సూపర్ స్టార్ రజినీకాంత్ కు చాలా బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయి. అందులో ముత్తు చిత్రం కూడా ఒకటి. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది. శరత్ బాబు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.
1995 అక్టోబరు 23 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది భారీ వసూళ్ళు రాబట్టింది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది. 1998 లో జపనీస్ భాషలో విడుదలై రజనీకాంత్ కు జపాన్ లో కూడా అభిమానుల్ని సంపాదించిపెట్టింది.
ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రకు తెలుగులో గాయకుడు నాగూర్ బాబు (మనో) డబ్బింగ్ చెప్పాడు. అంతకు ముందు రజనీకాంత్ పాత్రకు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ చిత్రం నుంచి దాదాపు అన్ని రజనీకాంత్ తెలుగు అనువాద చిత్రాలకు నాగూర్ బాబే డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ముత్తు సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం వెనుక ఉన్న కథను మనో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ముత్తు’ సినిమాలో ముసలి రజనీకాంత్ పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగారు. నేనూ సరేనన్నా. కేవలం రెండు సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పా. అది విని రజనీగారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘ఎప్పటి నుంచి పూర్తిగా డబ్బింగ్ చెబుతారు’ అని అడిగారు. ‘సర్‌కు నచ్చిందా’ అన్నాను. ‘ఆయన చాలా సంతోషపడ్డారు. మీ డైలాగ్ డెలివరీలో షార్ప్‌నెస్ ఆయనకు నచ్చింది’ అన్నారు. అలా రెండు పాత్రలకు 10రోజులు డబ్బింగ్ చెప్పా.
అది సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి దాదాపు రజనీ సినిమాలకు నేను డబ్బింగ్ చెబుతూ వచ్చాను. ‘శివాజీ’లో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత రజనీ ఫోన్ చేసి మరీ అభినందించారు’’ అని మనో చెప్పుకొచ్చారు.