ఈడీ విచారణలో కవిత చెప్పిన విషయాలివే.. 16న మళ్లీ రావాలని నోటీసులు.. హైదరాబాద్ లో అమిత్ షా.. మద్యం కేసులో భారీ ట్విస్ట్ ఇచ్చిన పిళ్లై.. టీఎస్పీఎస్సీ లో ప్రశ్నాప్రతాల హ్యాకింగ్ కలకలం.. 3 రోజుల పాటు మద్యం బంద్.. నేటి టాప్ న్యూస్ ఇవే

నాకెలాంటి సంబంధం లేదు: ఈడీ విచారణలో కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ శనివారం ముగిసింది. ఆమె అరెస్ట్ ఖాయమని ప్రచారం సాగినా.. అలాంటిదేమీ జరగకపోవడంతో కవిత చిరునవ్వుతో ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు.ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, ముడుపుల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఈడీ విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ నెల 16న మరో సారి విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు అందించింది. దాదాపు 8 గంటల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే.. తదుపరి విచారణ జరిగే 16న కవిత అరెస్టు అవ్వడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

అర్ధరాత్రి కేసీఆర్ ను కలిసిన కవిత

ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో కలిగి అర్ధరాత్రి 12.10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అనంతరం ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈడీ విచారణ జరిగిన తీరును ఈ సందర్భంగా కవిత కేసీఆర్ కు వివరించారు.

బండి సంజయ్ పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించి.. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఆలేరు ఎమ్మెల్యే సునీత, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వారు గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కోర్టుకు పిళ్లై..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ నెల 13న ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ లో అమిత్ షా

కేంద్ర హోమంత్రి అమిత్‌ షా… CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) రైజింగ్ డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 7.30కి ఆయన.. సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 9.15 వరకు ఆయన పరేడ్ కార్యక్రమంలోనే ఉంటారు. ఆ తర్వాత తిరిగి… గత రాత్రి బస చేసిన నిసాకు వెళ్తారు. ఉదయం 11.35 వరకు నిసాలో ఉంటారు. తర్వాత.. 11.40కి నిసా నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో హకీంపేట ఎయిర్‌ఫీల్డ్‌కు వెళతారు. 11.50కి ప్రత్యేక విమానం ఎక్కి.. కేరళలోని కోచికి వెళతారు. ఇలా ఇవాళ అమిత్ షా టూర్ ఉండనుంది. అమిత్‌షా శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకు హకీంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితర కీలక నేతలు స్వాగతం పలికారు.

టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ కలకలం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన టీఎస్పీఎస్సీ అధికారులు ఆది, బుధ, గురువారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం టౌన్‌ ప్లానింగ్‌ బిల్దింగ్‌ ఓవర్‌సీర్‌ (టీపీబీవో) పోస్టులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 15, 16న వెంటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. వాయిదా వేసిన ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. తమ వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడంపై టీఎస్పీఎస్సీ సూపరింటెండెంట్‌ బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిర్దిష్ట వివరాలు తెలపనప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశమే అయి ఉంటుందని సమాచారం.

6 నెలల్లో చెక్కర పరిశ్రమ

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్ బోర్డు తిప్పేశాడని ఎద్దేవా చేశారు. మాట తప్పాక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ రేవంత్ పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా అని ప్రజలను అడిగారు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నారన్నారు. మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి ప్రజలు తొక్కారన్నారు. అయితే.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు.

మూడు రోజులు మద్యం బంద్

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల‌ నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here