అసలు ఉప ఎన్నిక జరిగే ఛాన్స్ ఉందా.. లేదా.. !
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై అనర్హత వేటు పడితే ఏం జరగబోతుంది..
ఆయన పౌరసత్వంపై హైకోర్టులో ఉన్న కేసులో తీర్పు ఎలా ఉండబోతుంది..? అనేది ఇప్పుడు రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది.
ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నిక గెలిచిన బీజేపీ.. తమ నెక్ట్స్ టార్గెట్ వేములవాడ అని ప్రకటించింది. మరోవైపు టీఆర్ఎస్ కూడా అక్కడ ఉప ఎన్నిక వస్తే… ఎవరిని పోటీకి దింపాలని ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటోంది.
అందుకే వేములవాడ ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్ గా మారింది.
వరుసగా ఇక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు జర్మనీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. గత ఎన్నికల టైమ్ లో జర్మనీ పౌరసత్వంపైనే… చెన్నమనేని పోటీ చెల్లదని కాంగ్రెస్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్.. హైకోర్టును ఆశ్రయించారు.
చెన్నమనేని జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో అఫిడవిట్ వేసింది. గతంలోనే రమేష్‌పై అనర్హతా వేటు వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే చెన్నమనేని అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో మళ్లీ కేసు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా.. ఉప ఎన్నికకు సిద్ధం కండి.. అంటూ హైకోర్టు ఇటీవల కామెంట్ చేయటం ఆసక్తి రేపింది.
హైకోర్టు రమేష్ బాబు పై అనర్హత వేటు వేస్తే.. వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు.. అనర్హత వేటు వేసినా ఎన్నిక జరిగే ప్రసక్తి లేదనే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
రమేష్ బాబును అనర్హుడిగా ప్రకటిస్తే… గత ఎన్నికల్లో రమేష్ బాబు తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఆది శ్రీనివాస్ ను నేరుగా ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటిస్తారనే అభిప్రాయాలున్నాయి.
2018 ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇలాంటి కేసే నమోదైంది.
అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి ఈరన్న తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చాడనే కేసులో.. ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. తర్వాత స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని తీర్పు చెప్పింది.
మడకశిర తీర్పును బట్టి.. వేములవాడలో కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్న తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని ఆది శ్రీనివాస్ ధీమాతో ఉన్నారు.