ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళకు చెందిన భారత్ ధర్మ జన సేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్ విచారణపై స్టే విధించాలని కోరారు. తన పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని రిట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 21న విచారణకు రావాలని తనకు 16న 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారన్నారు. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ ఈ–మెయిల్ చేసినట్లు చెప్పారు. ఈ–మెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనని ప్రస్తావించారు. ఫాం హౌస్‌లోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీ, ఆడియో రికార్డులను రాజేంద్రనగర్ ఏసీపీ సీఎం కేసీఆర్‌కు ఇచ్చారని తెలిపారు. ఒక ప్రణాళికతో ఆ వివరాలు సేకరించి సీజేఐ, అన్ని హైకోర్టుల సీజేలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపారన్నారు. ఈ కేసులో నిందితుడు కాని తనకు 41ఎ నోటీసు జారీ చేయడం అన్యాయమన్నారు. పత్రికల్లో ముందే అన్నీ ప్రచురణ అయ్యాయని, ఇది తన పరువుకు భంగం కలిగించిందని అన్నారు. తొలుత ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, ఈ నెల 23న కింది కోర్టులో మెమో ద్వారా నిందితుడిగా చేర్చినట్లుగా సిట్ పేర్కొందన్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమన్నారు. డబ్బులు దొరకనప్పుడు నేరం జరిగిందని అభియోగం మోపడం చెల్లదన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాజకీయ కుట్రతో సిట్ దర్యాప్తు జరుగుతోందని, రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న సిట్ దర్యాప్తుపై స్టే విధించాలని కోరారు. ఈ రిట్‌ను హైకోర్టు విచారణ చేయనుంది.
సిట్ రద్దు చేయాలి.. రిట్ వేసిన శ్రీనివాస్
ఫామ్ హౌజ్ కేసులో బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి చేస్తోందని కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. సిట్ ను రద్దు చేసి కేసును సీబీఐ కు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణ ఎదురుకుంటున్న లాయర్ శ్రీనివాస్ హై కోర్టులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 41 సీఆర్‌పీసీ కింద తాను రెండు రోజులు సిట్ ముందు హాజరైతే.. బండి సంజయ్ పేరు చెప్పాలని విచారణ సందర్భంగా సిట్ పోలీసులు ఒత్తిడి చేసినట్టు అందులో ప్రస్తావించారు. ప్రభుత్వం జారీ చేసిన సిట్ జీవోను రద్దు చేయాలని కోరారు. SIT నిష్పక్షపాతంగా విచారణ చేయటం లేదని అందులో పేర్కొన్నారు.