సామాజిక సమస్యలపై సినిమాలు చాలా అరుదగా వస్తుంటాయి. అలాంటి వాటిలో ముందు వరసలో ఉంచాల్సిన మూవీ గణేష్. తిరుపతి స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, రంభ, మధుబాల, కోట శ్రీనివాసరావు కీలక పాత్రలు పోషించారు. వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి మెడికల్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ ఇదే. 1998లో రిలీజైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
మంచి ఫాంలో ఉన్న రంభను హీరొయిన్ గా తీసుకోగా చాలా కీలకమైన పాత్ర కోసం మధుబాలను తీసుకున్నారు. శత్రువు సినిమా తర్వాత ఆ స్థాయిలో కోట శ్రినివాసరావు విలనీ పండించిన సినిమా ఇదే. ఫ్లాష్ బ్యాక్ లో గుండెలు పిండేసేలా చిత్రీకరించిన తిరుపతి స్వామి అందులో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వెంకటేష్ నటించిన ప్రేమ సినిమాలో హీరొయిన్ గా చేసిన రేవతి ఇందులో చాలా చిన్న పాత్ర చేయడం గమనార్హం. మణిశర్మ పాటలకు థియేటర్లు మోతమ్రోగాయి.
ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకీ నటన, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకోవడమే కాదు ఆలోచింపజేశాయి కూడా. బెస్ట్ యాక్టర్ గా వెంకటేష్ తో పాటు ఉత్తమ విలన్ గా కోట, బెస్ట్ డైలాగ్స్ గా పరుచూరి సోదరులు, రూపశిల్పి విభాగంలో రాఘవతో పాటు ఉత్తమ తృతీయ చిత్రంగా గణేష్ నంది పురస్కారాల్లో సింహభాగం దక్కించుకుంది. ఈ సినిమా తరువాత నాగార్జునతో ఆజాద్ తో పాటుగా మరో రెండు చిత్రాలు చేసిన దర్శకుడు తిరుపతి స్వామి ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుముశారు.