జంగుబాయి జాతర పోదామా !

కొండలు …కోనల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు.. ప్రకృతితో విడదీయరాని బంధం. వారి అలవాట్లు.. ఆచారాలు ప్రకృతితోనే ముడివడి ఉంటాయి. కొండ కోనల్లో జీవనం.. అడవే జీవనాధారం. భాష.. వేషధారణ.. పూజలు… పండుగలు… జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ వీరి శైలి విభిన్నం.. ప్రకృతిని దేవతలుగా ఆరాధిస్తుంటారు.

ఏడాది పొడవున సంప్రదాయ దేవుళ్ళకు పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. పుష్యమాసంలో ఆరాధ్య దైవం, వరప్రదాయిని జంగుబాయి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల పాటు కోనసాగే ఉత్సవల్లో జంగుబాయి దైవదర్శనం కోసం లక్షల్లో ఆదివాసులు తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటారు. నెల వంక కనిపించిన వేకువజామున నుండి ప్రారంభమైయ్యే జాతర షురూ అవుతుంది. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.

సహ్యాద్రి పర్వతాల్లో జాతర

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామం. ఇక్కడి మహరాజ్ గూడ సహ్యాద్రి పర్వతంలో ని ఒక గుహలో వేల సంవత్సరాల కిందటే సహజసిద్ధంగా జంగుబాయి కొలువైంది. ఏటా పుష్యమాసంలో నెల రోజుల పాటు ఇక్కడే జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దీపోత్సవ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు షురూ అయితాయి. ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే జంగుబాయి జాతర నెల రోజుల పాటు అడవి తల్లి ఒడిలో వైభవంగా సాగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి ఆదివాసి తెగలకు చెందిన గోండులు, పర్దాన్ , కోళాం తెగలకు చెందిన ఆదివాసులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు.

జాతరకు ఎలా చేరుకోవాలి

ఆసిఫాబాద్ నుండి పోయే భక్తులు కెరమెరి మండల కేంద్రం మీదుగా దేవాపూర్, అనార్ పల్లి, కొండిబాగుడా, మలంగి ,మాలేపూర్ నుండి ఉమ్రి ఎక్స్ రోడ్డు నుండి పరందోళి ,మహరాజ్ గుడా చేరుకుని అక్కడ నుండి రెండు కిలోమీటర్లు పోతే జంగుబాయి ఆలయం వస్తుంది. ఆదిలాబాద్ నుండి వచ్చే భక్తులు ఉట్నుర్, నాన్నుర్, లోకారి మీదుగా ఉమ్రి ఎక్స్ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుండి డైరెక్ట్ నాన్నుర్, కొత్తపల్లి, మాలేపూర్ మీదుగా ఉమ్రి ఎక్స్ రోడ్డు మీదుగా పరందోళి ,మహరాజ్ గుడా మీదుగా జంగుబాయి ఆలయానికి చేరుకోవచ్చు.

కఠిన నియమాలతో పూజలు

పుష్యమాసంలో నెలవంక కనిపించినప్పటికి అమావాస్య వరకు జాతర సాగుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు నెల రోజుల పాటు జాతర సాగుతుంది. ఈ నెల రోజులు ఆదివాసులు కఠిన నియమ నిష్ఠలు పాటిస్తారు. తమ తమ ఇళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఉదయమే ఆవుపేడతో అలుకుచల్లి , చెప్పులు కూడా ఇంటి ఆవరణలో లేకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. జాతర పూర్తి అయ్యేవరకు కటిక నేలపైనే పడుకుంటారు. కనీసం హోటల్లో నీటిని కుడా ముట్టుకోరు. జాతర అయ్యేవరకు పాదరక్షలు దరించారు. నెల రోజులపాటు కొనసాగే ఈ జాతరలో మద్యం అసలే ముట్టరు. జాతర పూర్తి అయిన అనంతరం తిరుగు ప్రయాణంలో ను సాంప్రదాయ ఆచారాలు పాటిస్తారు.

కటోడాలంటే ఇక్కడ పూజారులు

ఇక్కడి పూజారులను కటోడాలు అని పిలుస్తారు. ఇక్కడ 8 గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అత్యంత కఠిన నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. పూజలు పూర్తి కాగానే 8 గోత్రాల పూజారులను గౌరవంగా కలుస్తారు. పూజా సామాగ్రి ఉన్న గంపను నెత్తిపై పెట్టుకుని ఇంటిదారి పడతారు. ఆడపడుచులు వారికి ఎదురుపడి దుస్తులను పరుస్తూ ఎవరి స్థాయిలో వారు కానుకలు సమర్పిస్తూ వాటిని దాటుకుంటూ వెళ్తుంటారు . గిరిజన సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో తరలివెళ్ళి గూహలో వెళ్లి జంగుబాయి అమ్మ వారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆనంతరం మైసమ్మ ,పోచమ్మ వద్ద మేకలు , కోళ్లు బలిచ్చి మొక్కలు తీర్చుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని సహ పంక్తి బోజనాలు చేసి పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here