తెలంగాణలో బీజేపీ కొత్త ఫార్ములా.. టాప్​ 60 అసెంబ్లీకి..!

మునుగోడు దెబ్బతో బీజేపీ తెలంగాణలో కొత్త మాస్టర్​ ప్లాన్​ వేసింది. ఉప ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న కమలనాధులు అదే వ్యూహ రచనలో మునిగిపోయారు. 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్​ ప్రిపేర్​ చేసుకుంటున్నారు. మునుగోడు ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకున్నాయి. వరుసగా వచ్చిన బై ఎలక్షన్లు అన్నింటిలో దెబ్బ తిన్న కాంగ్రెస్​ థర్డ్ ప్లేస్​లోనే ఉంటుందని… రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఇండికేషన్​ ఇచ్చినట్లయిందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.

ఇప్పుడు పుంజుకున్న ఓటు బ్యాంకును కొనసాగించాలని డిసైడయింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు లేకపోవటం బీజేపీకి పెద్ద మైనస్​ అని.. జాతీయ నాయకత్వం గుర్తించింది. అందుకే బలమైన లీడర్లను పార్టీలోకి ఆహ్వానించే పని పెట్టుకుంది. పనిలో పనిగా రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్య నేతలందరినీ 2023 ఎలక్షన్​ బరిలోకి దింపేలా కొత్త స్కెచ్ అమలు చేయనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​ను దెబ్బ కొట్టాలంటే.. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ వైపునకు తిప్పుకునే ప్రతి అంశాన్ని వదులుకోకుండా పని చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన సమాచారం చేరవేసింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం నుంచి రాష్ట్ర ముఖ్య నేతలకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. బీజేపీలో 30 నుంచి 40 మంది రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్, మంచి ఇమేజ్ ఉన్న లీడర్లు ఉన్నారు. ముందునుంచీ పార్టీలో కీలకంగా పని చేసిన వారితో పాటు.. ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారందరూ ఈ జాబితాలో ఉన్నారు. నలుగురు సిట్టింగ్​ ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్​, లక్ష్మణ్​, ధర్మపురి అరవింద్​, సోయం బాపూరావు, రాజాసింగ్​, రఘునందన్ రావు, వివేక్​ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్​, బాబూ మోహన్​, మురళీధర్​రావు, పొంగులేటి సుధాకర్​రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితర నేతలు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ టాప్​ లీడర్ల జాబితాలో ఇప్పటికే 40 మంది ఉన్నారని.. వీరితో పాటు బీజేపీలో చేరే మరికొందరు లీడర్లతో మొత్తం టాప్​​ 60 జాబితాను రెడీ చేసుకుంటోంది. వీరితో పాటు గతంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసి మంచి ఓట్లు సాధించిన వారిని, వివిధ రంగాల నుంచి వచ్చి.. కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రిపేరవుతున్న లీడర్లను ఎంకరేజ్​ చేస్తోంది. వారితో కొత్త స్కెచ్​ను అమలు చేయాలని యోచిస్తోంది.

టాప్​ జాబితాలో ఉన్న ఈ లీడర్లు అందరితో.. కొత్త స్కెచ్​ అమలు చేసేందుకు బీజేపీ రెడీ అయింది. వీరిలో సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీలు ఉన్నారు. పార్టీలో కీలకంగా పని చేసే లీడర్లున్నారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు, ఎంపీ సీటుకు ప్రిపేరవుతున్న వారు ఉన్నారు. బీజీపీ అగ్రనాయకత్వం మాత్రం ఇలాంటి టాప్ లీడర్లందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. లీడర్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టాప్​ 60 జాబితాలో ఉన్న లీడర్లు అందరినీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రయోగించాలనేది బీజేపీ కొత్త టాస్క్ గా కనబడుతోంది. అందరినీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయిస్తే.. ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల కొరత తీరుతుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న లీడర్లు అందరూ పోటీలో ఉంటే.. ఓటర్లను ఆకట్టుకోవటంతో పాటు పార్టీ ఇమేజీ మరింత పెరుగుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. భవిష్యత్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పాపులర్ లీడర్లు పార్టీలో చేరినా.. వారిని కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఇలా మంచి ఇమేజ్ ఉన్న నేతలందరినీ బరిలోకి దించితే మంచి ఫలితాల ఉంటయని అగ్ర నేతలు అంచనా వేస్తున్నారు. జిల్లాకు ఒకరు ఇద్దరు టాప్ లీడర్లు పోటీలో ఉంటే ఆ జోష్ పక్క నియోజకర్గాల్లో కూడా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ ఫార్ములా సక్సెస్ అయితే కనీసం 30 సీట్లు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అధికారం కూడా దక్కే అవకాశం ఉంటుందని కమలనాధులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. బీజేపీ స్కెచ్ ఫలిస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే ఎన్నికల నాటి దాకా ఆగాల్సిందే!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here