ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. అతని టీ పాయింట్ ను దగ్ధం చేశారు. యువతిని కాపాడాలంటూ రోడ్డుపై బైఠాయించారు. చివరకు యువతి క్షేమంగా ఇంటికి చేరింది. ప్రియుడితో పాటు10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.