పదో తరగతిలో అమానుషం.. షర్మిల కారుకు టోయింగ్​ వ్యాన్​ కట్టి అరెస్ట్.. భైంసాలో సంజయ్​ సభ.. టుడే టాప్​ న్యూస్​

క్లాస్‌మేట్‌ను రేప్ చేసిన దుర్మార్గులు

హైదరాబాద్‌లోని హయత్ నగర్ తట్టి అన్నారంలో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థిని పై అదే పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయం లో వీడియో తీశారు. ఎవరికైనా చెబితే విడియో ని సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించారు. పదిరోజుల తరువాత ఆ వీడియోలు చూపించి బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల తర్వాత ఆ వీడియోలను ఫ్రెండ్స్​కు షేర్​ చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లలో అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిది, పదో తరగతి చదువుతున్న అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి జువైనెల్​ హోమ్​కు తరలించారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్:

నిరుద్యోగులకు సీఎస్ సోమేశ్‌కిమార్ గుడ్ న్యూస్ చెప్పారు‌. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు.  మంగళవారం బీఆర్కే భవన్ లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో సమావేశమై రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌పై చర్చించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల్లోని ఉన్నతాధికారులు సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా వివరాలను త్వరగా టీఎస్‌పీఎస్సీకి  అందిస్తే, వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

ప్రగతిభవన్​ ముట్టడి ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్:

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం చేసిన దాడికి నిరసనగా, మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి షర్మిల‌ ప్రయత్నించారు. పంజాగుట్టలో ఆమె కారుకు పోలీసులు అడ్డుతగిలారు. డోర్‌ లాక్‌ చేసుకుని షర్మిల కారు లోపలే ఉండడంతొ, కారును క్రేన్‌తోనే లిఫ్ట్‌ చేసి టోయింగ్​ వ్యాన్​ కు​ కట్టి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పీఎస్‌‌లో బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించగా,  మేజిస్ట్రేట్ ఆమెకు రాత్రి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నర్సంపేట నుంచి యాత్ర చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులకు సూచించారు. అంతకుముందు షర్మిలకు మద్దతు తెలిపేందుకు స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్‌ విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో  లోటస్​పాండ్​ ఇంటి ఆవరణలోనే విజయమ్మ దీక్ష చేపట్టారు. కోర్ట్ బెయిల్ మంజూరు చేసి, షర్మిల ఇంటికి చేరుకున్నాక ఆమె దీక్ష విరమించారు. షర్మిలను అరెస్టు చేసిన తీరు ఆందోళనకరంగా ఉందని గవర్నర్​ తమిళిసై విచారం వ్యక్తం చేశారు.

భైంసా బాధితులకు ఉద్యోగాలు:

తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా (మహీష) మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం జరిగిన సభలో  ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామన్నారు. అక్కడి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఇక్కడి నుంచి యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. టీఆర్​ఎస్​ను ఓడించి తీరుతామని అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజేపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

కవిత వర్సెస్ రేవంత్:

తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డా అని, ఉద్యమంలో జరిగిన ప్రతీ బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యేనని కవిత ట్వీట్ చేశారు. దీక్ష దివాస్ సందర్భంగా కవిత పెట్టిన ఈ ట్వీట్‌పై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరవీరుల బలిదానాలకు చంద్ర గ్రహణంలా దాపురించిన కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త్యాగాలు చేసిందెవరు..భోగాలు అనుభవిస్తోందెవరనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసన్నారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే, బతుకమ్మ ఆడినందుకే, బోనం కుండలు ఎత్తినందుకే ..మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి అని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు.

జనవరి 18 నుంచి కంటి వెలుగు

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్​రావు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్​లో ఈ కార్యక్రమం అమలుపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2017 ఆగస్టు 15న కంటి వెలుగు తొలి దశ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దానికి కొనసాగింపుగానే రెండో విడత ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్​ నుంచే ఇంటికి రూ.3 లక్షల స్కీమ్​

సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షలు ఇచ్చే స్కీమ్​ను డిసెంబర్​ నుంచి ప్రారంభించనున్నట్లు ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన మంత్రి డబుల్​ బెడ్రూం ఇళ్ల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన పేదలను గుర్తించి ఇండ్ల పంపిణీ వెంటనే జరిగేలా చూడాలని ఆదేశించారు. స్థలాలున్న పేదలను గుర్తించి రూ.3 లక్షల స్కీమ్​కు లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.

౩ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్:

తెలంగాణకు చెందిన మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ముక్తేశ్వర- చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (భూపాలపల్లి జిల్లా), ఛ‌నాక కొరాట బ్యారేజీ (ఆదిలాబాద్ జిల్లా), చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం (నిజామాబాద్ జిల్లా)లు ఉన్నాయి. ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీఏసీ మీటింగ్ లో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డ్రోన్లపై గద్దలతో యుద్ధం:

శత్రు దేశాల కుట్రలను కట్టడి చేసేందుకు ఇండియన్ ఆర్మీ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. శత్రు దేశాల డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.  ఉత్తరాఖండ్‌లోని ఔలీలో భారత్, అమెరికా ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు ‘యుద్ధ్ అభ్యాస్’లో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేయడంతో ఆ శబ్దాన్ని గమనించిన ఓ ఆర్మీ శునకం సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే డ్రోన్లను వేటాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ‘అర్జున్’ అనే గద్ద గాల్లో ఎగురుతున్న డ్రోన్‌ను కనిపెట్టి కూల్చివేసింది. శత్రు దేశాల డ్రోన్లను వేటాడేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

ఎ‌యిర్ ఇండియాలో విస్తారా విలీనం:

విమానయాన సంస్థ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేస్తున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో  మొత్తం 218 విమానాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రధాన విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించనుంది. భారత అతిపెద్ద అంతర్జాతీయ విమాన సంస్థగా, దేశీయంగా రెండవ అతిపెద్ద క్యారియర్‌గా తమ సంస్థ నిలవనుందని టాటా గ్రూప్ పేర్కొంది.  విలీన ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ.2,059 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ లావాదేవీ మార్చి 2024 లోగా పూర్తయ్యే అవకాశముందని కంపెనీ అంచనా వేసింది.

ఎన్‌డీటీవీకి ప్రణయ్​ రాయ్​ రిజైన్​

అదానీ టేకోవర్ చేస్తున్న ఎన్‌డీటీవీకీ ప్రణయ్‌రాయ్, రాధిక రాయ్ రిజైన్ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ఆ సంస్థ బాంబే ఎక్చేంజ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటివరకూ ప్రణయ్, రాధిక బోర్డు‌ డైరెక్టర్లు‌గా కొనసాగారు. అదానీ ఎన్‌డీటీవీ‌ని బలవంతంగా టేకోవర్ చేస్తుండడం ఇష్టం లేక పోవటమే రాయ్​ల రాజీనామాలకు కారణమని చర్చ జరుగుతోంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

TODAY TELUGU PAPERS HEAD LINES 2022 NOV 30