సినిమా మొదలు నుంచి అయిపోయేవరకు కామోడీనే ప్రధానంగా నడిచే చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి అహా నా పెళ్లంట. జంద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించగా, రజినీ హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించింది. 1987 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కథ చిత్ర కథను ప్రముఖ కథా రచయిత ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా అభివృద్ధి చేశారు.
కోట శ్రీనివాసరావు పోషించిన లక్ష్మీపతి పాత్రకు ముందుగా రావుగోపాలరావు పోషిస్తే బావుంటుందని మేకర్స్ భావించారు. కానీ పాత్రస్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో సూచిస్తే ఆయనను కాదనుకుని అప్పటికి కేవలం రెండే సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావును ఆ పాత్రకు తీసుకున్నారు. లక్ష్మీపతి పాత్రకు అనుగుణంగా కోట శ్రీనివాసరావు జుట్టు చాలావరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి.
అప్పటికే మరికొన్ని సినమాల్లో నటిస్తూండడంతో, ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర చిత్రాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ దీనిలో పాత్ర పోషించారు. ముతకపంచె, బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ పాత్ర ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి వుండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట, కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.
ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఈ సినిమాతోనే బ్రహ్మానందం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నత్తివాడిగా అరగుండు పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు.