జ్వరమొస్తే యాంటి బయాటిక్స్​ వద్దు.. ఈ రోజు టాప్​ టెన్​ న్యూస్​

1. డిసెంబర్ 9న మెట్రో సెకండ్ ఫేజ్‌కు పునాదిరాయి

హైదరాబాద్ మెట్రో రైల్ ట్రాక్​ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ పునాది రాయి వేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌ వరకూ 31 కిలోమీటర్ల మేర మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.6,250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. పూర్తి వివరాల లింక్​

2. సిరిసిల్ల నేతన్నను ప్రశంసించిన మోదీ

సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్‌ను ఆదివారం జరిగిన మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసించారు. జీ-20 సమావేశాల లోగోను హరిప్రసాద్‌ తన చేతితో స్వయంగా నేసి, మోదీకి పంపించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని.. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని మన్‌కీ బాత్‌లో అభినందించారు.

3. బీఆర్ఎస్​ ఢిల్లీని గెలిస్తే.. ఐటీ రైడ్స్‌ ఉండవ్‌: మల్లారెడ్డి

కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. సంపాదించుకున్న వాళ్లు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే.

4. నేటి నుంచి నయా ట్రాఫిక్స్‌ రూల్స్‌

హైదరాబాద్లో సోమవారం‌ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ ప్రకారం రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ కు రూ.1200 వరకు ఫైన్ విధించనున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడితే వాహనదారుడిపై పెండింగ్ ఉన్న చలాన్లు అన్నీ కట్టే వరకూ వదిలిపెట్టబోమని‌ పోలీసులు ప్రకటించారు.–

5. నేడు దామరచర్ల పవర్​ ప్లాంట్​కు కేసీఆర్

నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను సోమవారం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల సమీపంలోని వీర్లపాలెం చేరుకుంటారు. మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి పవర్‌ ప్లాంట్‌ పనులను పరిశీలిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అక్కడే లంచ్‌ చేస్తారు. పనులు ఏ దశలో ఉన్నాయి.. ఎప్పట్లోగా పూర్తవుతాయనే దానిపై ధికారులు, వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షిస్తారు.

6. చైనాలో లాక్‌డౌన్ భయం.. అన్​ లాక్ చైనా ఆందోళనలు

చైనాలో జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జిన్పింగ్ సర్కార్ విధించిన కఠినమైన లాక్​ డౌన్ కారణంగా ఉరుమ్‌కీలోని ఓ బిల్డింగ్లో గురువారం 10 మంది సజీవ దహనం అయ్యారని ప్రజలు మండిపడ్డారు.  షాంఘైలోని ఓ గవర్నమెంట్ ఆఫీస్ ముందు వందలాది మంది ప్రజలు గుమిగూడి ‘‘జిన్‌పింగ్‌ స్టెప్‌ డౌన్‌.. అన్‌లాక్‌ చైనా..” అంటూ నినాదాలు చేశారు. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

7. డిసెంబర్ 8 నుంచి పోలీస్​ అభ్యర్థులకు ఈవెంట్స్

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ నిర్వహిస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.  4,63,970 మంది ఈవెంట్స్‌లో పాల్గొననున్నారు. వీరికి మంగళవారం నుంచి డిసెంబర్‌‌ 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్మిట్‌ కార్డులను ఇష్యూ చేయనున్నారు. అభ్యర్ధులు టీఎస్‌ఎల్‌పీఆర్‌‌బీ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తి వివరాల లింక్​

8. గోల్కొండ మెట్లబావికి యునెస్కో గుర్తింపు

ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అవార్డులను ప్రకటించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ కేటగిరీలో చోటు సంపాదించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు అరుదైన అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించాయి.

9. జ్వరానికి యాంటిబయాటిక్స్ వద్దు

యాంటీబయోటిక్స్‌ వినియోగంపై ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు (లో గ్రేడ్‌ ఫీవర్‌) ఉంటే యాంటీబయోటిక్స్‌ వాడడం మంచిది కాదని హెచ్చరించింది. వైరల్‌ బ్రాంకైటిసకు కూడా యాంటీబయోటిక్స్‌ వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించింది. యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలనుకుంటే పేషెంట్‌ హిస్టరీని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

10. బండి సంజయ్ అరెస్ట్.. యాత్రకు బ్రేక్

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్‌ వెళ్తున్న బండి సంజయ్‌ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బైంసాలో నిర్వహించే సభకు రేపు కచ్చితంగా వెళ్తామన్నారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కేసీఆర్‌ నియంత పాలనకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాకకోసం ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు సరికాదన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here