పోడు పోరులో అధికారి బలి.. అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అమెజాన్ లో ఏటా 48 వేల జాబ్స్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

1. పోడు వివాదం.. గుత్తి కోయల దాడిలో రేంజర్​ మృతి.

FILE PIC: FOREST RANGER SRINIVASA RAO

పోడు వివాదం ఒక ఫారెస్ట్ ఆఫీసర్​ను బలి తీసుకుంది. గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్​ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఆదివాసీ గుత్తి కోయలు పోడు భూముల సర్వేకు వెళ్లిన ఫారెస్టు సిబ్బందిపై ఈ దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ రేంజర్​ను కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. రిటైర్​మెంట్​ వయస్సు వరకు ఆ కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.

2. బండి సంజయ్​ యాత్ర 28 నుంచి..

బండి సంజయ్ ఐదో విడత పాద యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సంజయ్​ ప్రకటించారు. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం లో పూజలు చేసి ఈ యాత్రను ప్రారంభిస్తారు. అదే రోజున భైంసా లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 15 లేదా 16 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు బండి సంజయ్ 4 విడతలుగా 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1178 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 21 జిల్లాల పరిధిలో యాత్ర కొనసాగింది.

3. మంత్రి మల్లారెడ్డి ఇంటిపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై మంగళవారం తెల్లారుజామున మొదలైన ఐటీ దాడులు రాత్రి వరకు కొనసాగాయి. రెండో రోజు కూడా సోదాలు కొనసాగనున్నాయి. ఆయన కుమారులు, అల్లుళ్లు, బంధువుల ఇండ్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. భారీగా ఆస్తుల వివరాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డికి చెందిన నాలుగు మెడికల్​ కాలేజీల్లో సీట్ల అమ్మకానికి సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు తెలిసింది. ఐటీ విభాగం ఈ సోదాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.

4.డబుల్​ ఇంజన్​ సర్కారు..బీజేపీ తీర్మానం

బీజేపీ మూడు రోజుల శిక్షణ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశాల ముగింపు సందర్భంగా బీజేపీ కీలకమైన రాజకీయ తీర్మానం చేసింది. కేసీఆర్​ అవినీతి కుటుంబ నిరంకుశ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయటంలో టీఆర్​ఎస్​ ఫెయిలైందని, తమ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాజకీయాలు చేస్తోందని ప్రకటించింది. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్​.. బీఎల్ సంతోష్ కు సిట్ నోటిసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. సంతోష్ కి ఫామ్ హౌజ్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు

5. ఆఫీసర్​ గల్లా పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే

మహబూబ్​నగర్​ జిల్లా గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి జిల్లా ఆఫీసర్​ గల్లా పట్టుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి చేరుకోక ముందే జడ్పీ ఛైర్​ పర్సన్​ సరిత గురుకుల పాఠశాల ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే తాను లేకుండా ఎలా స్కూల్​ ప్రారంభించారంటూ ఆగ్రహంతో అక్కడున్న అధికారులపై ఫైర్​ అయ్యారు. అక్కడే వున్న ఓ అధికారి గల్లా పట్టుకోవటంతో అధికారులందరూ షాకయ్యారు. టీఆర్​ఎస్​ పార్టీలోనే ఉన్నప్పటికీ.. జెడ్పీ ఛైర్​ పర్సన్​, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలే ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమయ్యాయి.

6. హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్.. 48 వేల మందికి ఉద్యోగాలు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు చెందిన వెబ్ సర్వీసెస్ ఆసియా ఫసిఫిక్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. దీంతో వచ్చి ఎనిమిదేళ్లలో 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఇంకా ఏటా 48 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది.

7. వారి అరెస్ట్?

బీఎల్ సంతోష్ (ఫైల్ ఫొటో)

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన భరత్ ధర్మ జనసేన అధినేత తుషార్ వెల్లపల్లి, వైద్యుడు జగ్గుస్వామికి లుక్ అవుట్ నోటీసులను జారీ చేసింది సిట్. విచారణకు గైర్హాజరు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. వీరిని అరెస్ట్ చేసే అవకాశం సైతం ఉందన్న ఊహాగానాలు జోరోగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు జారీ చేశారు. వీరిని ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

8. ఆ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్..


ఓయూలో డిగ్రీ, పీజీతో పాటు పలు వృత్తి విద్యాకోర్సులు చదివి ఫెయిల్ అయి పట్టా పొందలేక పోయి విద్యార్థులకు శుభవార్త. ఆయా విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసుకునే వన్ టైం ఛాన్స్ కల్పించింది యూనివర్సిటీ. యూనవర్సిటీ పరిధిలో 2010 నుంచి 2017 వరకు వివిధ కోర్సులు చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. వారు రూ.10 వేల ఫీజు చెల్లించి పరీక్షలు రాయవచ్చని యూనివర్సిటీ తెలిపింది. ఇతర వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.

9. జిల్లాల్లోనూ బ్రెయిన్ డెడ్ నిర్ధారణ:


భారీగా అవయవదానాలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లోనూ బ్రెయిన్ డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నిర్ధారణ కమిటీలను ఈ మేరకు ఏర్పాటు చేయనున్నారు.

10. 30 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు..


రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో సూచించారు. 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందాలనుకునే వారు.. ఆన్లైన్ ద్వారా తమ అప్లికేషన్లను పంపుకోవాలని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here