ఢిల్లీలో సీఎం కేసీఆర్.. రేపే యాగం

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. కుటుంబ సభ్యలతో కలిసి బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంగళ, బుధవారాల్లో ఆఫీసు ప్రాంగణంలోనే రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 17 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండి, జాతీయ స్థాయిలో కీలక నేతలు, రైతు సంఘాలు, రిటైర్డ్ బ్యూరో క్రాట్లు, ఇతర పార్టీల ముఖ్యులతో మంతనాలు జరుపుతారని తెలిసింది.
దాడులతో వెనక్కి తగ్గను : ఎమ్మెల్సీ కవిత

ఏడేండ్ల తర్వాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేశారు. సీబీఐ విచారణ ముగిసిన మరుసటి రోజే జాగృతి కార్యకర్తలతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని పిలుపునిచ్చారు. ప్రతి రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకెళ్తామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తోందని.. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను..రిలాక్స్ కూడా అయ్యేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయని అన్నారు.
కవితను కాపాడేందుకు సెంటిమెంట్ అస్త్రం

లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కాపాడుకొనేందుకు సీఎం కేసీఆర్ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రం చిచ్చు రేపి మళ్లీ సెంటిమెంట్‌ను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసి కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటూ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో యాగం చేసే ముందు లిక్కర్ స్కామ్ తో తన బిడ్డ కవితకు సంబంధం లేదని ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు.
హిందీపై రేవంత్ వర్సెస్ నిర్మల

లోక్‌సభ క్వశ్చన్ అవర్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మధ్య మాటల ఫైట్ జరిగింది. రూపాయి విలువ పతనంపై రేవంత్ అడిగిన ప్రశ్నకు నిర్మల కామెంట్ చేశారు. ‘రేవంత్ వీక్ హిందీలో ప్రశ్న అడిగారని.. తన హిందీ కూడా వీకే అని.. అలాంటి వీక్ హిందీలోనే ఆన్సర్ ఇస్తా అని’ ఎద్దేవా చేశారు. తన హిందీ గురించి మాట్లాడటంపై రేవంత్ ఎదురుదాడి చేశారు. తాను శూద్రుడినని, తనకు స్వచ్చమైన హిందీ రాదని.. బ్రాహణవాదులకు హిందీ బాగా వస్తుందేమోనని రేవంత్ వ్యాఖ్యానించారు. స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో కుల, మతాల ప్రస్తావన తేవద్దని అన్నారు.
డిశ్చార్జయిన షర్మిల
వైఎస్ ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అపోల్ హాస్పిటల్ నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకోవటానికి 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని షర్మిలను డాక్టర్లు కోరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజా ప్రస్ధాన పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు షర్మిల అంబేద్కర్ విగ్రహం దగ్గర, లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్షను భగ్నం చేసి అపోలో హాస్పిటల్ కు పోలీసులు తరలించారు.
తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు. చిరు చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ సోదాలు:

మైత్రీ మూవీ మేకర్స్‌పై సోమవారం ఇన్‌కమ్‌టాక్స్, జీఎస్టీ అధికారులు రెయిడ్స్ చేశారు. హైదరాబాద్,ఏపీలో మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఇటీవల తెలుగులో హిట్టయిన పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట, రంగస్థలం, జనతా గ్యారేజ్ సినిమాలు తీసింది ఈ సంస్థనే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనికి సంబంధించిన పెట్టుబడులపైనే ఐటీ ఆరా తీస్తోంది. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రిజర్వేషన్లకు బ్రేక్:
నాలుగేండ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం పంపిన గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తరువాత దీనిపై ముందుకు వెళ్లగలమని పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో జారీ చేసింది.
హైదరాబాద్‌లో టై గ్లోబల్ సమ్మిట్:

తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ రాకెట్ స్పేస్‌లోకి పంపిన అంకురం స్కై రూట్ టీ హబ్‌కి చెందినదే అని చెప్పారు. హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయెన్, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్‌లతోపాటు 2,500 మంది డెలిగేట్స్, 550కి పైగా టై చార్టర్ సభ్యులు హాజరయ్యారు. 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై చర్చించనున్నారు.
హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్
డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. ఇంతకాలం ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి స్మగ్లింగ్ అయ్యే డ్రగ్స్ ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అవుతోంది. మల్కాజ్ గిరిలో డ్రగ్స్ సెంటర్ ఏర్పాటు చేసిన గ్యాంగ్‌ను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.రూ.9 కోట్లు విలువ చేసే 8.5 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్,రూ. 4.02లక్షలు క్యాష్,23 రామ్‌రాజ్ కవర్ బాక్సెస్,5 పాస్‌పోర్టులు,3ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం వెల్లడించారు.
అప్పులకు కిడ్నీ బేరం.. చివరికి ఏమైంది

అప్పుల నుంచి బయటపడేందుకు కిడ్నీ అమ్ముకోబోయిన గుంటూరుకు చెందిన యువతి సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడి మరింత అప్పల పాలయింది. కిడ్నీ డొనేషన్ అనే యాప్‌లో రూ.6 కోట్లకు కిడ్నీ కొంటాం అని యాడ్ చూసి, తన కిడ్నీ ఇస్తానని బేరం కుదుర్చుకుంది. కిడ్నీ ఇవ్వడానికి ముందే రూ.3 కోట్ల అడ్వాన్స్ ఇస్తామని చెప్పి, ఆ డబ్బు రావడానికి రూ.16 లక్షల ట్యాక్స్ కట్టమన్నారు. ఎలాగోలా ఆ డబ్బు కట్టిన యువతికి, మరో రూ.లక్షన్నర కట్టమని మెసేజ్ వచ్చింది. అప్పటికే విసిగిపోయిన ఆమె, తాను కిడ్నీ ఇవ్వనని, డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో ఢిల్లీ వస్తే.. ఇస్తామని ఓ అడ్రస్ ఇచ్చారు. ఆమె అక్కడి వెళ్లి చూడగా.. అదో రాంగ్ అడ్రస్ అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించి.. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది. తండ్రితో కలిసి వచ్చి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది.
ఇక ఫోన్‌లోనే టీవీ చూడొచ్చు:
సెల్‌ఫోన్‌లో యాప్‌ల ద్వారా వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసే విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని దేశ రాజధాని ప్రాంతం అమలుచేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర వెల్లడించారు. టీవీ చూడడానికి ఇంటర్నెట్ కూడా అవసరం ఉండదు. ఇది దాదాపు ఎఫ్‌ఎం రేడియోలాగే పనిచేస్తుంది. అందులో రేడియో ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు ఒక రిసీవర్ ఉంటుంది. బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీలను కలిపి సెల్‌ఫోన్లలో డిజిటల్ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారు. తద్వారా మల్టీమీడియా కంటెంట్ స్మార్ట్‌ఫోన్లకు నేరుగా వస్తుంది.
ముంచుకొస్తున్న మరో తుఫాను
ఏపీ, తెలంగాణాపై మాండస్ ఎఫెక్ట్ కొనసాగుతుండగానే మరో తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్ప పీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది. మాండస్ ప్రభావంతో రెండు రోజులుగా తమిళనాడు, ఏపీ, తెలంగాణాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తిరుపతి జిల్లా కెవిబిపురం మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. చెన్నైలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పటివరకు తుఫాను కారణంగా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.