సిట్టింగ్‌లకే 2023 టీఆర్ఎస్ టికెట్లు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని.. అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. వచ్చే ఎన్నికలకు పది నెలల సమయమే ఉందని.. పార్దీ నేతలందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలతో టచ్‌లో ఉండాలని సూచించారు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు.
పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయం..
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనకు వీలుగా పద్మాలయా స్టూడియోకు తరలించారు. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ నటీ నటులు భారీ ఎత్తున తరలి వచ్చి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయాన్నే ఆయన దేహాన్ని కుటుంబసభ్యులు ఇంటి నుంచి స్టూడియోకు తరలించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచి.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సూపర్ స్టార్‌ను కడసారి చూసేందుకు పద్మాలయా స్టూటియోకు అభిమానులు పోటెత్తారు. ఏపీ నుంచి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అర్థ రాత్రి నుంచి అదే పరిసరాల్లో ఉన్నారు.
చైనాను మించుతున్న భారత్ జనాభా
నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. గడిచిన 12 ఏండ్లలోనే 100 కోట్ల జనాభా పెరిగింది. 2037 నాటికి ఈ సంఖ్య 900 కోట్లకు చేరుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనా వేసింది. ఈ రిపోర్టు ప్రకారం 2022 లో ఇండియా జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. వచ్చే ఏడాది భారత్ జనాభా చైనా ను మించిపోతుందని.. 2050 నాటికి ఇండియా పాపులేషన్ 166.8 కోట్లకు చేరుకునే అవకాశముంది.
పెద్దపులి దాడి.. రైతు మృతి
తెలంగాణలోని అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడి చేసి రైతును చంపిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. మరో బాలుగు ఈ దాడి నుంచి గాయాలతో బయటపట్టాడు. వాంకిడి మండలం ఖానాపురం శివారులో రైతులు పత్తి ఏరుతుండగా ఈ ఘటన జరిగింది. పులి హఠాత్తుగా వెనుక నుంచి దాడి చేసి పంజా విసరటంతో గిరిజన రైతు సిధాం భీము (69) చనిపోయాడు. భీము అరుపులతో ఇతర రైతులు కేకలు పెట్టడంతో దాదాపు 20 మీటర్ల దూరం లాక్కెళ్లిన పులి పారిపోయింది. అప్పటికే భీము చనిపోయాడు. అతడి వెంట ఉన్న కొడుకుకు గాయాలయ్యాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో పెద్దపులి దాడిలో ఇద్దరు చనిపోయారు.
గ్రూప్-1 ఫైనల్ కీ..5 ప్రశ్నలు తొలగింపు
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మాస్టర్ ‘కీ’ విడుదలైంది. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఫైనల్ ‘కీ’ అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమినరీ ‘కీ’ని అక్టోబరు 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 31నుంచి నవంబరు 4వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత.. అయిదు ప్రశ్నలను తొలగించటంతో పాటు.. మూడు ప్రశ్నలకు రెండు ఆప్షన్లు సరైనవేనని టీఎస్‌పీఎస్‌సీ గుర్తించింది. అందుకు అనుగుణంగా 145 ప్రశ్నలకు 150 మార్కులను సర్దుబాటు చేయనుంది. రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు కేసు తీర్పు రాగానే క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనుంది. (పూర్తి వివరాలకు)
8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి ఆయన వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండం మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నుంచే వీటిలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసులు మొదలవుతాయి.