రాజుల కాలంలో ఎలాంటి కరెన్సీ ఉండేదో తెలుసుకోవాలని ఉందా? పూర్వపు కాణీలను, అణాలను, అర్ధణాలను మళ్లీ చూడాలని ఉందా? వెయ్యి, ఐదువందలు, రెండువందలు, వంద రూపాయల నాణేలు ఉన్నాయని తెలుసా? వినడానికే విచిత్రంగా ఉంది కదా.. కానీ హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న ‘బ్రైట్ అండ్ కో కంపెనీ’ కి వెళితే వాటన్నింటిని ప్రత్యక్షంగా చూడొచ్చు.. నచ్చితే కొనుగోలు కూడా చేసుకొవచ్చు..
స్టాంప్ లను సేకరించే అలవాటు ఉన్న బద్రూద్దిన్ ఖాన్ అనే ఆయన అరుదైన నాణెలను, నోట్లను సేకరించడం మొదలుపెట్టాడు.. మొదట్లో హాబీగా మొదలుపెట్టినా ఆ తర్వాత దాన్నే వ్యాపారం గా మలుచుకొని వివిధ ప్రాంతాలకు వెళ్లి నాణెలను, నోట్లను, స్టాంప్ లను సేకరించి భాగ్యనగరంలో విక్రయించేవారు.. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో నాణెలు సేకరించి అమ్మే వారు తక్కువగా ఉండటంతో వీరి వ్యాపారం మూడు పూవులు, ఆరుకాయలుగా కొనసాగింది.. బద్రూద్దిన్ ఖాన్ మరణించినా ప్రస్తుతం ఆయన కొడుకు అక్బర్ ఖాన్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అప్పటి రాజుల కాలం నాటి నాణెల నుంచి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నయా నాణెల వరకు ప్రతి ఒక్కటి వీరి వద్ద ఉంటుంది.. అంతేకాదు దేశవిదేశాలకు చెందిన స్టాంప్ లు, వాటికి సంబంధించిన పుస్తకాలు, మనం ఎప్పుడు చూడని నోట్లు ఇక్కడ సందడి చేస్తుంటాయి.. ఓనాలుగు దశాబ్దాల క్రితం వాడుకలో ఉన్న కాణీ, అణా, నయాపైసా, పదిపైసలు, ఇరవై పైసలు, చారణా, ఆఠాణా, పాతరూపాయి బిల్ల, రూపాయి నోటు, రెండు రూపాయల నోటు, పాత వందరూపాయలనోటు, యాభై రూపాయల నోటు, ఐదువందల నోటు, అప్పట్లో రాజుల చిత్రంతో కూడిన నోట్లు ఇవన్ని బ్రైట్ అండ్ కో కంపెనీ లో నెలవై ఉన్నాయి.. వీటితోపాటు వెయ్యి రూ.ల నాణెం, 500రూ.లనాణెం, 200రూ.ల నాణెం, 150రూ.ల నాణెం, 100రూ.ల నాణెం, 75రూ.ల నాణెం, 60రూ.ల నాణెం, 50రూ.ల నాణెం, 25రూ.ల నాణెం.. ఇలా అరుదైన నాణెలను ఇక్కడ చూడొచ్చు.. 1000రూ.ల నాణెం మన సొంతం కావాలంటే 9500రూ.లు చెల్లించాల్సిందే.. ఇక్కడ ధరలు కూడా మనం ఎంచుకొనే నాణెలను బట్టి ఉంటాయి..
దేశవిదేశాలకు చెందిన స్టాంప్ లు:
ఈ షాప్ లో నాణెలు, నోట్లతో పాటు అరుదైన స్టాంప్ లు కూడా ఉన్నాయి..నిజాం నవాబుల కాలం నాటి స్టాంప్ లు, ట్రాన్స్ పోర్ట్ కి సంబంధించిన స్టాంప్ లు, పక్షుల బొమ్మల స్టాంప్ లు, జర్మనీ దేశపు లోగో తోకూడిన స్టాంప్ లు, యూఎస్ఏ స్టాంప్ లు, జలరాశుల స్టాంప్ లు, జంతువుల స్టాంప్ లు, క్రీడా స్టాంప్ లు, స్వాతంత్య్ర సమరయోధుల ముఖచిత్రాలతో కూడిన స్టాంప్ లు, జాతీపిత మహాత్మ గాంధీ స్టాంప్ లు ఇక్కడ లభిస్తున్నాయి.. స్టాంప్ లు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది కాబట్టి అలాంటివారు ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన స్టాంప్ లను కొనుగోలుచేసుకుంటున్నారు..
‘మా నాన్న కు అరుదైన నాణెలు, స్టాంప్ లు సేకరించడం అంటే ఇష్టం.. ఒక హాబీలా మొదలుపెట్టి దాన్నే వ్యాపారంగా మలిచారు.. ప్రస్తుతం నేను ఈవ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను.. చైన్నై, ముంబాయి లో ఉన్న డీలర్ల నుంచి రాజుల కాలం నాటి నాణెలను, అరుదైన నోట్లను కొంటుంటాం.. కలకత్తా లోని డీలర్ల దగ్గర నుంచి స్టాంప్ లను కలెక్ట్ చేస్తాం.. ఇలా సేకరించిన వాటిని ఇక్కడ అమ్ముతుంటాం. మా వద్ద అన్ని రకాల స్టాంప్ లు, నాణెలు, నోట్లు ఉంటాయి.. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో అమ్మకాలు బాగా జరిగేవి.. ప్రస్తుతం కాస్త తగ్గింది..’ అని ఆ షాప్ యజమాని అక్బర్ ఖాన్ అంటున్నారు.