సమ్మక్కకు జడ్​ ప్లస్​కు మించి సెక్యూరిటీ

మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్టపై ఉన్న అటవీ ప్రాంతంలో కంక వనం నుంచి సమ్మక్క తల్లిని మేడారంలో ఉన్న గద్లెలపైకి తీసుకురావటం.. అత్యద్భుత ఘట్టం. భక్త జన కోటి సమక్షంలో ఆదివాసీల కోలాహలం నడుమ… సమ్మక్కకు ఘనంగా స్వాగతం పలికే ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు ఎగబడుతారు. రోడ్డుకిరువైపులా లక్షల మంది వేయి కళ్లతో సమ్మక్క దర్శన భాగ్యానికి ఎదురు చూస్తారు.

చిలుకల గుట్ట నుంచి ఆదివాసీ పూజారులు అత్యంత రహస్యంగా కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెకు తీసుకు వస్తారు. సమ్మక్కను దోసిట్లో పట్టుకొని తెచ్చే పూజారులను ఒక్కసారి తాకాలని.. తాకితే తమ కష్టాలు తీరిపోతాయని.. వాళ్లకు ఎదురుపడి దండాలు పెడితే… కోరిన మొక్కులు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సమ్మక్క రాక మేడారం మహా జాతరలో అపురూపమైన ఘట్టం. ఈ అద్బుతాన్ని చూసేందుకే కోటి మందికి పైగా భక్తులు ఆ రోజు అక్కడికి తరలి వస్తారు.

డప్పు డోలు వాయిద్యాలతో ఆదివాసీలు సంన్రదాయంగా సమ్మక్కను తీసుకువస్తే.. మేడారం ఆడపడుచులు కొత్త దుస్తులు ధరించి నీళ్ల బిద్దెలు ఎత్తుకొని.. ఊరెగింపుగా ఎదురేగి.. సమ్మక్కను ఘనంగా స్వాగతిస్తారు. సమ్మక్కను తెచ్చే పూజారుల కాళ్లు కడిగి.. ఎదుర్కోలు పండుగ జరుపుతారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు సమ్మక్కను తీసుకొచ్చే ఉత్సవమే మహా జాతరలో అత్యంత అపురూపమైన సన్నివేశం

వీఐపీలు.. వీవీఐపీలు… ప్రధాని,., రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జడ్, జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పేరు వింటుంటాం. పది మందికి మించి ఎన్​ఎస్​జీ కమాండోలు.. దాదాపు 55 మంది వ్యక్తిగత పోలీసు బలగం భద్రతగా ఉంటే.. జడ్​ ప్లస్​ కేటగిరీ సెక్యూరిటీ. అంతకు మించిన అసాధారణ భద్రత సమ్మక్క రాక సందర్భంగా మనకు కనిపిస్తుంది.

స్పెషల్​ కమాండో టీమ్​తో పాటు దాదాపు 200 మందికి పైగా భద్రతా బలగం నడుమ సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయల్దేరుతుంది. ​చుట్టూరా స్పెషల్​ టీమ్​తో పాటు రోప్​ పార్టీ సమ్మక్క గద్దెకు చేరేంత వరకు భారీ బందోబస్తు ఉంటుంది.

రెడ్​ కార్పెట్​ వెల్​కమ్​ కు మించి.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సమ్మక్క స్వాగతం పలుకుతుంది. స్వయంగా డీఐజీలు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్​తో ఉన్నతాధికారులు సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. చిలుకల గుట్ట పై నుంచి సమ్మక్క కిందికి దిగిన వెంటనే.. స్వాగత సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు.

స్వయంగా జిల్లా ఎస్పీలకు ఈ అరుదైన అవకాశం దక్కుతుంది. గతంలో ఈ జిల్లాలో పని చేసిన ఎస్పీలందరూ అదో అద్భుతమైన సన్నివేశం.. ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క దైవాన్ని స్వాగతించటం.. తమకు లైఫ్​ టైమ్​ ఎక్సిపీరియన్స్​ అని చెప్పుకుంటారు.

ఇద్దరు డిఐజి లు, ఆరుగురు ఎస్పి లు, దాదాపు పన్నెండు వేల మంది పోలీసు సిబ్బందితో ఈ మహా జాతరకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరుగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడుతారు. మూడు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో జాతర పరిసరాలన్నీ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 350 సర్వేలెన్స్ కెమెరాలు, 20 జూమ్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here