ఎమ్మెల్యేల కేసులో మరో మలుపు
ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళకు చెందిన భారత్ ధర్మ జన సేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్ విచారణపై స్టే విధించాలని కోరారు. తన పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని రిట్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు
హైడ్రామాతో మొదలైన బండి యాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయిదో విడత పాద యాత్ర హైడ్రామాతో మొదలైంది. పోలీసులు అనుమతి నిరాకరించటంతో యాత్రకు అనుమతి ఇవ్వాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించాలని, హాజరయ్యేవారు కర్రలను వెంట తీసుకెళ్లొద్దని హైకోర్టు షరతులు విధించింది. అంగీకరించిన బీజేపీ భైంసా బహిరంగ సభ ను ఈ రోజు (బుధవారానికి) వాయిదా వేసింది. రోజంతా కొనసాగిన ఉత్కంఠ పరిణామాలతో సంజయ్ యాత్ర మంగళవారం సాయంత్రం మొదలైంది. సాయంత్రం నిర్మల్‌కు చేరుకున్న సంజయ్ సారంగపూర్ ఆడెల్లి పోచమ్మ గుడి లో పూజలు చేసి యాత్ర ప్రారంభించారు.
షర్మిల యాత్ర ఉద్రిక్తత.. అరెస్ట్.. క్యారవాన్‌ను తగులబెట్టిన టీఆర్‌ఎస్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సంపేట్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాత్రపై దాడి చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. షర్మిల క్యారవాన్‌కు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో హైదరాబాద్ తరలించారు.
దామరచర్ల ప్లాంట్ పరిశీలించిన సీఎం కేసీఆర్
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనుల గురించి బీహెచ్‌ఈఎల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 వేల మెగావాట్ల కెపాసిటీతో ఈ ప్లాంట్ నిర్మిస్తోందన్నారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్లాంట్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.152 కోట్ల ఉపాధి నిధులు దారి మళ్లించారా..
కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ కోసం కేంద్రం ఇచ్చిన రూ.152 కోట్లను వేరే పనుల కోసం మళ్లించింది. మళ్లించిన డబ్బులను వాపస్ చేయాలని రాష్ట్ర సర్కార్ కేంద్ర ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. నిధులను ఈ నెల 30లోపు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర సర్కార్ చేసిన తప్పు వల్ల ఉపాధి హామీ స్కీమ్‌కు కేంద్రం నిధులను నిలిపివేసే ప్రమాదముంది.
భర్తను ముక్కలుగా నరికిన భార్య
శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను చంపి 10 ముక్కలుగా నరికేసింది. ఇద్దరూ కలిసి బాడీ పార్ట్స్‌ను ఫ్రిజ్‌లో దాచి నాలుగు రోజుల పాటు సిటీలో వేర్వేరు చోట్ల పడేశారు. ఢిల్లీలోని పాండవ్నగర్లో 6 నెలల కింద జరిగిన ఈ హత్య సోమవారం బయటపడింది. శ్రద్ధా వాకర్ బాడీ పార్ట్స్ కోసం సెర్చ్ చేస్తుండగా పోలీసులకు పాండవ్‌నగర్‌లోని ఓ గ్రౌండ్లో కుల్లిన స్థితిలో మనిషి తల, చేతులు దొరికాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ పార్ట్స్ పడేసిన తల్లీకొడుకులైన పూనమ్, దీపక్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
బొట్టు బిల్లలు.. దీపం వత్తులతో రూ.250 కోట్ల మోసం
ఈజీ మనీ కోసం వెంపర్లాడి హైదరాబాద్ జనాలు మరోసారి మోసపోయారు. ఏఎస్‌రావు నగర్‌కు చెందిన రమేశ్‌రావు అనే వ్యక్తి ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట ఓ కంపెనీ పెట్టాడు. బొట్టు బిళ్లలు, దీపం వత్తులు సప్లై చేసేవాళ్లు కావాలని జనాలను నమ్మించాడు. తయారీ మెషీన్లు కూడా తానే సప్లై చేస్తానని ఇందుకోసం రూ.పది లక్షల డిపాజిట్ చేయాలని ఎరవేశాడు. తయారైన బొట్టుపిల్లలు, వత్తులను తానే భారీ ధరకు కొనుగోలు చేస్తానని ఆశచూపాడు. అతన్ని నమ్మి సుమారు వందల మంది మెషిన్లు కొనుగోలు చేశాడు. సుమారు రూ.250 కోట్ల వరకూ జమ అయ్యాక, రమేశ్‌రావు బిచానా ఎత్తేసి పారిపోయాడు. బాధితులు పోలీసులు ఆశ్రయించారు.
ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత
ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు విదేశీయుల నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై విచారణ చేస్తున్నామని డీఆర్‌ఐ ప్రకటించింది.
కరీంనగర్ ఫిలిగ్రికీ నేషనల్ అవార్డు
సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి నేషనల్ అవార్డు దక్కింది. కరీంనగర్ కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు గద్దె అశోక్ కుమార్ వెండితో తయారు చేసిన తీగల పల్లకీకి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ‘శిల్ప్ గురు అండ్ నేషనల్స్ అవార్డ్స్’ప్రొగ్రాం జరిగింది. ఈ వేడుకలో కేంద్ర జౌళీ శాఖ మంత్రి జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయాల్ చేతుల మీదుగా చేతుల మీదుగా అశోక్ కుమార్ నేషనల్ అవార్డును అందుకున్నారు.
ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు:
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో రుతురాజ్ ఈ ఫీట్ సాధించాడు. శివసింగ్ బౌలింగ్‌లో వరుసగా ఏడు సిక్సర్లు బాదాడు. 49 ఓవర్‌లో వరుసగా తొలి నాలుగు బంతులను రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపాడు. నోబాల్ అయిన ఐదో బంతి కూడా సిక్స్ కొట్టాడు. దీంతో అదనంగా లభించిన ఫ్రీహిట్ బంతితోపాటు చివరి బంతిని కూడా సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్‌లో రుతురాజ్ ఏకంగా 42 పరుగులు రాబట్టగా, నో బాల్‌కు లభించిన పరుగుతో కలిపి ఆ ఓవర్‌లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో ఏఢు సిక్సర్లు బాదిన రుతురాజ్.. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 159 బంతుల్లో రుతురాజ్ 10 ఫోర్లు, 16 సిక్సర్లతో అజేయంగా 220 పరుగులు చేశాడు.