గ్రూప్-1 ఫలితాలు విడుదల

దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్-1 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 20,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిషన్ వెబ్ సైట్లో విడుదల చేసింది. జూన్ లో మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వందే భారత్ టైం టేబుల్ ఇదే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 15 నుంచి సేవలు అందించనుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తొలుత ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన ఈ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజులుగా ముందుగానే అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఈ రైలు నంబర్, ఆగే స్టేషన్లు, టైం టేబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
బీఆర్ఎస్ ఒడిశా అధ్యక్షుడు ఎవరంటే?

భారత్ రాష్ట్ర సమితి పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్ తాజాగా ఒడిశా కార్యవర్గ నియామకంపై దృష్టి సారించారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న ఖమ్మం సభలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న ప్రగతి భవన్ లో కేసీఆర్ తో గమాంగ్ సమావేశమయ్యారు.
31 నుంచి పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. తొలిరోజు రాష్ట్రప్రతి ప్రసంగం ఉంటుంది.
త్వరలో టీచర్ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో సాధ్యమైనం త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం TSUTS సమావేశంలో పాట్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పదోన్నతులు సైతం త్వరగా పూర్తి చేస్తామన్నారు.
కిటకిటలాడుతోన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం నుంచి సొంత ప్రాంతాలకు భారీగా ప్రజలు భారీగా బయలుదేరడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. పంతంగా టోల్ ప్లాజా వద్ద నిన్న కిలో మీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అయితే.. సాధ్యమైనంత త్వరగా వాహనాలను పంపించివేయడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే.. ఆర్టీసీ స్పెషల్ బస్సులను, రైల్వే స్పెషల్ ట్రైన్లను ప్రకటించిన అవి సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వారు ధరలను రెండు, మూడు రెట్లు పెంచి దోచుకుంటున్నారు.
ఆపరేషన్లు ఫెయిలై ఇద్దరు బాలింతల మృతి..
ఆపరేషన్లు వికటించి కాన్పుకు వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న ఆస్పత్రిలో 11 మందికి సిజేరియన్ చేయగా.. ఇందులో ఇద్దరు మృతి చెందారు. దీంతో బాధితు బంధువులు ఆందోళనకు దిగారు. మరో 8 మందికి ఇన్షెక్షన్ కావడంతో నిమ్స్ కు తరలించారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా.. ఇందుకు గల కారణాలను తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
నేడు శరద్ యాదవ్ అంత్యక్రియలు:
అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ (75) అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లాలోని ఆయన సొంత ఊరు అంఖ్ మౌలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన సన్నిహితుడు గోవింద్ యాదవ్ వెల్లడించారు.