హీరో సరసన హీరోయిన్ గా నటించడం, మళ్లీ అదే హీరోకు తల్లిగా నటించడం అనేది ఇండస్ట్రీలో చాలా రేర్. అలా ఓ ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి హీరోయిన్ గా, ఆయనకు తల్లిగా నటించారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?
చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీరుడు. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ గా జయసుధ నటించింది. అంతే కాకుండా ఇది కథ కాదు సినిమాలో కూడా జయసుధ.. చిరంజీవికి హీరోయిన్ గా నటించింది. చిరంజీవితో జోడీ కట్టిన జయసుధ.. రిక్షావోడు సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
ఇక చిట్టిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా సుజాత నటించారు. ఇక సీతాదేవి సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెల్లుగా కూడా నటించారు. అయితే విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్‌బాస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా సుజాత నటించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రోజా హీరోయిన్ గా నటించింది.
యాదృచ్ఛికంగా చిరంజీవికి తల్లిగా జయసుధ, సుజాత నటించిన రెండు చిత్రాలు రిక్షావోడు, బిగ్ బాస్ చిత్రాలు 1995లోనే రిలీజ్ అయ్యాయి. ఇందులో బిగ్‌బాస్ జూన్ 15, 1995న రిలీజ్ కాగా, రిక్షావోడు 1995 డిసెంబరు 14న విడుదలైంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రేమతరంగాలు చిత్రంలో చిరంజీవి, జయసుధ, సుజాత కలిసి నటించారు. ఇందులో మరో హీరోగా కృష్ణంరాజు నటించారు.