తెలంగాణలో నాలుగు కొత్త పార్టీలు

తెలంగాణలో నాలుగు కొత్త రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇచ్చాయి. తమ తమ జెండాలు.. కొత్త ఎజెండాలతో రంగంలోకి దిగాయి. వచ్చే 2023 ఎన్నికలను ఇప్పటి నుంచే టార్గెట్ చేశాయి. వరుసగా పాదయాత్రలు.. నియోజకవర్గ పర్యటనలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

కొత్త పార్టీలన్నీ తమ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. వైఎస్సార్టీపీ, బీఎస్పీ ఇప్పటికే తమ పని మొదలు పెట్టాయి. ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నాయి. వీటితో పాటు మరో మూడు కొత్త పార్టీలు ఏర్పాట్లు మొదలుపెట్టాయి.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల. ఏపీలో ఆమె సోదరుడు జగన్ సీఎంగా ఉన్నారు. అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ లో తనకు చోటు దక్కకపోవటంతో షర్మిల తెలంగాణ సెంట్రిక్ గా కొత్త పార్టీ పెట్టారు. తండ్రి బాటలోనే రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ఇటీవలే పాదయాత్ర మొదలు పెట్టారు.

నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ నియామకాల ఫైల్ పైన తొలి సంతకం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకే ఇస్తామని పొలిటికల్ రూట్ మ్యాప్ ప్రకటించారు.

మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ. బీఎస్పీ ఈసారి తెలంగాణలో కొత్త ఎంట్రీ ఇచ్చింది. మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ సర్వీస్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని… బీఎస్పీలో చేరారు. ఏనుగునెక్కి ప్రగతి భవన్ కు వెళుదాం.. రండి.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దళితులను తన వైపు తిప్పుకోవాలని.. బహుజనుల ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలు పెట్టారు. గురుకులాల కార్యదర్శిగా పని చేసిన టైమ్ లో పూర్వ విద్యార్థులు.. తన అభిమానులతో ఏర్పాటు చేసిన స్వేరోస్ టీమ్ ఆయనకు అండగా ఉంది.

కేంద్ర మాజీమంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ ఈ డిసెంబర్‌లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో వినయ్ కుమార్ తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఈ పార్టీ పెడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ కుమార్.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కొత్త పార్టీని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాన్షీరాం బాటలో రాష్ట్రంలో మరో పార్టీకి రూపకల్పన జరుగుతోంది. రాజ్యాధికారం సాధించినప్పుడే దళితుల్లో మార్పు వస్తుందని నినాదంతో దళిత శక్తి ప్రోగ్రాం.. డీఎస్పీ కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతోంది. డీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ .. ఇప్పటికే పల్లె పల్లెనా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రచారంలో ఉన్నారు. వచ్చే జనవరి నుంచి కల్వకుర్తి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్ర మంతటా 10 వేల కిలోమీటర్లు పర్యటిస్తామని ఇప్పటికే ప్రకటించారు. యాత్ర ముగింపు సభలో కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

2023 ఎన్నికల్లో ఈ కొత్త పార్టీలన్నీ తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి. ప్రదాన పార్టీల ఓట్లను.. సీట్లను చీల్చే అవకాశాలున్నాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here