Homecinemaఎన్నెన్నో.. వింత పల్లెలు

ఎన్నెన్నో.. వింత పల్లెలు

అనేక ప్రాంతాలు.. అనేక భాషలు.. అనేక ఆచార, వ్యవహారాలు. ఇండియా అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాటలివి. అయితే, దేశంలో చాలా ప్రాంతాలు మనకు తెలియని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. కట్టు, బొట్టు ఒక్కటే కాదు.. వాళ్ల పద్ధతులు మనకు తెలియవు. కొన్ని మూఢ నమ్మకాల్లా అనిపించినా.. అవే వాళ్లకు ఆచారం. ఇతరులకు నష్టం కలిగించని ఏ ఆచారమైనా దురాచారం కాదనేది వాళ్ల నమ్మకం. కాబట్టి మనమూ తెలుసుకుందాం..

మిలీనియర్ల విలేజ్​

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్న హివారే బజార్‌కు మిలీనియర్ల గ్రామమని పేరు. ఈ ఊర్లో 60 మందికి పైగా మిలీనియర్లు ఉన్నారు. దేశంలోనే ధనిక గ్రామంగా పేరు పొందింది. 1995 వరకు ఈ ఊరిలో 168 కుటుంబాలు పేద కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. హివారే బజార్‌ ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ పొపట్రావ్‌ పవార్‌. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించేలా.. ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారాయన. ఆ ఊరిలో అనుసరించే తాగు, సాగు నీటి పద్ధతులను యూనివర్సిటీల్లో క్లాసులుగా చెబుతున్నారు. ఒకప్పుడు 30 శాతం ఉన్న అక్షరాస్యత.. ఈ రోజు 95 శాతమైంది. గ్రామ అభివృద్ధి చూసి వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చేస్తున్నారు. ‘మా గ్రామంలో ఒక్కటంటే ఒక్క దోమను చూపించండి.. వంద రూపాయలిస్తా’ అని పోపట్రావ్‌ విసిరిన ఛాలెంజ్‌తో హివారే బజార్ పేరు మార్మోగింది. అదెలా సాధ్యమని తెలుసుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని భావించిన స్థానికులు.. ఇతర పల్లెలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సంస్కృత గ్రామం

ఈ కాలంలో ప్రాచీన భాషలు మాట్లాడేవారిని ఎక్కడైనా చూస్తున్నామా..? ప్రాచీన భాషలేమో గానీ.. కనీసం మాతృభాషలో మాట్లాడే వాళ్లే కరువయ్యారు. అలాంటిది క‌ర్ణాట‌క‌లోని షిమోగా జిల్లాలోని మ‌త్తూర్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడతారు. సంస్కృతాన్ని స‌జీవంగా ఉంచేందుకు గ్రామంలోని ‘సంస్కార భార‌తి’ పాఠ‌శాల విశేషంగా కృషి చేస్తోంది. ఇక్కడి పిల్లలకు పదేళ్ల నుంచే వేద పారాయ‌ణం చేయిస్తారు. దీంతో పిల్లలకు చిన్నప్పటి నుంచి సంస్కృతంపై పట్టు ఉంటోంది. పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడతారు. ఇక్కడ ఉండే ముస్లింలు కూడా సంస్కృతంలోనే మాట్లాడడం విశేషం. దాదాపు 500 ఏళ్లుగా ఈ సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. అయితే, ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చేవాళ్లతో మాత్రం స్థానిక భాషలో మాట్లాడతారు.

ఆఫ్రికా వాళ్ల జంబూర్​

గుజరాత్ రాష్ట్రంలోని జంబూర్ గ్రామానిది ఓ ప్రత్యేక స్థానం. గ్రామంలో ఉండే సిద్ధి తెగవాళ్లు ఆఫ్రికా నుంచి ఇక్కడకు వలస వచ్చారు. వీళ్లు పుట్టింది ఆఫ్రికాలో అయినా నేషనాలిటీ భారత్‌. మాట్లాడే భాష గుజరాతీ. జునాఘడ్ నవాబులు, గోవాలోని పోర్చుగీసు ప్రభుత్వం వద్ద పని చేస్తుండేవారు. అప్పటి నుంచి దేశంలోనే ఉండిపోయి.. మనతో మమేకమయ్యారు. మన పండుగలు కూడా చేసుకుంటారు. అయితే, పెళ్లిళ్లు మాత్రం సొంత తెగ వారినే చేసుకుంటారు.

