త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. తెలంగాణ, ఏపీ నుంచి వీరికి ఛాన్స్?.. అమెరికాలో కాల్పులు, 8 మంది మృతి.. సంక్రాంతికి 4233 బస్సులు.. చంపడానికైనా సిద్ధమన్న తెలంగాణ మంత్రి

త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ


ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ఈ మంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి చొప్పున మొత్తం ఇద్దరికి అవకాశం లభించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే.. బీసీలకు ఇవ్వాలనుకుంటే బండి సంజయ్ లేదా లక్షణ్ కు అవకాశం లభించే ఛాన్స్ ఉంది. ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే సోయం బాపురావ్ కు ఛాన్స్ దక్కనుందని సమాచారం. అయితే.. ఈ కేబినెట్ లో ఏపీ నుంచి ఇంత వరకు ఎవరికీ అవకాశం లేదు. ప్రస్తుతం ఏపీకి చెందిన సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి లేదా.. మరో కొత్త వారికి అయినా అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ సర్కార్ పై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు:


గ్రామ పంచాయితీల్లో మౌళిక వసతుల కోసం స్థానిక సంస్థల అకౌంట్ లో కేంద్రం వేసిన నిధుల్ని తెలంగాణ సర్కార్ గద్దలా గంటలో దారి మళ్లించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దాదాపు రూ. 5,080 కోట్లు తెలంగాణ గ్రామ పంచాయితీలకు కేంద్ర ఇటీవలే ట్రాన్స్ ఫర్ చేసిందన్నారు. అయితే ‘గద్దలా కాచుకొని ఉన్న తెలంగాణ సర్కార్.. నిధులు వచ్చిన గంట సేపటిలోపే దారి మళ్లించిందని ఆరోపించారు. ఇంతకు మించి దౌర్బాగ్యపు పరిస్థితి మరోటి ఉండదన్నారు. ఉపాధి హామీ స్కీం నిధుల్ని కూడా తెలంగాణ సర్కార్ పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు.

చంపడానికైనా సిద్దమే: మంత్రి


చావడానికైనా చంపడానికైనా సిద్ధమని.. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో రాకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఈడిగ ఆంజ‌నేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఏపీలో చదువు రాని వారిని కూడా హెల్త్ మినిస్టర్లను చేశారని..కేసీఆర్  అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులిస్తున్నారని చెప్పారు. అందరికీ పదవులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో క్రీడా పాలసీని  తీసుకొస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అమెరికాలో‌ పెచ్చురిల్లుతున్న గన్ కల్చర్:


అమెరికాలో దారుణం జరిగింది. ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన ఉటా రాష్ట్రంలోని ఇనోక్ సిటీలో జరిగింది. ఇక్కడ ఉంటున్న ఓ కుటుంబం కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులు బుధవారం చెకింగ్ కు వెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి చూసే సరికి అందరూ చనిపోయి ఉన్నారు. అందరి బాడీలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరు కాల్పులు జరిపారు? ఎప్పుడు జరిపారు? అనేది పోలీసులు వెల్లడించలేదు.

సంక్రాంతి తర్వాత కేసీఆర్ కొత్త పార్టీ!


సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కనుసన్నల్లో తెలంగాణ పేరు మీద మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. కుర్చీ, కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేశాడని ఆయన ఆరోపించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు.

జీహెచ్‌ఎంసీలోకి కంటోన్మెంట్!


సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేసింది..విలీనపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత విలీనానికి అవసరమైన విధి విధానాలను రూపొందించి నెల రోజుల్లోగా తుది నివేదికను అందజేయాలని నిర్ణయించింది.

సంక్రాంతికి 4233 బస్సులు:


సంక్రాంతికి 4233 ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు, ఈనెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని ఆయన ప్రకటించారు.

ఇంకో ఏడాదిలో రామ మందిరం:


వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అయోధ్యలో రామమందిరాన్ని పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కాలంగా కోర్టులకే పరిమితం చేశాయని అమిత్ షా విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం గుడి నిర్మించి తీరుతుందన్నారు.

దేశంలో విదేశీ వర్సిటీలు:


విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఇకపై మన దేశంలో క్యాంపస్ లను ఓపెన్ చేయొచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. వర్సిటీల్లోకి అడ్మిషన్లు, ఫీజుల క్రిటేరియా, నిధుల నిర్వహణ వంటి అంశాలపై యూజీసీ గురువారం డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేసింది. అయితే, దేశంలో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ వర్సిటీలు ఆఫ్ లైన్ మోడ్ లో మాత్రమే కోర్సులు నిర్వహించాలని, ఆన్ లైన్ లేదా డిస్టెన్స్ మోడ్ కోర్సులను ఆఫర్ చేయొద్దని యూజీసీ చైర్ పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఓడిన టీమిండియా..:


పూణేలో జరిగిన రెండో టీ–20 మ్యాచ్ లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. శ్రీ‌లంక‌, టీమిండియా మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక విక్టరీ సాధించింది. 207 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భారత జట్టు చివ‌రి ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. అయితే శ్రీ‌లంక కెప్టెన్ శ‌న‌క చివ‌రి ఓవ‌ర్‌లో కేవ‌లం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమిండియాపై శ్రీ‌లంక 16 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ లంక గెలవడంతో మూడు టీ–20 సిరీస్‌లో రెండు జ‌ట్లు చెరో పాయింట్‌తో సమమంగా నిలిచాయి.

3 కోట్ల మంది ఓటర్లు!


తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు. ఇందులో 1,50,48,250 పురుష ఓటర్లు ఉండగా, 1,49, 24,718 మహిళా ఓటర్లు ఉన్నారు.  18 నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్య  2,78,650 మంది ఓటర్లన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఈసీ తెలిపింది. అత్యల్పంగా భద్రాచలంలో   1,42,813 మంది ఓటర్ల ఉన్నారని వెల్లడించింది.  ప్రతి ఏడాది ఓటర్ల  జాబితా సవరణ తరువాత ఓటర్ల తుదిజాబితాను జనవరి నెలలో ఈసీ ప్రకటిస్తుంది. 

రణరంగంగా కలెక్టరేట్:


కామారెడ్డి కలెక్టరేట్ రణరంగంగా మారింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రెైతులు కలెక్టరేట్ ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కలెక్టర్‌ను కలిసి తీరుతామంటూ రైతులు భీష్మించుకొని కూర్చున్నారు.మాస్టర్‌ప్లాన్‌లో తన భూమి పోతుందనే ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చిన రైతులు కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టర్ వచ్చి మెమెురాండం తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. వీరికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు పలికారు.రైతుల ఆందోళనపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చేంజ్‌లో ఉందని.. ఈ విషయాన్ని రైతులకు ఎందుకు వివరించలేకపోయారని అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలకు సహాయం చేసేందుకే ప్రభుత్వం ఉందని, పట్టణాభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలని చెప్పారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here