మాపై దాడులు అందుకే: కవిత
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పశ్నిస్తున్నందుకు తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై వివిధ సంస్థలతో దాడులు చేయించారని, తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తనపై సాగుతున్న దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే, అదానీ సంస్థలపై వచ్చిన ఆరోపణల మీద ఎందుకు దర్యాప్తు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ వాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రముఖ సంస్థ పెట్టుబడులు
తెలంగాణకు మరో దిగ్గజ ఫార్మా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన బీఎంస్ సంస్థ ఔషధాల అభివృద్ధి, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో తమ కార్యకలాపాల నిర్వహణకు వచ్చే మూడేండ్లలో 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.828 కోట్లు) పెట్టుబడి పెట్టనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామావు తెలిపారు. ఫలితంగా 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
దర్యాప్తు సంస్థలు.. వేట కుక్కలు
ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సంచలన వాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు.. వేట కుక్కలని కేటీఆర్ తీవ్ర వాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిచ్చోళ్లన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. 2024 వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. మార్చి 11న బండి సంజయ్ మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఆ లోగా ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.
కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేనల్లుడు జీవన్‌రెడ్డి (51) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. సైదాబాద్‌లోని వినయ్‌నగర్ కాలనీలో ఉంటున్న జీవన్‌రెడ్డి సాయంత్రం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. జీవన్‌రెడ్డికి భార్య ఉమా, ఇద్దరు కుమారులున్నారు. కిషన్‌రెడ్డి పెద్దక్క లక్ష్మీ-నర్సింహారెడ్డి దంపతుల కుమారుడైన జీవన్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం.
ముగిసిన గ్రూప్-3 దరఖాస్తులు
తెలంగాణలో 1375 గ్రూప్-3 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ముగిసింది. మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో గ్రూప్-3 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 24న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
నేడు ఎంసెట్ దరఖాస్తులు
తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తులకు సంబంధించిన షెడ్యూల్ ను నేడు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డితో కలిసి ఆయన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
కంటి వెలుగు రికార్డు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 51 లక్షల 86 వేల 486 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో నిన్నటి వరకు 9 లక్షల 65 వేల 249 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. కంటి వెలుగులో ఇప్పటివరకు మొత్తం 51,86,486 మందికి కంటి పరీక్షలు చేయగా.. ఇందులో మొత్తం 9,65,249 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. అలాగే మొత్తం 6,72,276 మంది ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు. పరీక్షలు చేసిన వారిలో కళ్ల సమస్యలు లేనివారు 35,48,847 మంది ఉన్నారు.
హై కోర్టు సీరియస్
అంబర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించగా.. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎంసీ ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చ్ 16కు వాయిదా వేసింది హైకోర్టు.
ప్రీతి కేసులో నిందితుడి అరెస్ట్
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ వెల్లడించారు. బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ప్రీతిని సైఫ్ గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు.