ట్విటర్లో 3.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తెలంగాణ యంగ్ లీడర్ కేటీఆర్. అటు పరిపాలనతో పాటు.. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్న కేటీఆర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా స్పందిస్తారు. ట్విట్లు.. రీ ట్విట్లతో అటు ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టించటంతో పాటు..ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు. ట్వీట్ కేటీఆర్ అంటూ.. ఆపద వస్తే సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఆయన చేసే ట్విట్లు.. కామెంట్లన్నీ అందరినీ ఆలోచింపచేస్తాయి. ఇటీవల ట్విటర్లో ఒక పోస్టు.. ఆయన హృదయాన్ని కదిలించింది. ఆయనే స్వయంగా ఆ ట్వీట్‌ను రీ ట్విట్ చేశారు. బీహార్‌కు చెందిన ఒక అమ్మాయి రియల్ స్టోరీ ఇది. ఆమె పేరు ప్రాచీ ఠాకూర్. ఏమిటా యంగ్ అచీవర్ స్టోరీ.. ఆమె మాటల్లోనే..
చిన్నప్పుడు నాన్న గురించి చెప్పుకోవాలంటేనే.. నాకు నామోషీ. మా ఊళ్లో రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం. గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు రిపేర్ చేసేటోడు. బీహార్‌లో చిన్న టౌన్ సుపాల్. మాది చిన్న పూరిల్లు. మట్టి గోడలు. రొట్టెలు, ఉల్లిగడ్డలు.. అచార్ తినోటోళ్లం. అదే మా ఫుడ్.
అమ్మ బట్టలు కుట్టేది. అదే మా కుటుంబానికి ఆధారం. మా భయ్యా (అన్న ) పాత డ్రెస్సులు వేసుకొని బడికి వెళ్లేదాణ్ని. అందరూ కొత్త బుక్స్ కొనుక్కుంటే..నేను పాత పుస్తకాలు.. చిరిగిన బుక్స్ లో రాసుకునే దాన్ని.
పదో తరగతి చదివేటప్పుడు మా టీచర్.. ‘మై ఫ్యామిలీ’పై వ్యాసం రాయమని అడిగారు.
‘బావ్జీ ఒక బిజినెస్ మ్యాన్. అమ్మ టైలర్.’ అని రాశాను. అమ్మానాన్నల గురించి అంతకు మించి చెప్పుకోవటం నాలో నాకు చిన్నతనంగా అనిపించింది. క్లాస్మేట్ల మధ్య ఓ రోజు చిన్న గొడవ జరిగింది.మాటా మాటా పెరిగింది. ఒక అబ్బాయి, ‘తేరే బాప్ కీ పాన్ కీ దుకాన్ హై, ఎక్కువ ఎగిరి పడకు..’ అన్నాడు. ఏడుపొచ్చింది. ఏడుస్తూ ఇంటికెళ్లిపోయాను. ఏడుపు ఆగలేదు. ‘నువ్వు ఏదైనా ఆఫీసులో పనిచేయవచ్చు కదా..? బాగా డబ్బులొచ్చేవి.. ’ అని రాత్రి నాన్నను అడిగాను.
నాన్న నన్ను దగ్గరకు తీసుకున్నాడు. కన్నీళ్లను తుడిచాడు. ‘ జీవితమంటే డబ్బు ఒక్కటే కాదు బేటా..’ అని ఓదార్చాడు. నాన్న మాటల విలువ అప్పుడు నాకు అర్థం కాలేదు.
ఎలాగైనా చదువుకోవాలనే పట్టుదల ఒక్కటే ఉండేది. మా ఊళ్లో పదో తరగతి పూర్తవగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేటోళ్లు. ఊళ్లో వాళ్లందరూ తమ పిల్లల పెండిండ్ల గురించి ఆలోచిస్తుంటే.. నాన్న నన్ను చదివించేటందుకు కష్టపడేటోడు. నేను ఇంకా చదువుకోవాలి.. అంటే సమాజం అర్థం చేసుకోలేకపోయింది. మా బంధువులు కూడా ప్రతిసారీ వద్దనేటోళ్లు. పుల్లలు పెట్టేటోళ్లు. కానీ.. నాన్న ఒక్కడే నా వైపు ఉండేవాడు. అన్నింటికీ వెనుకొసుకెచ్చేది నాన్ననే. నా కోసం చుట్టాలతోనే మాట్లాడటం మానేశాడు. బాగా చదువుకోవాలని… అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా ఏం లేదు బిడ్డా.. అని నాన్న నిత్యం నా వెన్నుతట్టేది. ఊళ్లో నా తోటి అమ్మాయిలు వంట నేర్చుకునేందుకు వెళితే.. నాన్న మా కోసం వండిపెట్టే వాడు.
