తెలంగాణ కుంభమేళా మేడారంలో.. ఆ నాలుగు రోజులు..

తెలంగాణ కుంభమేళ. మేడారం మహాజాతర. రెండేళ్ల కోసారి మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది ఫిభ్రవరి 16న మొదలు కానుంది. కుంభమేళా తర్వాత ఆసియాలో జరిగే అతి పెద్ద జాతర ఇదే. అందుకే గిరిజనుల కుంభమేళాగా మేడారం జాతర కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండేళ్లకోసారి గిరిజనులు మేడారం అటవీ ప్రాంతంలో జరుపుకునే జాతర.. ఇప్పుడు నిత్య పుణ్య క్షేత్రంగా మారింది.

జాతర జరిగే నాలుగు రోజులతో పాటు కోటికి పైగా భక్తులు తరలి వచ్చే మేడారం.. ఇప్పుడు ప్రతి రోజు భక్తుల దర్శనాలతో కిటకిటలాడుతోంది. కొవిడ్ భయంతో ఈ ఏడాది భక్తులు పోటీ పడి ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. అందుకే డిసెంబర్ మొదటి వారం నుంచే భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రతీ ఆది, బుధవారాల్లో లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణతో పాటు చుట్టూరా ఉన్న ఎనిమిది రాష్ట్రాల నుంచి ఇక్కడి భక్తులు తరలివస్తారు. ఇప్పటికీ ఆదివాసీలు, గిరిజనులు ఎడ్లబండ్లపైనే ఇక్కడికి తరలిరావటం ఈ జాతర స్పెషల్.

మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని రెండేళ్ల కోసారి ములుగు జిల్లా (పాత వరంగల్ జిల్లా) తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ మహా జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ యేడాది ఫిభ్రవరి 16 న మొదలయ్యే జాతర 19న ముగియనుంది.

16న కన్నెపల్లి నుంచి సమక్క కూతురు సారలమ్మ, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు గద్దెలను చేరుకుంటారు. సారలమ్మ రాకతో జాతర ఘట్టం ప్రారంభం కానుండగా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కన్నెపల్లిలోని లోని వరాల తల్లి సారలమ్మ గుడి వద్ద సంతానం కోసం, తదితర రుగ్మతల నయం కోసం భక్తులు పొర్లుదండాలు పెట్టడం ఆనవాయితీ. వీరి మీది నుంచి తల్లిని తీసుకెళ్లే అద్భుత ఘట్టం.. జంపన్నవాగు మీదుగా గద్దెను చేరే క్రమంలో దారి పొడవునా భక్తుల స్వాగతం భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.

17న గురువారం చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి మేడారం లోని గద్దెను చేరడంతో జాతర పతాక స్థాయికి చేరనుంది. దారి పొడవున జంతుబలులు, ఎదరుకోళ్లు, ఓడిబియ్యంలు పోస్తూ మొక్కులు చెల్లించుకోవడం జాతరకు హైలెట్గా నిలుస్తుంది. సాయంత్రం 5 తర్వాత గుట్టను దిగే సమ్మక్క రాత్రి పొద్దుపోయాక గద్దెను చేరనుంది. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలతో మేడారం భక్త జన పారవశ్యంతో ఉర్రూతలూగనుంది.

18న శుక్రవారం మొక్కులు, 19న తిరిగి సమ్మక్క చిలుకల గుట్ట పైకి, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు తమ ఆలయాలకు వెళ్లడంతో జాతర ముగియనుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here