కరీంనగర్ రాజకీయాలు మళ్లీ కీలక మలుపులు తిరుగుతున్నాయి. 2023 ఎన్నికలకు ఇక్కడి లీడర్లు అడ్వాన్సుగానే బెర్త్‌లు ఖరారు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి చెల్మడ ఆనందరావు కుమారుడు.. కాంగ్రెస్ నాయకుడు చెల్మెడ లక్ష్మి నరసింహరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ వారం పది రోజుల్లో ఆయన చేరికకు ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే చెల్మెడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్ వెళ్లినప్పుడు కేటీఆర్ చెల్మెడ గెస్ట్ హౌస్‌లోనే ఉన్నారని.. అక్కడే పార్టీలో ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
చెల్మెడ లక్ష్మి నరసింహరావు గతంలో రెండు సార్లు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటుకు పోటీ చేశారు. ఒకసారి ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేశారు. మూడు సార్లు ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో 2018 ఎన్నికల నుంచి చెల్మెడ సైలెటంయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.
ఇటీవల కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా తిరుగుబాటు చేశారు. దీంతో ఇక్కడ పోటీని టీఆర్ఎస్ ఛాలెంజ్ గా తీసుకుంది. అక్కడ పార్టీకి ఢోకా లేదని సంకేతమిచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే చెల్మెడ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరీంనగర్లో ఏళ్లకేళ్లుగా రాజకీయంగా వెలమ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. తమ సామాజిక వర్గం బలంగా ఉండటంతో పాటు.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో చేరితేనే తనకు రాజకీయ భవితవ్యం ఉంటుందని చెల్మెడ పార్టీ మారేందుకు సిద్ధపడ్డట్లు చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా.. లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా చెల్మెడను పోటీలో దింపాలనేది టీఆర్ఎస్ ఫ్యూచర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఒక వేళ వేములవాడకు ఉప ఎన్నిక వచ్చినా.. చెల్మెడను అక్కడ పోటీకి దింపాలనే ఆలోచనకు ముందస్తుగానే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.