కసిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఈ పేరు. కాంగ్రెస్ ను వీడి.. కాషాయ కండువాతో మునుగోడు గడ్డ నుంచి సీఎం కేసీఆర్ పై తొడగొట్టడంతో రాష్ట్రం చూపంతా ఈ బలమైన నేతపై పడింది. అయితే.. హోరాహోరీగా సాగిన ఉప పోరులో ఓటమి పాలవడంతో ఇప్పుడు ఈయన ఫ్యూచర్ ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలన్న కసితో ఈ కోమటిరెడ్డి బ్రదర్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కౌంటింగ్ తెల్లారి నుంచే నియోజకవర్గంలోనే ఆయన మకాం వేశారు. తన కోసం పని చేసిన వారిని పలకరిస్తూ.. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శిస్తూ బిజీగా ఉంటున్నారు. కింది స్థాయి నేతలతో ఆయనకు చనువు తక్కువన్న ప్రచారానికి చెక్ పెట్టడానికి కార్యకర్తల నివాసాలకు వెళ్లి మరీ కలిసి వస్తున్నారు. మునుగోడు మొత్తాన్ని చుట్టేసిన తర్వాత ఆయనేం చేస్తారు.. ఆయన పొలిటికల్​ ఫ్యూచర్​ ప్లాన్​ ఏమిటనేది ఆసక్తి రేపుతోంది.

మునుగోడులో ఓటమి చెందినప్పటికీ.. పెరిగిన ఓటు బ్యాంకును. రాష్ట్రవ్యాప్తంగా తనకు వచ్చిన  ఇమేజీని నిలబెట్టుకోవాలని కోమటిరెడ్డి ఆశిస్తున్నారు. కొన్ని చోట్ల తొందరపాటుతో ఈసారి గెలుపు చేజారిందని.. పక్కాగా ప్లాన్​ చేసుకొని  తనను తాను నిరూపించుకోవాలని డిసైడయ్యారు.  అందుకు తగ్గట్లుగానే ప్యూచర్​ ప్లాన్​ చేసుకుంటున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఈసారి  ఎమ్మెల్యే  పదవికి  బదులు ఎంపీ సీటుకు పోటీ చేస్తారని అంటున్నారు.  వచ్చే ఏడాది రాష్ట్రంలో టీఆర్​ఎస్​  ప్రభుత్వ పదవీ కాలం ముగియనుంది. 2023 అక్టోబర్​ తర్వాత  అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే  అసెంబ్లీ ఎలక్షన్​కు దూరంగా ఉండాలని.. ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకుండా సైలెంట్​గా ఉండాలనేది  కోమటిరెడ్డి ప్లాన్​. ఆ వెంటనే 2024 మార్చిలో వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగి.. తన సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. నల్గొండ  నుంచి లేదా తన సోదరుడి సిట్టింగ్​ సీటు భువనగిరి నుంచి ఎంపీగా  పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశిస్తే తప్ప ఎమ్మెల్యే పోటీకి దూరంగా ఉండాలని.. తప్పనిసరి పరిస్థితి వస్తే మళ్లీ మునుగోడు లేదా నల్గొండ నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారు.  

ఇందులో భాగంగానే  ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తంపై ఫోకస్ పెట్టాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ స్థానం మినహా అన్ని నియోజకవర్గాలపై ఫోకస్​ పెట్టారు. ముఖ్యంగా సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నది ఆయన ప్లాన్ అని సన్నిహితులు చెబుతున్నారు. తన ఓటమిలో కీలక పాత్ర పోషించిన మంత్రి జగదీష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఆయన పని చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా.. నకిరేకల్ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన చిరుమర్తి లింగయ్య విజయంలో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆ నియోజకవర్గంపై పూర్తి పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారట. తుంగతుర్తి నియోజకర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి ఫాలోయిగ్ ఉంది. గతంలో భువనగిరి ఎంపీగా పని చేసిన సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇక్కడ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో  ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న తన పాత అనుచరులను తన వైపునకు తిప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.  కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న ఓ బలమైన నేతను బీజేపీలోకి తీసుకువచ్చి అభ్యర్థిగా ప్రకటించాలన్నది రాజగోపాల్ రెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు బీజేపీ గెలిచేలా చేసి.. తన సత్తా ఏంటో చాటాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కసిగా పని చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here