తెలంగాణలో బీజేపీ తన స్టాండ్ మార్చుకుంది. హుజురాబాద్లో గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతికి పవర్ అప్పగించే కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున బ్రాండ్ అంబాసిడర్గా పని చేయాలని ఆ పార్టీ డిల్లీ పెద్దలు ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇప్పటి నుంచే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించింది. తనకున్న ఇమేజీతో అన్ని ప్రాంతాల ప్రజలతో ఇంటరాక్ట్ కావాలని, పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహం నింపాలని ఆదేశించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై పోటీకి సిద్ధంగా ఉండాలని బీజేపీ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈటల కు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఈటల వెంటనే రంగంలోకి దిగారు. వరుసగా జిల్లా టూర్లు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే గత వారం నుంచే నల్లొండ, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అన్ని చోట్ల పార్టీ కేడర్ తో పాటు ప్రజలు ఈటలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈటల ఇమేజీ బీజేపీకి కలిసొస్తుందని.. ఢిల్లీ పెద్దలు వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు ఈటల రాజేదర్. తెలంగాణ ఉద్యమం నుంచి ఈటల కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ కేబినేట్లో సివిల్ సప్లయిస్ తో పాటు ఫైనాన్స్, హెల్త్ మినిస్టర్‌గా పని చేసిన అనుభవముంది.
హుజురాబాద్ బై ఎలక్షన్‌తో ఈటల పేరు రాష్ట్రమంతటా మార్మోగింది. కేసీఆర్ ను ఎదుర్కునే సత్తా ఒక్క ఈటలకే ఉందని.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అందుకే బీజేపీ ఫ్యూచర్ ప్లాన్‌తో ఈటలను రంగంలోకి దింపింది.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటోంది. ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ కార్యక్రమాల్లో జోష్ పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవటం, జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు గెలువటంతో కాషాయ జెండా రెపరెపలాడింది. తర్వాత వచ్చిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓడినప్పటికీ హుజురాబాద్ గెలుపు బీజేపీకి కొండంత దీమానిచ్చింది.
ఇకపై సంజయ్‌ను పూర్తిగా పార్టీ బాధ్యతలకు పరిమితం చేసి.. ఈటలకు కొన్ని ఇండిపెండెంట్ పవర్స్ ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.