ఆరో నెంబర్.. సీఎం కేసీఆర్‌కు లక్కీ నంబర్. ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకూ అన్నిట్లో ఆయనకు కలిసొచ్చిన నెంబర్ ఆరు. వాస్తు.. గుళ్లు.. గోపురాలు.. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముకునే కేసీఆర్ అదృష్టమంతా ఆరు నెంబర్ తోనే ముడిపడి ఉంది.
‘6’ నెంబర్ తో కేసీఆర్కు విడదీయరాని అనుబంధం ఉంది. తను ప్రయాణించే వెహికల్ నెంబర్.. మొబైల్ నెంబర్.. ఇలా ప్రతిదీ 6 నెంబర్ వచ్చేలా ఉంటాయి.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ మొదటిసారి గెలిచాక ఆరో నెలలోనే.. అంటే జూన్ లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయనతో కలిపి మొత్తం ఆరుగురు మంత్రులే ప్రమాణస్వీకారం చేశారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు… డిసెంబర్ 6వ తేదీనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ జీవితంలో.. అడుగడుగునా ఆరు సెంటిమెంట్ కనిపిస్తుంది.
మరి… కేసీఆర్ కు అచ్చి రాని నెంబర్ కూడా ఉంది. అదేమిటంటే.. తొమ్మిది. ఈ నెంబర్ వింటేనే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు భయపడుతున్నారు. కొంతకాలంగా కేసీఆర్ కు ఈ నెంబర్ అస్సలు కలిసి రావటం లేదు.
గతేడాది నవంబర్‌లో.. అంటే తొమ్మిదో నెలలోనే కేసీఆర్ కు మొదటి షాక్ తగిలింది. రాష్ట్రంలో తనకు తిరుగులేదని అనుకుంటున్న టైమ్ లో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ ఏడాది నవంబర్లోనూ సేమ్ సీన్ రిపీటైంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ నెలలోనే కేసీఆర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. హుజురాబాద్లో ఈటల ను ఓడించే ప్లాన్ ఫెయిలైంది. ఈటల చేతిలో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది.
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లో 10 లక్షల మందితో నిర్వహించాలనుకున్న విజయ గర్జన సభ ఆగిపోయింది. నవంబర్ 15న జరగాల్సిన ఈ సభ హుజురాబాద్ రిజల్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలతో దాదాపు రద్దయింది.
వడ్ల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం హోదాలో కేసీఆర్ ఇందిరా పార్కుకు వచ్చి ధర్నా చేసిందీ ఈ నెలలోనే… కేంద్రాన్ని నిలదీస్తామని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ప్రధాని అపాయింట్మెంట్ దొరక్క ఉత్త చేతులతో తిరిగి వచ్చింది ఈ నెలలోనే..
అందుకే తొమ్మిదో నెల మొత్తం అరిష్టంగానే ఉందని.. 9 నెంబర్ కేసీఆర్కు అచ్చి రాలేదని టీఆర్ఎస్ లీడర్లు భయపడుతున్నారు. ఈ నెల గడిస్తే.. తమ గండాలు గట్టెక్కుతాయని.. దేవుడి మీద భారం వేశారు.