రేవంత్​ రెడ్డి దూకుడు వెనుక లైఫ్ స్టోరీ

అనుముల రేవంత్​ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకమైన లీడర్. 53 ఏళ్ల చిన్న వయసులోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్​లో కీలక పదవిని ఆయన చేజిక్కించుకున్నారు.

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్​ అయ్యారు. సాధారణంగా కాంగ్రెస్​లో పీసీసీ చీఫ్​ కావాలంటే ఎంతో అనుభవం, వయసూ కావాలి. ఏళ్ల తరబడి పార్టీ సేవల్లో ఉంటే తప్ప ఆ పదవి వరించదు. అలాంటిది పార్టీలో చేరిన మూడున్నర ఏళ్లకే పీసీసీ ఛీఫ్​ పదవి సాధించారు.

ఇంతకీ రేవంత్​ ప్రస్థానం ఏమిటీ? ఎక్కడ మొదలయ్యారు? ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఆ వివరాలు తెలుసుకుందాం..

రేవంత్​ రెడ్డి 1969 నవంబర్​ 8వ తేదీన జన్మించారు. ప్రస్తుత నాగర్​ కర్నూల్​ జిల్లా పాత మహబూబ్​నగర్​ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ఆయన పుట్టిన ఊరు. ఆయన తండ్రి పేరు అనుముల నర్సింహారెడ్డి, తల్లి పేరు రామచంద్రమ్మ. ఏడుగురు అన్మదమ్ములు, ఒక సోదరితో కూడిన పెద్ద కుటుంబంలో రేవంత్​ ఒకరు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేవంత్​ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రేవంత్​ రెడ్డి డిగ్రీ కోసం హైదరాబాద్​కు వచ్చారు. ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో ఆయన విద్యార్థి సంఘ రాజకీయాల పట్ల ఆకర్శితులయ్యారు.

ఇంటర్​లోనే ప్రేమలో పడ్డ రేవంత్​ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి కూడా ఆ ప్రేమే కారణం అని తెలుస్తున్నది. స్వర్గీయ జైపాల్​ రెడ్డి సోదరుని కుమార్తె గీతతో ఆయన లవ్​లో పడ్డారు. అంతస్థుల తేడా రావడంతో అందరి స్టోరీల తీరులోనే రేవంత్​ కూడా లవ్​ని సక్సెస్​ని చేసుకోవడం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన రకరకాల సాహసాలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు.

మొత్తం మీద ఒక రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబంలోని అమ్మాయిని ప్రేమించిన రేవంత్​ అదే రంగంలో పైకి రావాలనుకున్నారు. డిగ్రీ తర్వాత ఊరికి వెళ్లిన రేవంత్​ అక్కడో ప్రింటింగ్​ ప్రెస్​ నడిపారు. అంతకుముందు సామాన్య కార్యకర్తగా ఏబీవీపీ లో రేవంత్​ వాల్ రైటింగ్​ కూడా చేసినట్లు ఫ్రెండ్స్​ చెప్పుకుంటారు. ఆర్​ఎస్​ఎస్​ పత్రిక పనులు చూసే క్రమంలో ఆయన ప్రింటింగ్ అనుభవం వచ్చింది. దాంతో తొలుత అదే బిజినెస్​లోకి దిగిన ఆయన తర్వాత రియల్​ ఎస్టేట్​ వైపు మళ్లారు. రేవంత్​ రెడ్డి ఆర్థిక ఎదుగుదలకు ఆ రంగమే కారణమని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇప్పటికీ అదే ఆయన ప్రధాన వ్యాపారం.

2004లో టీఆర్​ఎస్​లో చేరిన రేవంత్​ కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ల పొత్తు కారణంగా రేవంత్​ ఆశలు ఫలించలేదు. పార్టీని నమ్ముకుంటే లాభం లేదనుకున్న రేవంత్​ 2006లో ఇండిపెండెంట్​ అభ్యర్థిగా మిడ్జిల్​ నుంచి జెడ్​పీటీసీగా గెలిచారు. ప్రజాప్రతినిధిగా ఇది ఆయనకు తొలి అడుగు.

అంతటితో ఆగకుండా రేవంత్​ 2007లో మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొంది చట్టసభల్లో అడుగు పెట్టారు. 2008లో టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్​ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఇది ఆయనకు తొలి విజయం. 2014లో కూడా ఆయన అదే నియోజక వర్గం నుంచి మరోమారు గెలుపొందారు. అట్లా ఆయన తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్​ లీడర్​గా కేసీఆర్​ను ధీటుగా ఎదుర్కొంటూ జనంలో ఆదరణ పొందారు. అప్పుడే రాష్ట్ర స్థాయి నేతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

2015 మేలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్​ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిక్కారు. టీఆర్​ఎస్​కి చెందిన నామినేటెడ్​ ఎమ్మెల్యే స్టీవెన్​సన్​కు డబ్బు ఆశ చూపి ఆయన ఓటును కొనుగోలు చేయాలనే ప్రయత్నించారనే ఆరోపణలతో రేవంత్​ అరెస్ట్​ అయ్యి కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి రేవంత్​ జీవితంలో కొత్త కోణం మొదలయ్యింది. స్టీవెన్​సన్​తో మాట్లాడిన ఆడియో టేపుల లీకేజీ, బెయిల్​ లేకుండా జైల్లో వేయడం రేవంత్​ ఊహించని పరిణామం. దానికి తోడు తన ఏకైక కూతురు నిశ్చితార్ధం ఉన్న సమయంలో జైలుకి పంపడంతో మనోవేదనకు గురైన రేవంత్​ రిలీజ్​ అయిన రోజు కేసీఆర్​కు వ్యతిరేకంగా తొడ గొట్టి మీసం మేలేసి ఆయనను గద్దె దింపుతానని శపథం చేశారు.

టీఆర్​ఎస్​ ఆపరేషన్​ ఆకర్శ్​లో భాగంగా అప్పటికి టీటీడీపీలో ఉన్న చాలా మంది గట్టి నాయకులు కారెక్కడంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యింది.

ఓటు కు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆశలు వదులుకున్నారు. ఆయన కూడా హైదరాబాద్​ నుంచి అమరావతికి మకాం మార్చారు. ఇంకా టీడీపీలో కొనసాగడం వృధా అని, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన రేవంత్ 2017 అక్టోబర్ ​ 25న రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్​లో చేరారు. చేరిన కొద్ది రోజులకే టీపీసీసీకి వర్కింగ్​ ప్రెసిడెంట్​ అయ్యారు. అదే హోదాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా ఇది ఆయనకు తొలి ఓటమి.

ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గమైన మల్కాజ్​గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఆ ఊపులో మరింత దూకుడు పెంచిన రేవంత్​ 2021 జూన్​ 26న పీసీసీ అధ్యక్షుడుగా అనౌన్స్​ అయ్యారు. జులై 7న ఛార్జ్​ తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీని 2023 ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here