తెలంగాణలో గెలుచుడే అంటున్న అమిత్​షా.. కాంగ్రెస్​ సీఎంపై రేవంత్​రెడ్డి క్లారిటీ .. కులం మతం అన్నం పెట్టవన్న కేటీఆర్​.. ప్రీతి తప్పుడు రిపోర్టులపై గవర్నర్​ సీరియస్​.. రిజైన్​ చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా.. ఈరోజు టాప్​ న్యూస్

గ్రూప్​ 2 పరీక్షలు ఆగస్ట్ 29, 30 తేదీల్లో

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష తేదీలను టీఎస్‭పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఆగష్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను టీఎస్‭పీఎస్సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది. మొత్తం 783 గ్రూప్​ 2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.

తెలంగాణలో అధికారంలోకి రావాలి: అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. తన ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చే వరకు ఎంత సమయమైనా కేటాయిస్తానని, ఎన్ని సార్లయినా రాష్ట్రానికి వస్తానని ఆయన పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీ మినీ కోర్​ కమిటీ లీడర్లను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించిన అమిత్​షా, బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా దాదాపు రెండున్నర గంటల పాటు వారితో సమావేశమయ్యారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేసేందుకు, ప్రజా తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లుగా ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఇక్కడి వనరులను ఎలా దోపిడీ చేశారో, ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని ఎలా కొల్లగొట్టారో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఎలా దారి మళ్లించారో హర్ ఘర్​ కీ కమల్​ పేరుతో ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు.

కాంగ్రెస్​లో పది మంది సీఎంలు : రేవంత్​ రెడ్డి

కాంగ్రెస్​లో సీఎం సీటును అధిరోహించే సామర్థ్యం ఉన్నవాళ్లు పది మందికి పైగా ఉన్నారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. పార్టీ అధిష్ఠానమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావటమే ప్రస్తుత తన కర్తవ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ కాంగ్రెస్​కు పొత్తు ఉండదని అన్నారు. జాతీయ స్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఏపీలో జనసేనతో కలవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని, అలాంటి పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. రేవంత్‌ చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. కాసేపు తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రేవంత్​రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడారు.

ప్రీతి రిపోర్టులపై గవర్నర్​ సీరియస్​​

డాక్టర్​ ప్రీతి ఆరోగ్యం పై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై​ సీరియస్​ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలపై ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాలేజీలలో యాంటీ ర్యాగింగ్​ చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. మహిళా మెడికోల కోసం కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 

ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ రూ. 8 లక్షలు ఇవ్వనుండగా కార్పొరేటర్లు తమ నెల జీతం రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు  ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్​ సిటీలో వీధి కుక్కల బెడదపై నివారణకు కమిటీ వేయాలని తీర్మానించింది. ప్రదీప్ మృతి చెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటగా తీసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16  కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్​లో రియల్​ కంపెనీలపై ఐటీ సోదాలు

హైదరాబాద్​లో వరుసగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు డైరెక్టర్ల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగాయి.  

మనీష్​ సిసోడియా, సత్యేంద జైన్​ రాజీనామా

సిసోడియా, సత్యేంద్ర రాజీనామా

    ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్‌ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ ఆమోదించారు. మద్యం కేసులో సిసోడియాను సీబీఐ రెండు రోజుల కిందటే అరెస్టు చేసింది. సత్యేంద్ర జైన్‌ మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో ఉన్నారు. వీరిద్దరి స్థానంలో కొత్తగా ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని, పోర్టు ఫోలియోలను ఇతర మంత్రులకు అప్పగించనున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.

    మతం కులం అన్నం పెట్టవు : మంత్రి కేటీఆర్​

    పచ్చని తెలంగాణలో మతం, కులం పేర్లతో పంచాయితీలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ చలి మంటలతో ఓట్లు సంపాదించుకోవాలనే వారిని ప్రజలు ఒక కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి తన సొంత నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఎల్లారెడ్డిపేటలో నిర్మించిన తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. వృద్ధులతో కాసేపు కాలక్షేపం చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

    LATEST POSTS

    SHANDAAR HYDERABAD

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc