మీరు ఎప్పుడైనా మీ బూట్లు బయట వదిలి గదిలోకి వెళ్లిన తర్వాత కూడా దుర్వాసన రావడం గమనించారా.ఈ ఇబ్బందికరమైన సమస్యను చాలా మందే ఎదుర్కొనే ఉంటారు. దీనికి కారణం అపరిశుభ్రమైన సాక్స్ లేదా షూస్ అని మనందరికీ తెలుసు. కానీ అంతకన్నా ముఖ్య కారణం మీ పాదాలు అపరిశుభ్రంగా ఉండడమే అని ఎప్పుడైనా గమనించారా. శుభ్రమైన సాక్స్, షూలను ఉపయోగించిన తర్వాత కూడా వాసన వస్తుందంటే అది ఖచ్చితంగా మీ పాదాల నుంచి వచ్చే వాసనే కారణం.
హెల్త్‌లైన్ ప్రకారం, శరీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, పాదాలలో ఎక్కువ చెమట గ్రంథులు ఉంటాయి. రోజంతా శరీరం, పాదాలను చల్లగా ఉంచడం వాటి పని. కాబట్టి ఈ గ్రంథులు నిరంతరం చెమటలు పట్టిస్తాయి. యుక్తవయస్కులు లేదా గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల మార్పుల వల్ల ఇది వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది వైద్య కారణాల వల్ల పాదాల్లో ఎక్కువ చెమట వస్తుంది. ఇలా మీ పాదాలు దుర్వాసన రాకుండా చూసుకోవడానికి నివారణ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.
- ఉదయం, రాత్రి సబ్బు లేదా నీటితో మీ పాదాలను పూర్తిగా శుభ్రం చేసుకోండి. మీ కాలి వేళ్ల మధ్య భాగంలో ఎక్కువగా రుద్దండి. ఆ తర్వాత తుడవడం మాత్రం మర్చిపోవద్దు.
- మీ గోళ్లలోని మృతకణాల్లో బ్యాక్టీరియా తరచుగా పేరుకుపోయి వృద్ధి చెందుతుంది. కాబట్టి మీ గోళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
- పాదాలపై చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయకపోతే, డెడ్ స్కిన్ లోని మందపాటి పొర లోపల బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.
- తడి సాక్స్ లేదా బూట్లు ధరించడం వలన మీ పాదాలు దుర్వాసనను కలిగిస్తాయి. ప్రతిరోజూ మీ బూట్లను మారుస్తూ ఉండాలి. వాటికి ఒక రోజు విరామం ఇవ్వడం ఉత్తమం. అంతే కాకుండా వాడిన తర్వాత వాటిని సూర్యరశ్మికి ఉంచడం మంచిది.
- పడుకునే ముందు మీ పాదాలను కడిగి డ్రై రబ్బింగ్ ఆల్కహాల్‌తో శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్‌లో ముంచిన పత్తిని ఉపయోగించి పాదాలపై చర్మాన్ని పూర్తిగా రుద్దండి. ఇది మీ పాదాలపై బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.
- మీ పాదాలు దుర్వాసన వస్తుంటే, బూట్లు ధరించే ముందు మీ పాదాలపై యాంటీ ఫంగల్ పౌడర్‌ను చల్లుకోండి.
- ప్రతి రోజూ రాత్రి మీ పాదాలను కడుక్కోండి. వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచండి.