మ్యాథ్స్‌ మేధావి వశిష్ఠ నారాయణ సింగ్‌

‘‘మీరు జీనియస్‌ కావచ్చు. కానీ ఒక భర్తగా ఏమాత్రం పనికిరారు. కలిసి జీవించడం కుదరదు’’ పుట్టింటి నుంచి భార్య పంపిన సందేశాన్ని చదివాడు వశిష్ఠ. గుండె మోయలేనంత బరువనిపించింది. కళ్ల వెంట నీటిధార. మాయదారి స్కిజోఫ్రెనియా(మనోవైకల్యం) జీవితాన్ని ఛిధ్రం చేస్తుంటే ప్రేక్షకుడిలా చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితి తనది.

మలుపుతిప్పిన మ్యాథ్స్‌ కాన్ఫరెన్స్‌

బిహార్‌లోని భోజ్‌పురి జిల్లా బసంత్‌పూర్‌లో 1942 ఏప్రిల్‌ 2న జన్మించారు వశిష్ఠ నారాయణ సింగ్‌. మెట్రిక్‌, ఇంటర్‌లలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌. పట్నా యూనివర్సిటీలో బీఎస్సీ చదివారు. 1960లో పట్నా వర్సిటీలో ఓ మేథమెటిక్స్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. దానికి యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-బర్క్‌లీ నుంచి మ్యాథ్స్‌ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ జాన్‌ ఎల్‌ కెలీ అతిథిగా హాజరయ్యారు. గణితశాస్త్రానికి సంబంధించి కెలీ అడిగిన సంక్లిష్టమైన ప్రశ్నలకు వశిష్ఠ నారాయణ తప్ప ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ప్రొఫెసర్‌ కెలీ ఇంప్రెస్‌ అయ్యారు. విమానం ఖర్చులు కూడా ఆయనే భరించి.. వశిష్ఠను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో చేర్పించారు. ఫంక్షనల్‌ అనాలసిస్‌(ఆర్‌కేహెచ్‌ఎస్‌)లో పీహెచ్‌డీ చేసిన వశిష్ఠ పదులకొద్దీ కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరించారు. ఇవాళ్టికి కూడా అమెరికా గణితశాస్త్రవేత్తలకు మన వశిష్ఠ రూపొందించిన సిద్ధాంతాలే ఆధారం.

మాతృభూమిపై ప్రేమతో తిరిగొచ్చేశారు..

వాషింగ్టన్‌లో ప్రొఫెసర్‌గా, అమెరికా అంతరిక్ష పరిశోధనల కేంద్రం నాసాలోనూ వశిష్ఠ నారాయణ కొంతపాలం పనిచేశారు. కళ్ల ముందు మంచి కెరీర్‌ కనిపిస్తున్నా మాతృదేశంపై ప్రేమతో తిరిగొచ్చేశారు. కాన్పూర్‌ ఐఐటీ, ముంబైలోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటర్ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌), కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌(ఐఎస్‌ఐ) లాంటి దిగ్గజ సంస్థలతోపాటు పలు వర్సిటీల్లోనూ సేవలందించారు.

జీవితం నరకప్రాయం

1973లో ఛాప్రాకు చెందిన వందనా రాణిని వశిష్ఠ నారాయణ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే ఆయన స్కిజోఫ్రెనియా బారిన పడ్డారు. ఆ తర్వాత జీవితమంతా నరకప్రాయంగా సాగింది. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు భ్రాంతి చెందే వశిష్ఠతో ఉండలేనంటూ భార్య వెళ్లిపోయింది. వారికి పిల్లలు కూడా లేరు. దీంతో తోబుట్టువులే వశిష్ఠ మంచి చెడులు చూసుకునేవారు. ఓ సారి ప్రయాణంలో ఎవరికీ చెప్పకుండా రైలు దిగేశారాయన. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చనిపోయి ఉంటారని అందరూ భావించారు. కొన్నేళ్ల తర్వాత ఓ ఊళ్లో పిచ్చివాడిలా కనిపించారు. ఆ ఫొటోలు వార్తా పత్రికల్లో రావడంతో కుటుంబీకులు తిరిగి వశిష్ఠను ఊరికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బసంతపూర్‌లోని చిన్న ఇల్లే ఆయన ఆశ్రయం. బిహార్‌ ప్రభుత్వం అందించే అతికొద్ది సాయంతో వశిష్ఠ బతుకీడుస్తున్నారు.

ఎ బ్యూటిఫుల్‌ మైండ్


మన వశిష్ఠ నారాయణ సింగ్‌ మాదిరే విశ్వవిఖ్యాత గణితమేధావి జాన్‌ నాష్‌ కూడా స్కిజోఫ్రెనియాతో బాధపడేవారు. అయితే కుటుంబం, స్నేహితులు అందించిన సహకారంతో వ్యాధి నుంచి చాలా వరకు కోలుకోగలిగారు. ఆయన జీవితగాథ ఆధారంగా ‘ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌’ అనే పుస్తకం వచ్చింది. అదే పేరుతో హాలీవుడ్‌లో సినిమా కూడా రూపొందింది.

    LATEST POSTS

    SHANDAAR HYDERABAD

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here