ఊరంతే పాములే

పాము కనిపిస్తే చాలు భయంతో పరిగెడతాం. అయితే, మహారాష్ట్రలోని షెత్పాల్‌ గ్రామ ప్రజలు మాత్రం భయపడరు. పోనీ.. చిన్న పిల్లలైనా భయపడతారా అంటే? అదీ లేదు. ఇంటికి చుట్టాలు వచ్చినట్టు.. పాములూ స్వేచ్ఛగా ఇంట్లోకి వస్తాయి. ఇంట్లో ఫ్యానులకు, గోడలకు పాములు వేలాడుతుంటాయి. గ్రామంలో విషపూరితమైన పాములు ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లు పాములను దైవంగా పూజిస్తారు. ‘ది విలేజస్‌ ఆఫ్‌ స్నేక్స్‌’గా పిలిచే షెత్పాల్‌ గ్రామంలో ప్రజలంతా పాములతో సహవాసం చేస్తున్నా ఇంతవరకూ ఒక్కరు కూడా పాము కాటు వల్ల చనిపోలేదు.

సూసైడ్‌ స్పాట్‌ ఇదే

అస్సాంలోని బోరైల్‌ హిల్స్‌ ప్రాంతంలో జతింగా అనే గ్రామం ఉంది. ఇక్కడ ఏటా వర్షాకాలంలో (సెప్టెంబర్‌-అక్టోబర్) పక్షలు ఆత్యహత్యలు చేసుకుంటాయి. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వేలాది వలస పక్షులు వేగంగా ప్రయాణించి అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొట్టి మరణిస్తాయని స్థానికులు చెబుతున్నారు. కాబట్టే ఈ ప్రాంతాన్ని ‘మాస్‌ బర్డ్‌ సూసైడ్‌’గా పిలుస్తున్నారు. జతింగాకు పక్షుల ‘సూసైట్ స్పాట్’ గా పేరు రావడానికి అసలు కథ వేరని పక్షి శాస్త్రవేత్తలు అంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుంపర జల్లులు, మంచు పడుతుంటాయి. ఆ టైంలో అక్కడి ఇళ్లలోని లైట్లు, వాచ్‌ టవర్ల ఫ్లడ్‌ లైట్ల కాంతికి పక్షులు ఆకర్షితమయ్యేవి. అవి గ్రామానికి వచ్చి దిక్కు తెలియక గోడలకు ఢీకొట్టి పడిపోయేవి. స్థానికులు వాటిని కర్రలతో కొట్టి చంపేవాళ్లు. దీంతో ఆ ప్రాంతానికి పక్షులు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంటాయని ప్రచారం మొదలైంది’ అనేది పరిశోధకుల మాట.

క్లీన్‌ ‘మావ్లిన్నోంగ్‌’

మేఘాలయలోని చిన్న గ్రామం మావ్లిన్నోంగ్‌. ఊరంతా పచ్చదనం. ఈ గ్రామం ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి ప్రజలు ప్రకృతి సంరక్షణకు పాటుపడతారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉంటాయి. చెత్త వేసేందుకు రోడ్ల పక్కన వెదురు బుట్టలు ఉంటాయి. ఇక్కడి ప్రజలు ప్లాస్టిక్‌ బ్యాగులు ఉపయోగించరు. పరిశుభ్రతపై స్కూళ్లలో పాఠాలు చెబుతారు. ఈ గ్రామాన్ని చూడటానికి విదేశీయులు కూడా వస్తుంటారు.

ఇది దెయ్యాల ఊరు

రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కుల్దారా గ్రామం ఉంది. అది దయ్యాల ఊరుగా గుర్తింపు పొందింది. ఆ పేరు ఎందుకొచ్చిందంటే.. ఒకప్పుడు పాలివాల్‌ బ్రాహ్మణులు కుల్దారా గ్రామానికి వలస వచ్చారు. అయితే , పాలివాల్‌ వంశస్థులను జైసల్మేర్ దివాన్‌ రకరకాల పన్నులు వేశావాడు. అంతేకాకుండా కుల్ధార గ్రామ పెద్ద కుమార్తెను ప్రేమించాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని పాలివాల్‌ బ్రాహ్మణ పెద్దను బెదిరించాడు. లేకపోతే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే పాలివాల్‌ బ్రాహ్మణులకు వారి తెగకు చెందిన వారికి తప్ప మరో తెగ లేదా కులానికిచ్చే ఆనవాయితీ లేదు. ఆ అంశాన్నే చర్చించేందుకే బ్రాహ్మణులంతా ఒక రోజు సమావేశమయ్యారు. అర్థరాత్రి వరకు చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారో గానీ, అప్పటి నుంచి వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యారు. ఇది చరిత్రలో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. అయితే ఆ గ్రామ పెద్ద ఊరు నుంచి వెళ్లిపోతూ గ్రామంలో ఉండేవారికి దయ్యాల చేతిలో మరణం తప్పదని శపించాడని, అందుకే ఈ కుల్దారాకు దయ్యాల గ్రామంగా పేరొచ్చిందని చెబుతారు. ఈ గ్రామంపై ఎన్నో పరిశోధినలు జరిగనా.. అసలు విషయం మాత్రం తెలియలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc