ఆ ఇల్లు.. అద్భుతమైన చిత్రకళ

మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క చిత్రం ద్వారా తెలుపొచ్చు.. నైపుణ్యం, సృజనాత్మకతతో కూడుకున్నది చిత్రకళ.. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారే ప్రతీ చిత్రము ఓ అబ్బురమే.. అలాంటి చిత్రకళలో ఆరితేరిన ఇద్దరు అన్నదమ్ములు ఆ కళ కే ఓ ఇంటిని కేటాయించారు.. తాము గీసిన చిత్రాలను ఆ ఇంటిలో పొందు పరుస్తూ భావితరాలకు చిత్రకళపై అవగాహన కల్పిస్తున్నారు.. వారే నగరంలోని లాలాపేట్ కి చెందిన పాల్ బ్రదర్స్..
చిత్రకళలో అనేక రకాలుంటాయి..వాటిలో కాన్సెప్షనల్ ఆర్ట్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఈ ఆర్ట్ ని గీసే వారిని కాంటెంపరరీ ఆర్టిస్ట్ లంటారు.. మామూలు చిత్రాలతో పోలిస్తే ఈ కాన్సెప్షనల్ ఆర్ట్ తో గీసిన చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.. జీవం ఉట్టిపడేలా, వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే ఈ తరహా చిత్రాలను గీయడం లో పాల్ బ్రదర్స్ సిద్ధహస్తులు..వీరు గీసిన చిత్రాల కోసం ఒక ఇంటిని కొనుగోలు చేసి దానికి ఆర్ట్ మిల్ అని నామకరణం కూడా చేశారు..

గ్లోవర్ స్టారియర్ పాల్, లెస్టర్ ఆంథోని పాల్ కి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఇష్టం.. దీంతో ఫైన్ ఆర్ట్స్ లో ఇద్దరు మాస్టర్స్ పూర్తిచేశారు.. గ్లోవర్ పాల్ తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్ లెక్చరర్ గా చేస్తుండగా, ఆంథోని పాల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ గా చేస్తుండేవారు.. ఈ పాల్ బ్రదర్స్ దేశవ్యాప్తంగా తాము గీసిన చిత్రాలతో ప్రదర్శనలు కూడా చేశారు.. అయితే తమకంటూ ఓ ఆర్ట్ స్టూడియోని ఏర్పాటుచేసుకోవాలనే ఆలోచనతో లాలాపేట్ లోని ఓ పాత ఇంటిని కొనుగోలు చేశారు.. ఆ ఇంటిని పూర్తిగా రీమోడలింగ్ చేసి తమకు నచ్చినట్టుగా మార్చుకున్నారు.. అలా చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉండే పిల్లలు, జనాలు వచ్చి ఆసక్తిగా ఆ ఇంటిని గమనించడం చూశారు..దీంతో పాల్ బ్రదర్స్ కి ఓ ఆలోచన తట్టింది.. నగరంలో ఆర్ట్ స్టూడియోలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకే పరిమితం అయ్యాయని, బస్తీవాసులకు కూడా పరిచయం చేస్తే బాగుంటుదని అనుకున్నారు.. అలాగే తమ ఇంటిని ఏర్పాటుచేశారు..మామూలుగా కాంటెంపరరీ ఆర్టిస్ట్ లు తమ స్టూడియోకి చూడటానికి ఇతరులను అనుమతించరు.. అయితే పాల్ బ్రదర్స్ ఏర్పాటుచేసిన ఈ ఆర్ట్ మిల్ ని మాత్రం ప్రతి ఒక్కరు వెళ్లి చూడొచ్చు.. సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు.

అందమైన లోకం ఆర్ట్ మిల్:

ఆర్ట్ మిల్ లోపలికి ప్రవేశించగానే ఒక కొత్త లోకం వెళ్లామా అనే అనుభూతిని కలిగిస్తుంది.. లోపల గోడలపై వేలాడే చిత్రాలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి.. ప్రతి చిత్రం సందేశాత్మకంగా ఉండటంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉంటుంది… ఒక గర్భిణి కడుపులో బిడ్డ తిరుగుతున్న దృశ్యం చూస్తున్నంత సేపు చూడాలనే అనిపిస్తుంటుంది.. చిత్రాన్ని గీసేటప్పుడే మధ్యలో ఒక వీడియోని అమరుస్తారు.. ఆంథోని పాల్ కి ఈ ఆలోచన తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తట్టిందట.. దీంతో ఆమె చిత్రాన్నే గీసి పొందుపరిచాడు.. దీంతో పాటు ఒకపాప రైల్ లో నుంచి బయటకు చూసే దృశ్యం, స్టేషన్ లో ఉన్న వారు వీడ్కోలు పలికే దృశ్యం గీసి వాటికి ట్రైన్ వీడియో ను జతపరిచారు.. నిజంగా అక్కడ ట్రైన్ వెలుతుందా అనే అనుభూతిని కలిగిస్తుంటుంది ఆ చిత్రం.. ఇలా అన్ని చిత్రాలు కళ్లకు కట్టిపడేస్తుంటాయి.. తమ చుట్టూ జరిగే వాటిని అంశాలుగా తీసుకొని దానికి కొత్తదనాన్ని జోడించి ఎంతో వైవిధ్యభరితంగా రూపొందించినా ఈ ఆర్ట్ మిల్ లోకి ఎవరైనా వెళ్లొచ్చు.. ఎంతసేపైనా చూడొచ్చు..

‘మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం.. ఆ ఇష్టంతోనే చిత్రకళను నేర్చుకున్నాం..మేము గీసే చిత్రాలలో కొత్తదనం ఉండాలని కాంటెంపరరీ ఆర్ట్ ని ఎంచుకున్నాం.. మా చిత్రాల కోసం ఓ ఇంటిని నిర్మించాలని అనుకున్నాం.. అందుకే ఆర్ట్ మిల్ ని ఏర్పాటుచేశాం.. ఇక్కడికి ఎవరైనా రావొచ్చు. ఇష్టం ఉన్న వారికి ఆర్ట్ పై అవగాహన కల్పిస్తాం.. అందరికి చిత్రకళ గురించి తెలియాలనేదే మా ఆశ.. మేము వేసిన చిత్రాలతో ప్రదర్శనలు పెడుతుంటాం.. వాటి ద్వారా వచ్చిన డబ్బును ఈ ఇంటికోసం వినియోగించాం.. మేము పూర్తి సమయాన్ని చిత్రకళకే అంకితం చేస్తున్నాం..’ అని చెపుతున్నారు పాల్ బ్రదర్స్

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here