అపరంజి బజార్..​ అందాల లాడ్‌ బజార్‌

‘ఏ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ జాయ్‌ ఫరెవర్‌’ అంటూ ఇంగ్లిష్‌ పోయెట్‌ చెప్పినా… ‘అందమె ఆనందం’ అంటూ తెలుగు కవి చెప్పినా అర్థం ఒక్కటే.

అందమైనది ఆనందమిస్తుంది. ఆనందమిచ్చేది ఆయుష్షు పెంచుతుంది.

అది వస్తువైనా… అలంకరణైనా, ఆభరణంలా అలముకునేదైనా, అందాన్ని పెంచేదేదైనా… ఏదైనా సరే… ఆనందమిస్తుందీ… ఆయుష్షునిస్తుంది.

అలా అమందానందాయుష్షులనిచ్చే బజారేదైనా ఉందంటే…

అది లాడ్‌ బజారే!

ఇరుకు సందులలో జనసమర్థంతో మెరిసే జిలుగు బజార్‌ అది. 

సరుకు, సరంజామాలతో తనువూ, మనసూ హుషార్‌ అక్కడ. 

ఓ పక్క చార్మినార్, ఇంకో పక్క చౌమొహల్లా… మరో పక్క మక్కా మసీదు… అన్ని వైపులా అలకిడులే… మనుషుల మనుషుల తాకిడులే… రద్దీకదా!!

కాస్తంత గోల్‌మాల్‌ ఉన్నా చాలావరకు అస్‌లీ మాల్‌…

కొత్తగా రూపుదిద్దుకుంటున్న కొన్ని కొన్ని చిన్న మాల్స్‌ కూడా.

ఎలా రూపొందిందంటారు ఈ లాడ్‌ బజార్‌?!

రెండు కన్రెప్పల మధ్యన మిలమిలల నల్లగుడ్డు తాలూకు కంటి చూపులా.

రెండు ముత్తియపు రాచిప్పల మధ్యన ఇసుకతో ఏర్పడ్డ ముత్యపు తెల్ల మెరుపులా.

అచ్చం అలా…

అచ్చం అలాగే…

రెండు నగ (పాత, కొత్త)ల సందిట నస్నని సందుల్లో రూపొందిన ముత్యంలా వెలసింది కాబోలు  ఈ అపరంజి బజారు…

ఆనాడా.. ఈనాడా… అలనాడెప్పుడో కుతుబ్‌షాహీల కాలం నుంచి…

అటు తర్వాత నిజాముల నాటి నుంచి… నేటి వరకు… ఈనాటి వరకూ!

అక్కడ తిరిగే వనితల చూసినప్పుడు హుషారు.

అక్కడి రద్దీని, దాన్ని లెక్కచేయనట్టుగా ఉండే ఆ రష్‌ తాలూకు జిద్దీతనాన్నీ చూసినా, కొన్ని వస్తువుల ధరలు విన్నా… కాస్తంత బేజారు కూడా.

అప్పుడెప్పుడో అంగళ్ల రత్నాల రాశులను అమ్మారో లేదోగానీ…

ఇప్పటకీ లాడ్‌ బజార్‌లో…

రాశుల పోసిన ముత్యాలన్నీ గాజుల జతల్లోకి దూరి…

వాటి లక్కపదార్థంలోకి ఇంకీ ఇరికీ… ఒదిగిపోయినట్టే పొదిగిపోతాయి.

జస్ట్‌… ముత్యాలేనా? వజ్రవైఢూర్య, మరకత, మాణిక్య… రత్నరాసులన్నీ మారువేశాలేసుకుని మెరుపులు దిగేసుకుని రంగురాళ్ల రూపాల్లో ఆభరణాల్లోకి అంటుకుపోయి… అలా సాయంత్రపు దీపాల కాంతులతో తేజరిల్లి… మళ్లీ మహిళల ముఖాల మీద కాంతులీనుతూ ప్రతిబింబాలను మిలమిలలాడిస్తుంటాయి.

లాడ్‌బజారు నిండా… కనులు మిరుమిట్లు గొలిపేలా మెరుపులూ వెలుగులు.

ఒళ్లు పులకరించిపోయే విలువైన మౌక్తికాలూ, పచ్చల–కెంపు జిలుగులు.

అవి ముత్యాల గాజులైనా, రత్నాల ఆభరణాలైనా, చేనేతలు–సిల్కులైనా, చమ్కీల చీరలైనా, ఎంబ్రాయిడరీల నగిషీలైనా , బిద్రీ–కచ్‌వరఖ్‌ల బట్టలైనా, దుపట్టాలూ కుర్తాలైనా, చున్నీ–చూడిదార్‌లైనా, దూదిపూలలాంటి దుస్తులైనా… అవేవైనా సరే… మగువలకూ,  మహిళలకూ కావాల్సిన మనోహరమైన వస్తువులేవైనా… ఇవన్నీ  దొరికేది లాడ్‌బజార్‌లోనే.

గాజులూ, మెడగొలుసుతూ, ఆభరణాలేనా… మెరుపు జిలుగుల కాలి చెప్పులూ మొదలుకొని… ఆ కాళ్లు నడవాల్సిన తివాసీల వరకు కాంతులీనుతాయి.

ఈనాటి ఆధునిక యుగంలోనూ… పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినా

సముద్రాల ఆవల నుంచి విచ్చేసినా, విదేశాల నుంచి వేంచేసినా…

అందరూ తిరిగీ తిరిగీ తెగ తిరిగినా… విసుగురాని బజార్‌… లాడ్‌ బజార్‌.

ముంజేతి కంకణాలకే కాదు… గాజులకూ అద్దం అక్కర్లేదు. 

లాడ్‌ బజారుకూ ఎవరి పరిచయమూ అక్కర్లేదు. షాపింగంటే… లాడ్‌బజారు! లాడ్‌ బజారంటే షాపింగ్‌!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here