ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్… రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త ఎంట్రీ ఇచ్చిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ప్రవీణ్ బహుజన సమాజ్ పార్టీ లో చేరారు. ప్రస్తుతం బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున ఇప్పటికే రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. పేదలకు పీడితులకు అండగా ఉంటానని, భావి తరాలను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానంటూ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్.. దళితులు, బహుజనుల ఎజెండాతోనే వాడిగా వేడిగా ప్రసంగాలు చేస్తున్నారు. తను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు పూర్వ విద్యార్థులు.. తన అభిమానులు, మద్దతుదారులతో కలిసి ఏర్పాటు చేసుకున్న స్వేరోస్ కార్యక్రమాలు, సభలతో పొలిటికల్ ప్రచారం పెంచేశారు.
టీఆర్ఎస్ ను గద్దె దించి బహుజన రాజ్య స్థాపన తన ఎజెండాగా అడుగులేస్తున్నారు. ఏనుగు మీద ఎక్కి.. ప్రగతిభవన్ కు పోదాం రమ్మంటూ అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతకీ వచ్చే ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు…? అనేది ఆసక్తి రేపుతోంది.
ప్రవీణ్కుమార్ సొంత నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్. ప్రస్తుతం ఇది గద్వాల జోగులాంబ జిల్లాలో ఉంది. ఆలంపూర్ ప్రవీణ్ స్వగ్రామం. అక్కడే ఆయనకు సొంత ఇల్లు ఉంది. ఆలంపూర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.
అందుకే ప్రవీణ్ కుమార్ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదటి ఎన్నికల పరీక్షను తన సొంత గడ్డ నుంచే ఎదుర్కోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
ఒకవేళ ఆలంపూర్ లో పోటీ చేసే ఆలోచన విరమించుకుంటే … ఉమ్మడి నల్లొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలున్నాయి. తుంగతుర్తి కూడా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. పూర్తిగా గ్రామీణ ప్రాంతమున్న మారుమూల నియోజకవర్గం. అందుకే ప్రవీణ్ ఇక్కడ కూడా ఓ కన్నేసి పెట్టారు.
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే తుంగతుర్తిలో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడే త్వరలో పార్టీ ఆఫీసు పెట్టే పనిలో ఉన్నారు. ఆలంపూర్ లేదా తుంగతుర్తి నుంచి ప్రవీణ్ పోటీ చేయటం గ్యారంటీ అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మిగతా రాజకీయ పార్టీలు సైతం ఆ రెండు సీట్లపై ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.
పోటీ సంగతి ఎలా ఉన్నా… కాన్షీరాం.. మాయవతి.. బాటలో నీలిరంగు జెండా ఎత్తుకున్న ప్రవీణ్కుమార్ త్వరలోనే రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.