అప్పుడు నాకు నాన్న గురించి తెలిసొచ్చింది… ఆయన ఊళ్లో అందరి లాంటి వాడు కాదని అర్థమైంది. నిత్యం ఆయన ఆలోచనలు నా గురించే. నా భవిష్యత్తు గురించే కలలు కనేవాడు. అన్నింటికీ మించి నన్ను కంటికి రెప్పలా చేసుకునేవాడు.
అప్పటి నుంచీ నా ఆలోచన తీరు మారిపోయింది. నాన్న గురించి చెప్పుకోవటం గర్వంగా ఉండేది. పాత యూనిఫాం వేసుకోవటం కూడా సంతోషంగా ఉండేది. పాత చిరిగిన పుస్తకాలు చదవటంలోనూ ఆనందమే ఉండేది.
నాకు పాండిచ్చేరిలో పీజీ సీటు వచ్చింది. అప్పుడు నాన్న దోస్తులు.. బంధువులు వద్దన్నారు. ‘డబ్బులెందుకు వేస్ట్ చేస్తావ్.. బిడ్డకు పెళ్లి చేసి పంపించు…’ అని నాన్నకు ఎన్నోసార్లు చెప్పి చూశారు. కానీ బావ్జీ అవేవీ పట్టించుకోలేదు. నన్ను పీజీకి పంపించాడు.
రెండేండ్లయింది. మా ఊళ్లో నా గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలైంది. నేను ఎవరితోనో లేచి పోయానని.. ప్రెగ్నెంట్ కూడా అయ్యానని.. అందుకే పారిపోయానని.. పుకార్లు పుట్టించారు. అవన్నీ వింటే నాకు కోపం వచ్చేది కాదు.. ఉల్టా నవ్వుకునే దాన్ని.. నేనలా ఉండగలిగానంటే.. కారణం నాన్ననే.
అన్ని సందర్భాల్లోనూ ధైర్యంగా ఉండాలని నేర్పింది ఆయనే. ఇప్పటికీ ఒక సంఘటన చాలా గుర్తుంది. ఫస్ట్ టైమ్.. మా టౌన్లో నేనొక ఈవెంట్‌కు యాంకరింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా భయం వేసింది. నర్వస్ అయ్యాను ‘ నేను యాంకరింగ్ చేయలేను’ అని నాన్నకు చెప్పాను. ఆయన ఒక్కటే మాట చెప్పాడు. అక్కడున్న వాళ్లందరినీ ఆలుగడ్డ సంచీలు.. అనుకో.. అని నన్ను స్టేజీ మీదికి పంపించాడు. అక్కడ వందల మంది ఎదురుగా ఉన్నారనే విషయం మరిచిపోయాను. నాన్న మాటలే గుర్తొచ్చాయి. ఎదురుగా అన్నీ ఆలుగడ్డ సంచీలే ఉన్నాయని అనుకొని.. అలవోకగా యాంకరింగ్ చింపేశాను. ‘అక్కడున్న వారందరినీ నవ్వించాను. .. అప్పట్నుంచీ వెనుదిరిగి చూడలేదు.. యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్లు.. అన్నింటిలోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను.
ఇప్పుడు TEDx ప్లాట్ ఫారమ్‌పై మాట్లాడేటప్పుడు కూడా… నాన్న చెప్పిన ‘ఆలుగడ్డల సంచి..’ ఎంతో పని చేసింది. కానీ.. ఈ వేదికపైకి నాన్న రాలేకపోయారు. నన్ను టీవీలో చూసుకోవాలని ఇంట్లో ఒక టీవీ కొనుకున్నారు. ఇటీవలే నా PhD పూర్తయింది. బయో డైవర్సిటీ ట్రైనర్ & రీసెర్చర్‌గా పని చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా బావ్జీని కలిసినట్లయితే?.. అతను నా గురించి గర్వంగా చెప్పుకుంటాడు.
ప్రతిసారీ నేను ఇంటికి వెళ్లినప్పుడు.. నాన్నకో కొత్త షర్ట్ తీసుకెళుతా. ఇటీవల ఒక వాచ్ గిఫ్ట్ గా తీసుకెళ్లిన. ‘బేటా, నా కోసం డబ్బు వృధా చేసుకోకు!’ అని బావ్జీ నన్ను హత్తుకున్నాడు. ఎక్కడో గుండెకు తాకింది. నాన్న ఇప్పుడు.. అప్పుడు.. నాన్నలాగే ఉన్నాడు. పాన్‌వాలా కూతురినని చెప్పుకునేందుకు ఒకప్పుడు సిగ్గుపడ్డ నేను.. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకున్నానని.. ఆయనకు ఇంకెలా చెప్పుకోగలను..
SOURCE: STORY AS IT IS FROM PRACHI THAKUR LINKEDIN