కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసుపై పోలీసుల దాడి
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఆఫీసులో కంప్యూటర్లు, లాప్ టాప్‌లు సీజ్ చేశారు. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఫిర్యాదులతో రైడ్స్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అడుకున్న కాంగ్రెస్ నాయకులు షబీర్ అలీ మల్లు రవి,అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్
సీఎం కేసీఆర్ ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్ నంబర్ 5లో ఈ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఇక్కడే సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి యాగం నిర్వహించి ఆఫీసు ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు, పార్టీ ముఖ్య నేతలందరూ మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ‘కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కా నేత కేసీఆర్.. దేశ్ కిసాన్ కీ భరోసా కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అనే నినాదాలతో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి.
స్టాఫ్‌నర్స్ పోస్టులకు వారంలో నోటిఫికేషన్
ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఒకటీ రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. సుమారు 7 వేల పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో 4,722 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో జపాన్ కంపెనీ పెట్టుబడులు
తెలంగాణలో రెండు జపాన్ కంపెనీలు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. హైదరాబాద్లోని చందనవల్లిలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న దైఫూకు కంపెనీతో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఏంవోయూ కుదిరింది. 450 కోట్ల రూపాయలతో ఈ సంస్థ తమ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు ఎనిమిది వందల మందికి ఉపాధి లభించనుంది. దైఫూకు ( Daifuku) కంపెనీతో పాటు రూ.126 కోట్లతో నికోమాక్ తైకిషా మూడో యూనిట్ ఏర్పాటుకు ఇదే వేదికపై ఒప్పందం కుదిరింది.
షర్మిల యాత్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్:
పాదయాత్రలు చేయాలంటే రాజకీయ పార్టీల నేతలు హైకోర్టుకు రావాల్సివస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము ఆదేశించినప్పటికీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. గతంలో విధించిన షరతులకు అనుగుణంగా షర్మిల పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
మోడీకి కేసీఆరే ప్రత్యామ్నాయం:కవిత
ప్రధాని మోడీకి జాతీయ స్థాయిలో కేసీఆరే ప్రత్యామ్నాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పగ్గాలు ఎవరికిస్తారనే దానిపై కొంత సస్పెన్స్ ఉండాలి కదా.. ఇప్పుడే తొందరేముందని వ్యాఖ్యానించారు. మంగళవారం కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందన్నారు. బండి సంజయ్ బతుకమ్మ గురించి అసహ్యంగా మాట్లాడటం బాధగా ఉందన్నారు. తెలంగాణ కు పసుపు బోర్డ్ రాకుండా చేసింది నిర్మలా సీతారామనే అని ఆరోపించారు. తెలంగాణ లో తెలంగాణ జాగృతి వుంటుందని, మిగతా రాష్ట్రాల్లో భారత్ జాగృతి పని చేస్తుందన్నారు. వైఎస్సార్టీపీ, టీడీపీ, బీఎస్పీ పార్టీలన్నీ బీజేపీ విడిచిన బాణాలేనని విమర్శించారు.
కేసీఆర్ మానవత్వంలేని మృగం:
కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించని కేసిఆర్ మానవత్వం లేని మృగమంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. చరిత్రలో అతిపెద్ద బస్సు ప్రమాదంగా నిలిచిన కొండగట్టు దుర్ఘటనలో బాధితులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని, బాధితుల శాపం ఊరికే పోదన్నారు. వారి పాపం తిగిలే కేసీఆర్ డౌన్ఫాల్ స్టర్టయ్యిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టులో బస్సు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్‌లో కోవర్టులు: దామోదర
కాంగ్రెస్‌కు కోవర్టిజం రోగం పట్టుకుందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో ఉంటూ సర్కారు కోసం పని చేస్తున్నారన్నారు. నాలుగైదేళ్లుగా తాను ఈ విషయాన్ని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. పీసీసీ కమిటీ కూర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ధాలుగా పార్టీకి సేవ చేస్తున్న వాళ్లు, కష్టపడి పని చేస్తున్న వాళ్లకు పదవులు దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లితో కేసీఆర్‌కు అవసరం తీరింది
కాంగ్రెస్ హయాంలో ఢిల్లీకి సూట్‌కేసులు వెళ్తే.. కేసీఆర్ హయాంలో కంటైనర్లు వెళ్తున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. అవసరం తీరిపోయింది కాబట్టే తెలంగాణ తల్లిని కేసీఆర్ పక్కన పెట్టారని, బీఆర్ఎస్ అంటూ దేశంపై పడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసింది చాలక దేశ ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని, అహంకారం, అప్పు, అవినీతా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 15న కరీంనగర్‌కు నడ్డా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం (ఈనెల 15)తో ముగియనుంది. ఈ సందర్భంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చీఫ్ గెస్ట్గా హాజరు కానున్న ఈ సభ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై సాయంత్రం ముగియనుంది. నడ్డాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధర్రావులు సభలో పాల్గొంటారు.
యువతిపై ప్రేమికుడి దాడి
ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని కోపం పెంచుకున్న యువకుడు.. ఆ యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని ఇసుకపల్లికి చెందిన సందీప్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మూడేండ్ల కిందటే అదే గ్రామానికి చెందిన వైభవి, సందీప్ ప్రేమించుకున్నారు. కుటుంబీకులు వారించటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వైభవి కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. మరో యువకుడితో వైభవికి పెళ్లి నిశ్చయమైంది. తనను కాదని వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుంటుందన్న కోపంతో వ సొంతూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. వైభవి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఈ దాడికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేసి తానూ గొంతు కోసుకున్నాడు. ముగ్గురూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
నవీన్‌రెడ్డి అరెస్ట్
ప్రియురాలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళవారం గోవాలో అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలించారు. నవీన్‌రెడ్డి వద్ద ఐదు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మన్నెగూడలో దామోదర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి, ఆయన బిడ్డ వైశాలిని కిడ్నాప్ చేసిన తరువాత నవీన్‌రెడ్డి కర్నాటక వెళ్ళాడు.అక్కడి నుంచి హుబ్లి వెళ్ళాడు అక్కడి నుంచి పనాజీ మీదుగా గోవాకు వెళ్ళాడు. అక్కడే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాటేజ్‌లో దిగాడు. కాటేజ్ యజమానికి ఆధార్ కార్డ్ ఇవ్వడంతో పాటు దాడికి జరిగిన వివరాలను వారికి వివరించాడు.వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొబైల్ నంబర్ ట్రేస్ చేసిన రాచకొండ పోలీసులు మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.