నేడు కేంద్ర బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పెట్టబోతున్న ఆఖరు బడ్జెట్ ఇదే! వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఈసారి పన్నుమోత నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుందని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితి పెంపు, కొన్నిరకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటివాటిని నిర్మల ప్రకటిస్తారని, తమకు ఊరట కలిగిస్తారని బీజేపీకి అత్యంత కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ద్వారా చేసే వ్యయాన్ని పెంచాలని పేదలు కోరుకుంటున్నారు.
టాప్ టెన్ రిచ్ నుంచి అదానీ అవుట్
హిండెన్ బర్గ్ దెబ్బకు గౌతం ఆదానీ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మందిలో గౌతం ఆదానీ స్థానం కోల్పోయాడు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు పూర్వం నాలుగో స్థానంలో ఉన్న ఆదానీ ఇప్పుడు పదకొండో స్థానానికి పడిపోయాడు. గత మూడురోజుల్లోనే ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్ల అమ్మకాల్లో ధరలు పడిపోవటంతో.. అదానీ 34 బిలియన్ డాలర్లు నష్టపోయాడు.
ఐఏఎస్‌ల బదిలీలు.. నవీన్ మిట్టల్ రెవిన్యూకు
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. ఇంటర్ బోర్డులో వివాదం రేపిన నవీన్ మిట్టల్ ను రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ చేశారు. సీసీఎల్ఏగా అదనపు బాధ్యతల అప్పగించారు. ఆయనతో పాటు పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మరో తొమ్మిది నెలలే గడువు ఉండడంతో ముందస్తుగా బదిలీలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా నిర్మల్ నుంచి బదిలీ అయిన ముషరాఫ్ అలీ కి పోస్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీ గా పనిచేస్తున్న క్రిస్టినా చోంగ్తు నుంచి పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పించి భారతి హోలికేరిని నియమించారు
హుజురాబాద్ నుంచి కౌశిక్‌రెడ్డి
వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని పోటికి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. తమ పార్టీకి ప్రత్యర్థిగా మారిన బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ నియోజకవర్గంపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ‘నిన్న జరిగిన పొరపాటు హుజురాబాద్ గడ్డమీద మళ్ళీ జరగొద్దు… కౌశిక్ రెడ్డి నువ్వు ప్రజల్లోనే ఉండూ… ఇక్కడే ఉండూ… జనంలో ఉండూ… ఇక్కడే తినూ… ఇక్కడే పడుకో… మళ్ళీ వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటది…అని మంగళవారం జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభ లో కేటీఆర్ మాట్లాడటం ఈ సంకేతాలు జారీ చేసింది. రెండేళ్ల కిందటి ఉప ఎన్నికల్లో ఈటలపై టీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోటికి దింపింది. ఆ ప్రయోగం ఫెయిలవటంతో ఈసారి పాడి కౌశిక్ రెడ్డిని పోటీకి దింపే అవకాశాలున్నాయి.
పోటీకి రెడీ అవుతున్న గుత్తా కొడుకు
తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ రెడ్డి పోటీపై పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అవకాశం లభిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య నెలకొన్న వివాదంపై గుత్తా స్పందిస్తూ కేంద్రం చెప్పినట్లు గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం తమిళనాడు తరహాలో ఉండదని అనుకుంటున్నామన్నారు.
జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
గ్రూప్-1 మెయిన్స్ తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 తేదీవరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 25, 000 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశంతో హారిజెంటల్ విధానంలో రిజర్వేషన్లు చేపట్టినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. మల్టీజోన్ రిజర్వేషన్ ప్రకారం 1;50 అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి కూడా గాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పిల్లలకు తగిన చికిత్స అందించాలని ఆదేశించారు.